జపాన్‌ టు ఇండియా! | India Japan bilateral trade Relations | Sakshi
Sakshi News home page

జపాన్‌ టు ఇండియా!

Published Fri, Mar 22 2019 5:13 AM | Last Updated on Fri, Mar 22 2019 5:13 AM

India Japan bilateral trade Relations - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (రీట్స్‌) ఎంట్రీ, సక్సెస్‌తో విదేశీ కంపెనీల్లో ఉత్సాహం నెలకొంది. వాణిజ్య స్థిరాస్తి రంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు పలు విదేశీ కంపెనీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇప్పటికే భారత స్థిరాస్తి రంగంలోకి అమెరికా, కెనడా దేశాల కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జపాన్‌కు చెందిన పలు రియల్టీ కంపెనీలు ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.

ఎంబసీతో మిట్సుబిషి చర్చలు..
జపాన్‌కు చెందిన మిట్సుబిషి కార్పొరేషన్, సుమిటోమో కార్పొరేషన్, మిట్సుయి గ్రూప్, మోరీ బిల్డింగ్స్‌ దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో వాణిజ్య స్థిరాస్తి ప్రాజెక్ట్‌ల నిర్మాణం, నిర్వహణ, పారిశ్రామిక పార్క్‌ల నిర్మాణానికి ఆసక్తి ఉన్నట్లు తెలిసింది. మిట్సుబిషీ నుంచి ముగ్గురు, సుమిటోమో నుంచి 810 మంది ఇండియన్‌ ప్రతినిధులు కమర్షియల్‌ ప్రాపర్టీస్‌ కోసం పనిచేస్తున్నారు. మిట్సుబిషి, సుమిటోమో కార్పొరేషన్స్‌ దీర్ఘకాలం పాటు భారీ అద్దెలు వచ్చే కమర్షియల్‌ ప్రాజెక్ట్‌లను కొనేందుకు ఆసక్తి ఉన్నట్లు సమాచారం. దక్షిణాది రాష్ట్రాల్లో కమర్షియల్‌ ప్రాపర్టీల నిర్మాణం కోసం మిట్సుబిషి కార్పొరేషన్‌ బెంగళూరుకు చెందిన ఎంబసీ గ్రూప్‌తో చర్చలు జరుపుతుంది. ఎంబసీతో పాటూ స్థానికంగా ఉన్న మరిన్ని కంపెనీలతో చర్చలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మిట్సుబిషీ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌ చెన్నై ప్రాజెక్ట్‌లో పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే.

ఇప్పటికే సుమిటోమి ఎంట్రీ..
గత సెప్టెంబర్‌తో మిట్సుబిషీ, సింగపూర్‌ ప్రభుత్వ కంపెనీ టీమాసీక్‌ హోల్డింగ్‌ అనుబంధ సంస్థ సుర్బానా జురోంగ్‌ సంయుక్తంగా కలిసి ఆగ్నేయాసియాలోని పలు ప్రాంతాల్లో అర్బన్‌ బిల్డింగ్‌ ప్రాజెక్ట్‌లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఐదేళ్లలో 2.5 బిలియన్‌ డాలర్లతో రైల్, రోడ్స్, హౌజింగ్, షాపింగ్‌ సెంటర్స్, ఆసుపత్రులు వంటి పలు అభివృద్ధి పనులకు ప్రణాళికలు చేసింది. ఇండియాతో పాటూ మయన్మార్, వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, శ్రీలంక దేశాల్లో ప్రాజెక్ట్‌లకు ప్రణాళికలు చేస్తుంది. సుమిటోమో రియల్టీ అండ్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ స్థానికంగా ఇండియన్‌ కంపెనీలతో కలిసి జాయింట్‌ వెంచర్‌గా కమర్షియల్‌ ప్రాపర్టీల నిర్మాణానికి ప్రణాళికలు చేస్తుంది. గతేడాది సుమిటోమో ఎన్‌సీఆర్‌లో మిక్స్‌డ్‌ యూజ్‌ ప్రాజెక్ట్‌ను అభివృద్ధికి ఆటో పరికరాల తయారీ సంస్థ కృష్ణ గ్రూప్‌తో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.

90 శాతం పెట్టుబడులు విదేశీ కంపెనీలవే..
అమెరికాకు చెందిన బ్లాక్‌స్టోన్, కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్, కెనడా పెన్షన్‌ ప్లాన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డ్‌ (సీపీపీఐబీ) కంపెనీలు భారత స్థిరాస్తి రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే బ్లాక్‌స్టోన్, బ్రూక్‌ఫీల్డ్‌ కంపెనీలు వాణిజ్య రియల్టీ రంగంలో 5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి కూడా. 2018లో రియల్టీ రంగంలోకి సుమారు 4 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు రాగా.. 44 శాతం ఇన్వెస్ట్‌మెంట్స్‌ అమెరికా, కెనడా, సింగపూర్‌ వంటి విదేశీ కంపెనీల నుంచి వచ్చినవే. 90 శాతం విదేశీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ దేశంలోని ప్రముఖ మెట్రో నగరాలైన హైదరాబాద్, ముంబై, పుణె, బెంగళూరు వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి వచ్చినవేనని కేపీఎంజీ తెలిపింది.

రీట్స్, రెరా, జీఎస్‌టీలతో రెడ్‌ కార్పెట్‌..
విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రియల్టీ రంగంలో లావాదేవీల్లో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చేందుకు కేంద్రం గత 34 ఏళ్లలో విప్లవాత్మక చట్టాలను తీసుకొచ్చింది. రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (రీట్స్‌), రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా), వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)ల అమలుతో రియల్టీ రంగంలో పారదర్శకత నెలకొందని.. అందుకే విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. భారత వాణిజ్య స్థిరాస్తి రంగం దీర్ఘకాల పె ట్టుబడులు, రిటర్న్స్‌కు సరైన ప్రాంతమని, అందుకే దేశ, విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారని అనరాక్‌ క్యాపిటల్‌ ఎండీ శోభిత్‌ అగర్వాల్‌ తెలిపారు.

ఇండియా జపాన్‌ ద్వైపాక్షిక వాణిజ్యం ఇలా...
► జపాన్‌కు చెందిన బహుళ జాతి కంపెనీ సుజుకీ మోటర్‌ కార్పొరేషన్‌ 1981లో తొలిసారిగా మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్‌ ప్రారంభించింది. నాటి నుంచి 2016 అక్టోబర్‌ వరకు మన దేశంలో 1305 జపాన్‌ కంపెనీలు నమోదయ్యాయి. ప్రధానంగా ఇవి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బిజినెస్‌ సర్వీస్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఫుడ్‌ ప్రాసెసింగ్, అగ్రి, హెల్త్‌కేర్‌ రంగాల్లో ఉన్నాయి.
► 2013లో 16.31 బిలియన్‌ డాలర్లుగా         ఉన్న ఇండియా జపాన్‌ ద్వైపాక్షిక వాణిజ్యం 2019–20 నాటికి 50 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా.
► దేశీయ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో జపాన్‌ వాటా 7 శాతం.  
► 2000 నుంచి 2018 మధ్య కాలంలో జపాన్‌ నుంచి  27.28 బిలియన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష నిధులు (ఎఫ్‌డీఐ) వచ్చాయి.
► 2017–18లో జపాన్‌ నుంచి ఇండియాకు 10.97 బిలియన్‌ డాలర్ల దిగుమతులు, మన దేశం నుంచి జపాన్‌కు 4.73 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు జరిగాయి.
► 2007–08లో 6.3 బిలియన్‌ డాలర్లుగా ఉన్న దిగుమతులు.. 2017–18 నాటికి 10.97 బి.డాలర్లకు పెరిగాయి. అంటే 11 ఏళ్లలో దిగు మతుల్లో 73% వృద్ధి నమోదైంది. జపాన్‌ నుం చి ప్రధానంగా ఎలక్ట్రికల్‌ మిషనరీ, రవాణా పరికరాలు, కెమికల్స్, అనుబంధ ఉత్పత్తులు, ఇనుము, ఉక్కు దిగుమతి అవుతుంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement