మోదీ, మెర్కెల్‌తో వాణిజ్య దిగ్గజాలు
బెంగళూరు: ద్వైపాక్షిక వ్యాపార సంబంధాలు మరిం తగా మెరుగుపర్చుకునే దిశగా భారత పర్యటనలో ఉన్న జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఆమె బృందానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విందు నిర్వహించారు. పలువురు భారతీయ వ్యాపార దిగ్గజాలు కూడా ఇందులో పాల్గొన్నారు. విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా, టీసీఎస్ సీఈవో ఎన్ చంద్రశేఖరన్, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్, ఎల్‌అండ్‌టీ చీఫ్ ఏఎం నాయక్ తదితరులు వీరిలో ఉన్నారు.
అందుబాటులో ఉన్న అపార వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడంపైనా, పరస్పరం సహకరించుకోవడంపై ఇరు వర్గాలు ఆశావహంగా ఉన్నట్లు టీసీఎస్ సీఈవో ఎన్ చంద్రశేఖరన్ ఈ సందర్భంగా చెప్పారు. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల్లో భారత్ కాంతికిరణంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. భారత్ చాలా కీలకమైన మార్కెట్ అని, పెట్టుబడులకు అనువైన పరిస్థితుల కల్పన కోసం పలు చర్యలు తీసుకుంటోందని జర్మనీ గుర్తిస్తోందని ఐసీఐసీఐ సీఈవో చందా కొచర్ తెలిపారు. అంతకు ముందు భారత ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ నిర్వహించిన కార్యక్రమంలో మోదీ, మెర్కెల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య అయిదు ఒప్పందాలు కుదిరాయి.