distance learning
-
ఓడీఎల్ అడ్మిషన్లు కఠినతరం
సాక్షి, అమరావతి: ఆన్లైన్, ఆన్లైన్ డిస్టెన్స్ లెర్నింగ్ (ఓడీఎల్) కోర్సులకు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఓడీఎల్ ప్రోగ్రాముల పేరిట అనేక ఆన్లైన్ విద్యా సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ ఇష్టానుసారంగా కోర్సులను అందిస్తామంటూ విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు యూజీసీ పటిష్ట విధివిధానాలను ప్రకటించింది. ఆండర్ గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్లలో ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్, ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రాంలకు సంబంధించి తాజా నియంత్రణ నిబంధనలను విడుదల చేసింది. అలాగే, 2020లోనూ యూజీసీ కొన్ని మార్గదర్శకాలను వెల్లడించింది. యూజీ, పీజీ డిగ్రీలకు సంబంధించి ఆయా సంస్థల నిర్దేశిత ప్రమాణాలను పాటించేలా 2021లో మరికొన్ని సవరణలను ప్రతిపాదించింది. ఈ ప్రోగ్రాముల్లో కనీస బోధనా ప్రమాణాలుండేలా తాజాగా మరిన్ని నిబంధనలను రూపొందించింది. ఈ అంశాల్లో ఓడీఎల్, ఆన్లైన్ ప్రోగ్రాంలకు నో.. ఓడీఎల్, ఆన్లైన్ ప్రోగ్రాంలలో కొన్ని అంశాలను మాత్రమే యూజీసీ అనుమతులిస్తోంది. ప్రాక్టికల్స్, ఇతర క్షేత్రస్థాయి ప్రయోగాలతో సంబంధమున్న అంశాల్లో ఓడీఎల్, ఆన్లైన్ ప్రోగ్రాంలను నిషేధించింది. అవి.. ♦ ఇంజనీరింగ్, మెడికల్, ఫిజియోథెరపీ, ఆక్యుపేషన్ థెరపీ, పారామెడికల్, ఫార్మసీ, నర్శింగ్, డెంటల్, ఆర్కిటెక్చర్, లా, అగ్రికల్చర్, హారి్టకల్చర్, హోటల్ మేనేజ్మెంట్, కేటరింగ్ టెక్నాలజీ, కలినరీ సైన్సెస్, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్, విజువల్ ఆర్ట్స్, స్పోర్ట్స్, ఏవియేషన్. ♦ ఇవేకాక.. అధికారిక నియంత్రణ సంస్థలు అనుమతించని ప్రోగ్రాములు వేటినీ ఓడీఎల్, ఆన్లైన్ కోర్సుల కింద ఆయా సంస్థలు అందించడానికి వీల్లేదు. యోగా, టూరిజమ్ అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ వంటి అంశాల్లో యూజీ, పీజీ ప్రోగ్రాంలు అందించడానికీ వీల్లేదు. అలాగే, ఆయా సబ్జెక్టులలో ఎంఫిల్, పీహెచ్డీ ప్రోగ్రాంలను ఓడీఎల్, ఆన్లైన్ కోర్సులుగా అందించకూడదు. ఓడీఎల్, ఆన్లైన్ ప్రోగ్రాంలు అందించే ఉన్నత విద్యాసంస్థలు ఆయా కోర్సులకు సంబంధించి నియంత్రణ సంస్థల అనుమతుల పత్రాలు, అఫిడవిట్లు, ఇతర సమాచారాన్ని పూర్తిగా తమ వెబ్సైట్లో పొందుపరచాలి. అడ్మిషన్లు తీసుకునే ముందే పరిశీలించాలి.. ఇక విద్యార్థులు ఆయా సంస్థలు అందించే ఓడీఎల్, ఆన్లైన్ కోర్సుల్లో చేరే ముందు అవి అధికారిక నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు తీసుకున్నాయో లేదో ముందుగా పరిశీలించుకోవాలని.. అలాగే, ఆయా ఉన్నత విద్యాసంస్థల వెబ్సైట్లలో ఓడీఎల్, ఆన్లైన్ కోర్సులకు సంబంధించిన వివరాలను తనిఖీ చేసుకోవాలని యూజీసీ సూచించింది. అకడమిక్ సెషన్ల వారీగా అనుమతుల స్థితిని యూజీసీ వెబ్సైట్ ‘హెచ్‌టీటీపీఎస్://డీఈబీ.యూజీసీ.ఏసీ.ఐఎన్’లో యూజీసీ అందుబాటులో ఉంచింది. అడ్మిషన్లు తీసుకునే ముందు యూజీసీ వెబ్‌సైట్‌లోని నోటీసులు, ఇతర ప్రజాసంబంధిత హెచ్చరికలను పరిశీలించాలని కోరింది. యూజీసీ వెబ్సైట్లో ఆయా సంస్థల సమాచారం.. ఓడీఎల్ కోర్సులందించేందుకు అనుమతులున్న సంస్థల వివరాలను కూడా తమ వెబ్సైట్లో ఉంచినట్లు యూజీసీ పేర్కొంది. ఆయా డిగ్రీ ప్రోగాంల పేర్లు, వాటి కాలపరిమితి, ఆయా సబ్జెక్టుల అంశాలు యూజీసీ సవరణ నిబంధనలు–2024 ప్రకారం ఉన్నాయో లేవో సరిచూసుకోవాలి. నిషేధిత జాబితాల్లోని ప్రోగ్రాములుంటే కనుక వాటిలో చేరకుండా జాగ్రత్తపడాలి. ఇదిలా ఉంటే.. ఈ కోర్సులను అందించడానికి సంబంధించి కొన్ని విద్యాసంస్థలను డిబార్ చేసినట్లు యూజీసీ ప్రకటించింది. అందులో నర్సీ ముంజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (మహారాష్ట్ర), శ్రీ వేంకటేశ్వర వర్సిటీ (ఆంధ్రప్రదేశ్) పెరియార్ యూనివర్సిటీ (తమిళనాడు) ఉన్నాయి. ఈ సంస్థలు 2023 జూలై–ఆగస్టు, 2024 జనవరి–ఫిబ్రవరి సెషన్లకు సంబంధించి ఓడీఎల్, ఆన్లైన్ కోర్సులు అందించకుండా డిబార్ చేసినట్లు వివరించింది. ఫ్రాంఛైజీలపై నిషేధం.. సెంట్రల్ వర్సిటీలు, రాష్ట్ర వర్సిటీలు, ప్రైవేటు వర్సిటీలు, డీమ్డ్ వర్సిటీలు ఏవైనా సరే తమ కేంద్ర కార్యాలయాల ద్వారా మాత్రమే అందించాలి. ఫ్రాంచైజీల రూపంలో ఓడీఎల్ ప్రోగ్రాములు అందించడానికి వీల్లేదు. అలాగే, లెర్నర్ సపోర్టు కేంద్రాలను నేరుగా ఆయా ఉన్నత విద్యాసంస్థలే నిర్వహించాలి. ఫ్రాంఛైజీల ద్వారానో, ఔట్ సోర్సింగ్ ద్వారానో నిర్వహించేందుకు వీల్లేదు. ఈ ఓడీఎల్ ప్రోగ్రాంలు, ఆన్లైన్ కోర్సులకు సంబంధించి పూర్తిగా ఆయా ఉన్నత విద్యాసంస్థలే బాధ్యులుగా ఉండాలి. ఫ్రాంఛైజీల ద్వారా అందించేందుకు యూజీసీ అనుమతించదు. ఆయా విద్యాసంస్థలు అందించే ప్రోగ్రాంలు యూజీసీ నియమ నిబంధనలకు లోబడి ఉంటేనే వాటికి అండర్ గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో సమానత వర్తిస్తుంది. ఓడీఎల్, ఆన్లైన్ ప్రోగ్రాంలకు అడ్మిషన్లను కూడా నిర్ణీత గుర్తింపు ఉన్న కాలానికి మాత్రమే చేపట్టాలి. టెరిటోరియల్ పరిధిలోనే కోర్సులు.. మరోవైపు.. ఓడీఎల్, ఆన్లైన్ ప్రోగ్రాంలను అందించే సంస్థల టెరిటోరియల్ పరిధిని కూడా యూజీసీ నిర్దేశించింది. ఆయా సంస్థలు తమ కోర్సులను అనుమతులున్న కాలంలో ఎక్కడి వారికైనా అందించవచ్చు. అయితే, వాటి కార్యకలాపాలు కేవలం తమ సంస్థకు నిర్దేశించిన పరిధిలోనే చేపట్టాలని యూజీసీ పేర్కొంది. ♦ సెంట్రల్ వర్సిటీలు వాటి చట్టంలో నిర్దేశించిన టెరిటోరియల్ నిబంధనల ప్రకారం ఈ ఓడీఎల్ ప్రోగ్రాంలను అమలుచేయవచ్చు. ♦ స్టేట్ వర్సిటీలు వాటి చట్టంలో పేర్కొన్న పరిధికి లోబడి.. లేదా తమ రాష్ట్ర పరిధిలో మాత్రమే ఈ ఓడీఎల్ కోర్సులను అమలుచేయాలి. ♦ ప్రైవేటు వర్సిటీలు కూడా తమ చట్టంలో నిర్దేశించుకున్న రాష్ట్ర పరిధికి మించి ప్రోగ్రాములను అందించరాదు. హెడ్ క్వార్టర్ పరిధిలో మాత్రమే ప్రోగ్రాంలను అందించవచ్చు. గుర్తింపు ఉన్న ఆఫ్ క్యాంపస్‌ల ద్వారా కూడా అమలుచేయవచ్చు. ♦ ప్రోగ్రాములను లెర్నర్ సపోర్టు కేంద్రాల ద్వారా అమలుచేయడానికి వీల్లేదు. డీమ్డ్ వర్సిటీలు తమ హెడ్ క్వార్టర్ పరిధిలో, కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉన్న ఆఫ్ క్యాంపస్‌ల ద్వారా ఈ ప్రోగ్రాములను అమలుచెయ్యొచ్చు. -
డిగ్రీ పూర్తి చేయడానికి 54 ఏళ్లు
ఒట్టావా: డిగ్రీ అంటే మూడేళ్లు చదువుతారు. బ్యాక్‌ల్యాగ్స్ ఉంటే మహా అయితే మరో ఏడాది అంతే. కానీ కెనడాకు చెందిన ఆర్థూర్ రోజ్ అనే వ్యక్తికి డిగ్రీ పూర్తి చేయడానికి ఏకంగా 54 ఏళ్లు పట్టింది. ప్రపంచంలో నత్తనడకన డిగ్రీ పూర్తి చేసిన వ్యక్తిగా రోజ్ రికార్డు సృష్టించాడు. యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాలో 1969లో డిగ్రీలో చేరిన రోజ్ ఎట్టకేలకు తన 71 ఏళ్ల వయసులో డిగ్రీ పట్టా తీసుకున్నారు. ఆర్థూర్ రోజ్ కెనడాకు చెందిన నటుడు. డిగ్రీలో చేరిన ఏడాది తర్వాత అతనికి నాటకాల పిచ్చి పట్టుకుంది. అందులో పడిపోయి చదువుని పట్టించుకోలేదు. మధ్యలో కొన్నాళ్లు నటనలో కూడా కోర్సులు చేశారు. అలా జీవితమంతా గడిచిపోయి రిటైర్ అయిపోయాక మళ్లీ చదువుపై ఆసక్తి వచ్చింది. 2016లో యూనివర్సిటీ ఆఫ్ కొలంబియాలో మళ్లీ హిస్టరీ స్టూడెంట్‌గా దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేసి గురువారం పట్టా అందుకున్నారు. -
‘దూర విద్య’ ఇంజినీరింగ్ పట్టాలు రద్దు
న్యూఢిల్లీ: దూర విద్య ద్వారా నాలుగు డీమ్డ్ యూనివర్సిటీలు అందించిన ఇంజినీరింగ్ పట్టాలను యూజీసీ రద్దు చేసింది. ఈ జాబితాలో రాజస్తాన్‌లోని జేఆర్‌ఎన్ రాజస్తాన్ విద్యాపీఠ్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్, అలహాబాద్ అగ్రికల్చరల్ ఇనిస్టిట్యూట్, తమిళనాడులోని వినాయక మిషన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఉన్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా యూజీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆ యూనివర్సిటీల ఇంజినీరింగ్ డిగ్రీలను సస్పెండ్ చేస్తున్నట్లు యూజీసీ కార్యదర్శి పీకే థాకూర్ చెప్పారు. డిగ్రీలు రద్దయిన విద్యార్థులకు 2018 జనవరి 15లోగా పరీక్షలు నిర్వహించాలని సుప్రీం ఇదివరకే ఆదేశించిన సంగతి తెలిసిందే. -
17 నుంచి కేయూ దూరవిద్య డిగ్రీ పరీక్షలు
కేయూక్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య డిగ్రీ బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ పరీక్షలు ఈనెల 17 నుంచి నిర్వహించనున్నారు. ఈమేరకు మంగళవారం కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.పురుషోత్తమ్ తెలిపారు. డిగ్రీ కోర్సుల ప్రథమ, ఫైనల్ ఇయర్ పరీక్షలు ఈనెల 17 నుంచి జరుగుతాయని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1 వరకు ఫస్టియర్ పరీక్షలు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఈనెల 18 నుంచి సెప్టంబర్ 2 వరకు, ఫైనల్ ఇయర్ పరీక్షలు ఈనెల 17నుంచి సెప్టెంబర్ 2 వరకు జరుగుతాయని వివరించారు. ఫైనల్ ఇయర్ పరీక్షలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఫస్టియర్ పరీక్ష లు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరుగుతాయని తెలిపారు. ఈపరీక్షలు 45వేల మందికిపైగా పరీక్షలు రాయబోతున్నారు. కేయూ దూరవిద్య పీజీ పరీక్షలు కేయూ దూరవిద్య పరిధిలోని పీజీ కోర్సుల ఎంఏ, ఎంకామ్, హెచ్ఆర్ఎం, రూరల్‌డెవలప్‌మెంట్, ఎమ్మెస్సీమ్యాథ్స్, ఎల్ఎల్ఎం ఫైనల్ఇయర్ పరీక్షలు ఈనెల 18 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ పురుషోత్తమ్ తెలిపారు. సెప్టెంబర్ 3 వరకు మ«ధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. దూరవిద్య పీజీ కోర్సుల మొదటి సంవత్సరం పరీక్షలు ఈనెల 20నుంచి సెప్టెంబర్ 3వతేదీ వరకు, మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉంటాయని వివరించారు. -
బీఈడీ.. అంతా వ్యాపారమే!
దూరవిద్యను తలపిస్తున్న రెగ్యులర్ బీఈడీ - తరగతుల నిర్వహణ అస్తవ్యస్థం - కౌన్సెలింగ్ నాటికి అఫిలియేషన్స్ శాతవాహన యూనివర్సిటీ: ఉన్నతాధికారుల పర్యవేక్షణలోపం, రాజకీయ ఒత్తిళ్లతో ఉపాధ్యాయ విద్య భ్రష్టుపడుతోంది. రెగ్యులర్ బీఈడీ కోర్సు దూరవిద్యా విధానాన్ని తలపిస్తోంది. కళాశాలల్లో సౌకర్యాల లేమి, అధ్యాపకుల నియామకాల్లో నిబంధనలు పాటించని పక్షంలో యూనివర్సిటీ అఫిలియేషన్ రాదని నిబంధనలున్నా.. తీరా వార్షిక పరీక్షల సమయానికి కోర్టు నుంచి అనుమతి తీసుకుని వాటి మనుగడ సాగిస్తున్నాయి. 2014-15 విద్యాసంవత్సరానికి ఈనెల 21 నుంచి 28 వరకు ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. జిల్లాలోని 19 బీఈడీ కళాశాలల పర్యవేక్షణ పూర్తయిందని, వాటి అఫిలియేషన్‌ను కౌన్సెలింగ్‌కు ముందే అందించే యోచనలో ఉన్నట్లు శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్ కోమల్‌రెడ్డి తెలిపారు. ఎన్నో ఆరోపణలు జిల్లాలోని చాలా బీఈడీ కళాశాలలు ఉపాధ్యాయ విద్యను వ్యాపార కోణంలోనే చూస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఆటస్థలం, లైబ్రరీ, సెమినార్హాళ్లు, అర్హత గల అధ్యాపకులు లేకున్నా నెట్టుకొస్తున్నాయి. కన్వీనర్ కోటా నుంచి వచ్చే ఫీజు రీయింబర్స్మెంట్, మేనేజ్మెంట్ కోటాతో వచ్చే డబ్బులను అప్పన్నంగా మింగేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఫీజు వివరాలు కన్వీనర్ కోటాలో సీటు పొందిన ఉపాధ్యాయ విద్యార్థి పైసా చెల్లించకుండానే కోర్సు పూర్తి చేసుకోవచ్చు. కళాశాల స్థాయిని బట్టి ఒక్కొక్కరికి రూ.14,400 నుంచి రూ.16,500 వరకు రీయింబర్స్మెంట్ వస్తోంది. స్కాలర్షిప్ రూపేణ రూ.4500- రూ.5 వేలు ప్రభుత్వం చెల్లిస్తోంది. 2013-14లో బీఈడీ అభ్యసించిన వారికిఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని యాజమాన్యాలు తెలిపాయి. ఎవరి కోటా ఎంత? బీఈడీ కళాశాలలో మొత్తం వంద సీట్లు ఉంటాయి. కన్వీనర్ కోటాలో 75 శాతం, మేనేజ్మెంట్కు 25 శాతం సీట్లు కేటాయించింది. గతంలో మేనేజ్మెంట్ కోటాలో సీట్ల అమ్మకాలు రూ.25 వేల నుంచి రూ.70 వేల వరకు ఉంటే ప్రస్తుతం రెండింతలైనట్లు తెలుస్తోంది. కోర్సు విధానం కోర్సులో చేరిన విద్యార్థులు తరగతులకు కనీసం 80 శాతం హాజరు కావాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో మాక్రో టీచింగ్ కోసం కళాశాల కేటాయించిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో ఛాత్రోపాధ్యాయులుగా బోధన చేయాలి. యూనివర్సిటీ ప్రకారం పరీక్ష ఫీజులు అన్ని కలిపి మొత్తంగా రూ.2,530 చెల్లించాలి. నిబంధనలకు నీళ్లు జిల్లాలో 19 బీఈడీ కళాశాలల్లో 2 వేల మంది ఉపాధ్యాయ కోర్సు అభ్యసిస్తున్నారు. పలు కళాశాలల్లో సిబ్బంది సరిగాలేకపోవడంతో విద్యార్థులు తరగతులకు హాజరుకావడం లేదు. అన్ని మెథడ్స్ బోధించే అధ్యాపకులు మెజార్టీ కళాశాలలో లేకున్నా యాజమాన్యాలు ప్రభుత్వానికి ఏవో పేర్లు చూపి గుర్తింపును కాపాడుకుంటున్నాయి. లేని వసతులకు ఫీజులు అనేక కళాశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు లేవు. ఉన్నా అవి అలంకారప్రాయమేననే విమర్శలున్నాయి. లేనివాటికి కంప్యూటర్ రికార్డ్స్ ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. పర్యవేక్షణ కొరవడడంతోనే బీఈడీ ప్రమాణాలు పడిపోయాయనే వాదన వినిపిస్తోంది. ఎన్సీటీఈ ప్రకారం కళాశాలకు సొంత భవనం ఉండాలి. కాని నేటికీ కొన్ని అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. కొన్ని ప్రైవేట్ కళాశాలలు ఏడాదిలో కనీస తరగతులు కూడా నిర్వహించే స్థితిలో లేవు. వార్షిక పరీక్షకు హాజరు విషయాల్లోనూ విద్యార్థుల నుంచి డబ్బులు దండుకుంటున్నాయి. బయోమెట్రిక్ అటెండెన్స్ ఈ విద్యాసంవత్సరం బీఈడీ కళాశాలలో విద్యార్థులకు, అధ్యాపకుల హాజరును బయోమెట్రిక్ సిస్టమ్‌తో నమోదు చేస్తాం. ఈ విధానం అమలుకు ఎస్‌యూ వీసీ గత విద్యాసంవత్సరమే సిద్ధమైనా కొన్ని కారణాలతో చేయలేకపోయాం. ఈసారి కచ్చితంగా అమలు చేస్తాం. నిబంధనలు పాటించని కళాశాలలను ఉపేక్షించేది లేదు. - ప్రొఫెసర్ మహేందర్ రెడ్డి, ఎడ్యుకేషన్ డీన్ ఫ్యాకల్టీ, కేయూ వరంగల్ -
రాష్ట్రేతర వర్సిటీల దూరవిద్య పీజీలు చెల్లుతాయి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రేతర విశ్వవిద్యాలయాల నుంచి దూరవిద్య ద్వారా పొందిన పీజీలతో స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందినవారికి రాష్ట్ర పరిపాలన ట్రిబ్యునల్ (ఏపీఏటీ) తీర్పుతో ఊరట లభించింది. పదోన్నతులకు వారు సమర్పించిన పీజీ డిగ్రీలు చెల్లుబాటు కావంటూ పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను ట్రిబ్యునల్ కొట్టివేసింది. అయితే పరీక్షలు రాసేందుకు ఆయా యూనివర్సిటీలకు, స్టడీ సెంటర్లకు వెళ్లిన ఉపాధ్యాయులు... అదే సమయంలో పాఠశాల హాజరుపట్టీల్లో తాము విధులకు హాజరైనట్లు ఉంటే మాత్రం సీఐడీ నివేదిక ఆధారంగా వారిపై తగిన చర్యలు తీసుకునే స్వేచ్ఛ పాఠశాల విద్యాశాఖ అధికారులకు ఉందని స్పష్టం చేస్తూ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ డాక్టర్ జి.యతిరాజులు, సభ్యులు ఎం.వి.పి.సి.శాస్త్రిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. మన రాష్ట్రంలో పలువురు ఎస్జీటీలు తమిళనాడులోని అలగప్ప, వినాయక మిషన్, అన్నామలై, మధురై కామరాజ్, పెరియార్, సుందరనార్, కర్ణాటకలోని కుపెంపు, మణిపాల్, రాజస్థాన్‌లోని గాంధీ విద్యామందిర్, జనార్దన్రాయ్నగర్ విద్యాపీఠ్, బీహార్‌లోని లలిత్ నారాయణ్ మిథిలా, బుద్ధగయలోని మగధ్ విశ్వవిద్యాలయాల నుంచి దూరవిద్యలో పీజీ డిగ్రీలు సంపాదించారు. వాటితో స్కూల్ అసిస్టెంట్లుగా 2009లో పదోన్నతులు పొందారు. అయితే ఆయా విశ్వవిద్యాలయాలకు యూజీసీ గుర్తింపులేదని, వాటి నుంచి పొందిన పీజీ డిగ్రీలను పదోన్నతులకు సమర్పించినవారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారులను ఆదేశిస్తూ పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ 2010లో ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతులను ఉపసంహరించుకొని తిరిగి ఎస్జీటీలుగా ఎందుకు నియమించరాదో చెప్పాలంటూ వారికి సంజాయిషీ తాఖీదులు జారీ చేశారు. వాటిని సవాలు చేస్తూ ట్రిబ్యునల్‌లో పెద్దసంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. మరోవైపు పదోన్నతులు రాని టీచర్లు కూడా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. పలు విశ్వవిద్యాయాల దూరవిద్య పీజీ డిగ్రీల చెల్లుబాటుపై యూజీసీ, దూరవిద్యా మండలి (డీఈసీ), కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను ట్రిబ్యునల్ ధర్మాసనం పరిశీలించింది. ఆ ప్రకారం దూరవిద్య పీజీ డిగ్రీలు చెల్లుబాటు అవుతాయని తేల్చిచెప్పింది. వాటితో పదోన్నతులు పొందిన పిటిషనర్లను రివర్ట్ చేయడానికి వీల్లేదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ జారీ చేసిన ఉత్తర్వులు, షోకాజ్ నోటీసులను రద్దు చేసింది. అంతేకాక కౌన్సెలింగ్ సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించలేక తరువాత దాఖలుచేసినవారి పదోన్నతి కూడా చెల్లుబాటు అవుతుందని తేల్చి చెప్పింది. అయితే పదోన్నతి నాటికి పరీక్షలో ఉత్తీర్ణులుకాకుంటే మాత్రం తగిన చర్యలు తీసుకోవచ్చని అధికారులకు సూచించింది.