సాక్షి, హైదరాబాద్: రాష్ట్రేతర విశ్వవిద్యాలయాల నుంచి దూరవిద్య ద్వారా పొందిన పీజీలతో స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందినవారికి రాష్ట్ర పరిపాలన ట్రిబ్యునల్ (ఏపీఏటీ) తీర్పుతో ఊరట లభించింది. పదోన్నతులకు వారు సమర్పించిన పీజీ డిగ్రీలు చెల్లుబాటు కావంటూ పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను ట్రిబ్యునల్ కొట్టివేసింది. అయితే పరీక్షలు రాసేందుకు ఆయా యూనివర్సిటీలకు, స్టడీ సెంటర్లకు వెళ్లిన ఉపాధ్యాయులు... అదే సమయంలో పాఠశాల హాజరుపట్టీల్లో తాము విధులకు హాజరైనట్లు ఉంటే మాత్రం సీఐడీ నివేదిక ఆధారంగా వారిపై తగిన చర్యలు తీసుకునే స్వేచ్ఛ పాఠశాల విద్యాశాఖ అధికారులకు ఉందని స్పష్టం చేస్తూ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ డాక్టర్ జి.యతిరాజులు, సభ్యులు ఎం.వి.పి.సి.శాస్త్రిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.
మన రాష్ట్రంలో పలువురు ఎస్‌జీటీలు తమిళనాడులోని అలగప్ప, వినాయక మిషన్, అన్నామలై, మధురై కామరాజ్, పెరియార్, సుందరనార్, కర్ణాటకలోని కుపెంపు, మణిపాల్, రాజస్థాన్‌లోని గాంధీ విద్యామందిర్, జనార్దన్‌రాయ్‌నగర్ విద్యాపీఠ్, బీహార్‌లోని లలిత్ నారాయణ్ మిథిలా, బుద్ధగయలోని మగధ్ విశ్వవిద్యాలయాల నుంచి దూరవిద్యలో పీజీ డిగ్రీలు సంపాదించారు. వాటితో స్కూల్ అసిస్టెంట్లుగా 2009లో పదోన్నతులు పొందారు.
అయితే ఆయా విశ్వవిద్యాలయాలకు యూజీసీ గుర్తింపులేదని, వాటి నుంచి పొందిన పీజీ డిగ్రీలను పదోన్నతులకు సమర్పించినవారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారులను ఆదేశిస్తూ పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ 2010లో ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతులను ఉపసంహరించుకొని తిరిగి ఎస్‌జీటీలుగా ఎందుకు నియమించరాదో చెప్పాలంటూ వారికి సంజాయిషీ తాఖీదులు జారీ చేశారు. వాటిని సవాలు చేస్తూ ట్రిబ్యునల్‌లో పెద్దసంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి.
మరోవైపు పదోన్నతులు రాని టీచర్లు కూడా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. పలు విశ్వవిద్యాయాల దూరవిద్య పీజీ డిగ్రీల చెల్లుబాటుపై యూజీసీ, దూరవిద్యా మండలి (డీఈసీ), కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను ట్రిబ్యునల్ ధర్మాసనం పరిశీలించింది. ఆ ప్రకారం దూరవిద్య పీజీ డిగ్రీలు చెల్లుబాటు అవుతాయని తేల్చిచెప్పింది. వాటితో పదోన్నతులు పొందిన పిటిషనర్లను రివర్ట్ చేయడానికి వీల్లేదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ జారీ చేసిన ఉత్తర్వులు, షోకాజ్ నోటీసులను రద్దు చేసింది. అంతేకాక కౌన్సెలింగ్ సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించలేక తరువాత దాఖలుచేసినవారి పదోన్నతి కూడా చెల్లుబాటు అవుతుందని తేల్చి చెప్పింది. అయితే పదోన్నతి నాటికి పరీక్షలో ఉత్తీర్ణులుకాకుంటే మాత్రం తగిన చర్యలు తీసుకోవచ్చని అధికారులకు సూచించింది.