అబుదాబి: పెట్టుబడులు పెట్టేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వద్ద పుష్కలంగా నిధులు ఉన్నాయని, ఇన్వెస్ట్ చేయడానికి భారత్‌లో అపార అవకాశాలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ చెప్పారు. కనెక్టివిటీ, కృత్రిమ మేధ, కొత్త టెక్నాలజీలు, డేటా అనలిటిక్స్ వంటి వివిధ రంగాల్లో ఇరు దేశాలు పనిచేయగలవని ఆయన పేర్కొన్నారు. ఇండియా–యూఏఈ స్టార్టప్ ఫోరం 2022 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ‘యూఏఈ వద్ద పెట్టుబడుల సామర్థ్యాలు ఉన్నాయి. భారీ మార్కెట్ రూపంలో భారత్ .. పెట్టుబడులకు ఆకర్షణీయమైన కేంద్రంగా నిలుస్తోంది. కాబట్టి ఇరు దేశాలకు ఒకదానితో మరొకదానికి పోటీ లేదు.
రెండూ భాగస్వాములుగా కలిసి పనిచేయవచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు. అంకుర సంస్థలకు సదుపాయాలు కల్పించడంతో పాటు స్టార్టప్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి చెప్పారు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతి పెద్ద స్టార్టప్ వ్యవస్థగా ఉందని, నంబర్ వన్ స్థానానికి చేరాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ఆయన పేర్కొన్నారు. దుబాయ్ ఎక్స్‌పో సందర్భంగా భారత స్టార్టప్‌లకు మంచి స్పందన లభించిందని.. పలు అంకుర సంస్థలు నిధులను సమీకరించుకున్నాయని, అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయని గోయల్ చెప్పారు. అంకుర సంస్థలు తమ ఆవిష్కరణ ప్రయోజనాలు .. గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు కూడా చేరువయ్యేలా చూడాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment