
న్యూఢిల్లీ: డిమాండ్‌ను పెంచడంపై రానున్న బడ్జెట్‌లో ప్రధానంగా దృష్టి సారించాలని దేశీయ పరిశ్రమల అభిప్రాయంగా ఉంది. అంతేకాదు మౌలిక సదుపాయాలు, సామాజిక రంగంపైనా వ్యయాలను ప్రోత్సహించాలని ఆశిస్తోంది. ఫిక్కీ, ధ్రువ అడ్వైజర్స్ సంయుక్తంగా ఒక సర్వే నిర్వహించి.. పారిశ్రామికవేత్తల అభిప్రాయాలతో కూడిన నివేదికను బుధవారం విడుదల చేసింది. దేశంలో తయారీ వ్యవస్థ బలోపేతంపై ప్రభుత్వం విధానపరమైన దృష్టి సారించాలని కోరింది. పరిశోధన, అభివృద్ధికి మద్దతుగా నిలవాలని.. భవిష్యత్తు టెక్నాలజీలకు ప్రోత్సాహకాలు అందించాలని కోరుతున్నట్టు సర్వే నివేదిక తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద టీకాల కార్యక్రమం దేశీయంగా కొనసాగుతున్న తరుణంలో ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవాన్ని అందించే చర్యలను వేగవంతం చేయాలని కోరింది. వృద్ధి క్రమం సానుకూలంగా మారినందున.. ప్రభుత్వం నుంచి నిరంతర మద్దతు అవసరమని.. కొన్ని రంగాల్లో డిమాండ్ మెరుగుపడగా, ఇది స్థిరంగా కొనసాగుతుందా అన్నది చూడాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. డిమాండ్‌ను పెంచేందుకు పన్నుల విధానాన్ని ఉపయోగించుకోవాలని సూచించింది.
పన్నుల ఉపశమనం అవసరం..
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు బడ్జెట్‌ను సమర్పించనున్న విషయం తెలిసిందే. ఈ విడత బడ్జెట్‌లో వ్యక్తిగత పన్ను ఉపశమనానికి తప్పకుండా చోటు ఉండాలని సర్వేలో 40 శాతం మంది పారిశ్రామిక వేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రత్యక్ష పన్నుల విధానంలో పన్ను శ్లాబులను మరింత విస్తృతం చేయాలని 47 శాతం మంది కోరారు. ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం పన్ను రాయితీలు, ఉపసంహరణలు కల్పించాలని 75 శాతం మంది కోరడం గమనార్హం. ముఖ్యంగా ఆవిష్కరణలు, ఎగుమతులకు పన్ను రాయితీలు ఇవ్వాలని ఎక్కువ మంది కోరినట్టు ఈ సర్వే నివేదిక తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment