న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన పరిణామాల నుంచి ఎకానమీని గట్టెక్కించేందుకు కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ, క్రమంగా లాక్‌డౌన్ ఎత్తివేయడం వంటి చర్యల ఫలితాలు కనిపించడం మొదలైందని ఒక సర్వేలో వెల్లడైంది. వ్యాపారాల పనితీరు మెరుగుపడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ – ధృవ అడ్వైజర్స్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన ఈ సర్వేలో వివిధ రంగాల సంస్థలకు చెందిన 100 పైగా టాప్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు (సీఎక్స్‌వో) పాల్గొన్నారు.
రికవరీ దాఖలాలు కనిపిస్తున్నప్పటికీ, ఇది స్థిరంగా నిలబడి ఉండేలా ప్రభుత్వం నుంచి నిరంతరంగా తోడ్పాటు అవసరమవుతుందని సర్వే తెలిపింది. మార్కెట్ డిమాండ్‌ను మెరుగుపర్చడానికి గట్టి చర్యలు అవసరమని లేకపోతే ప్రాథమిక స్థాయిలో ఉన్న ఈ రికవరీ మళ్లీ కుంటుపడిపోతుందని పేర్కొంది. సర్వే ప్రకారం ప్రస్తుతం 30 శాతం సంస్థలు 70 శాతం పైగా వ్యాపార సామర్థ్యాన్ని వినియోగించుకుంటున్నాయి.
45 శాతం సంస్థలు సమీప భవిష్యత్తులో ఈ స్థాయి సామర్థ్యాన్ని వినియోగించుకోనున్నాయి. ఇక సవాళ్ల విషయానికొస్తే, దశలవారీగా అన్‌లాకింగ్, ఖర్చుల నియంత్రణ, బలహీన డిమాండ్, నిధుల లభ్యత మొదలైన వాటిని సీఎక్స్‌వోలు ప్రస్తావించారు. కరోనా వైరస్ మహమ్మారి రెండో విడతలో మరింతగా విజృంభించిన పక్షంలో వ్యాపారాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడొచ్చని కొందరు సీఎక్స్‌వోలు అభిప్రాయపడ్డారు. ఇక చైనా నుంచి అకస్మాత్తుగా దిగుమతులు ఆగిపోవడం వంటి అంశాలు సైతం ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.
ఉద్యోగాల కోత..: తమ తమ కంపెనీల్లో దాదాపు 10 శాతం మేర ఉద్యోగాల్లో కోత పడొచ్చని సర్వేలో పాల్గొన్న వారిలో 32 శాతం మంది సీఎక్స్‌వోలు పేర్కొన్నారు. ఏప్రిల్‌లో నిర్వహించిన సర్వే ప్రకారం వీరి సంఖ్య 40 శాతం. ఎకానమీ అన్‌లాకింగ్‌తో క్రమంగా ఎగుమతులు, నిధుల ప్రవాహం, ఆర్డర్లు, సరఫరా వ్యవస్థలు మెరుగుపడటం మొదలైందని సర్వే పేర్కొంది. ఇటీవలి కాలంలో ఎగుమతులు మెరుగుపడ్డాయని 22 శాతం మంది సీఎక్స్‌వోలు తెలిపారు. ఇక 25 శాతం మంది ఆర్డర్ బుక్ మెరుగుపడిందని, 21 శాతం మంది నిధుల లభ్యత బాగుపడిందని పేర్కొన్నారు.
కొనుగోళ్లకు మరింత సమయం..
మరోవైపు, ఆర్థిక ప్యాకేజీకి విషయానికొస్తే.. అయిదింట ఒక కంపెనీ మాత్రమే ప్రభుత్వం ప్రకటించిన అత్యవసర రుణ హామీ పథకం ఫలితాలిస్తోందన్నాయి. రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలు కేవలం పావు శాతం సంస్థలకు లభించింది. అది కూడా స్వల్పంగా 25–50 బేసిస్ పాయింట్ల స్థాయిలో మాత్రమే దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment