పిల్లలు ఫిర్యాదు చేయగానే... టీచర్ల అరెస్టు కూడదు | Kerala HC says no criminal case against teachers | Sakshi
Sakshi News home page

పిల్లలు ఫిర్యాదు చేయగానే... టీచర్ల అరెస్టు కూడదు

Published Sat, Mar 15 2025 5:57 AM | Last Updated on Sat, Mar 15 2025 5:57 AM

Kerala HC says no criminal case against teachers

నిర్ధారించుకున్నాకే చర్యలు... పోలీసులకు కేరళ హైకోర్టు ఆదేశం 

ఆందోళనకరంగా విద్యార్థుల ప్రవర్తన

స్కూళ్లలోకి ఆయుధాలు, డ్రగ్స్, మద్యం 

టీచర్లపై బెదిరింపులు, భౌతిక దాడులు 

సదుద్దేశంతో శిక్షించినా వారిపై కేసులు 

ఉపాధ్యాయుల చేతిలో బెత్తం తప్పనిసరి 

అప్పుడే పిల్లల్లో భయం: న్యాయమూర్తి 

కొచ్చి: ఉపాధ్యాయులు, ఇతర బోధన సిబ్బందిపై ఫిర్యాదుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘విద్యార్థులు, తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగానే నేరుగా టీచర్ల అరెస్టు వంటి చర్యలకు దిగొద్దు. ప్రాథమికంగా దర్యాప్తు చేసి, నేరం జరిగినట్టు రుజువయ్యాకే చర్యలు తీసుకోవాలి’’ అని పోలీసులను ఆదేశించింది. ఈ దిశగా తక్షణం సర్క్యులర్‌ జారీ చేయాల్సిందిగా డీజీపీకి ఆదేశాలు జారీచేసింది. 

విద్యార్థులు స్కూళ్లలోకి ఆయుధాలు, మద్యం, డ్రగ్స్‌ తదితరాలను యథేచ్ఛగా తీసుకెళ్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది తప్పనిసరని న్యాయమూర్తి జస్టిస్‌ పి.వి.కున్హికృష్ణన్‌ అభిప్రాయపడ్డారు. విద్యార్థిని బెత్తంతో కొట్టిన కేసులో ఓ టీచరుకు ఆయన ముందస్తు బెయిల్‌ మంజూరు చేశారు. కేరళలో విద్యార్థులు, యువత ప్రవర్తన చాలా ఆందోళనకరంగా ఉందని ఈ సందర్భంగా ఆవేదన వెలిబుచ్చారు. ‘‘వారు తీవ్ర నేరాలకు కూడా పాల్పడుతున్నారు. టీచర్లనే బెదిరిస్తున్నారు. వారిని ఘెరావ్‌ చేస్తున్నారు. భౌతిక దాడులకు దిగుతున్నారు. దీనికి తక్షణం అడ్డుకట్ట వేయాల్సిన అవసరముంది’’ అన్నారు. 

క్లాసురూముల్లో బెత్తం పట్టుకునేందుకు టీచర్లను అనుమతించాలని అభిప్రాయపడ్డారు. ‘‘ప్రతిసారీ బెత్తం వాడాలని కాదు. అది టీచర్ల చేతిలో ఉంటే చాలు, తప్పు చేసేందుకు విద్యార్థులు జంకుతారు. తప్పు చేసిన విద్యార్థులకు టీచర్లు చిన్నపాటి శిక్ష విధించాలి. అది నేరమేమీ కాదు. పైగా అంతిమంగా మన విద్యావ్యవస్థ మరింత బలోపేతమయ్యేందుకు తోడ్పడుతుంది. కానీ బాగుపడాలనే సదుద్దేశంతో గిల్లినా, గిచ్చినా, మందలించినా టీచర్లపై క్రిమినల్‌ కేసులు పెడుతున్నారు. దీన్నుంచి వారికి రక్షణ కల్పించాలి. లేదంటే పని చేయలేరు’’ అన్నారు. ‘‘టీచర్లంతా సాధుసత్తములని చెప్పడం లేదు. వాళ్లలోనూ కొందరు చెడ్డవాళ్లు ఉండవచ్చు. కానీ విద్యార్థిని మనిషిగా తీర్చిదిద్దడంలో టీచర్లది కీలక పాత్ర అని మర్చిపోవద్దు’’ అన్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement