ప్రభుత్వరంగ సంస్థల్లో అధిక పెట్టుబడులు పెట్టడానికి బదులుగా తరుగుతున్న రాబడులకు పరిష్కారంగా భారత ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణే ఏకైక మార్గం అనే మార్గంలో ప్రయాణిస్తోంది. ఈ ప్రక్రియలో ఉన్న ప్రమాదాలు వెనువెంటనే అవగతం కాకపోవచ్చు కానీ దేశంలో సంపన్నులకు, పేదలకు మధ్య అంతరం మరింత పెరగడం మాత్రం ఖాయం. సమాజంలో అశాంతికి, ఆందోళనలకు సంపదల మధ్య అగాథ పూరితమైన అంతరమే కారణమని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోని ఒక శాతం సంపన్న భారతీయులు సమాజంలో అట్టడుగున ఉన్న 95.3 కోట్లమంది లేక మొత్తం జనాభాలో 70 శాతం మంది నిర్భాగ్యుల సంపద కంటే నాలుగు రెట్లు అధిక సంపద పోగేసుకున్నారు. మన దేశంలో 63 మంది బిలియనీర్ల మొత్తం సంపద 2018–19 కేంద్ర బడ్జెట్ కంటే ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో అతికొద్దిమంది సంపన్నులకు మాత్రమే కాకుండా ప్రతి భారతీయుడికీ ప్రయోజనం కలిగించే ఆర్థిక వ్యవస్థ రూపకల్పనలో కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నేటి బడ్జెట్ పరీక్షగా మిగలనుంది.
భారతీయ ఆర్థిక వ్యవస్థకి 2019 కలిసిరాని సంవత్సరం. కానీ ఈ సంవత్సరం కూడా భారతీయ అతి సంపన్నుల సంపద భారీగా పెరగడం విశేషం. దేశంలోని ఒక శాతం సంపన్న భారతీయులు సమాజంలో అట్టడుగున ఉన్న 95.3 కోట్లమంది లేక మొత్తం జనాభాలో 70 శాతం మంది నిర్భాగ్యుల సంపద కంటే నాలుగు రెట్లు అధిక సంపద పోగేసుకున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మన దేశంలో 63 మంది బిలియనీర్ల మొత్తం సంపద 2018–19 కేంద్ర బడ్జెట్ కంటే ఎక్కువగా ఉంటోంది.
అదే సమయంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ కొట్టుమిట్టులాడుతోందని ప్రతి సూచి కూడా సూచిస్తోంది. కాగా, 2016–17 ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్ర ఆర్థిక మంత్రులుగా పనిచేసిన వారు అభివృద్ధిని ప్రోత్సహించడం, ఉద్యోగాలు సృష్టించడం పేరిట కార్పొరేట్ పన్నులను తగ్గిస్తూ వస్తున్నారు. కానీ పన్నుల రాయితీ పొందిన సమయంలో అటు ప్రభుత్వం, ఇటు కార్పొరేట్ రంగం ఇచ్చిన హామీలు ఏవీ అమలు కాకుండా పోయాయి. దేశంలో సులభతర వ్యాపార అనుమతుల విషయంలో ర్యాంకులు పైపైకి వెళుతున్నాయి. కార్మిక చట్టాలు, పర్యావరణ సంబంధ క్రమబద్ధీకరణలు బలహీనపడుతున్నాయి కానీ అభివృద్ధి మాత్రం చోటు చేసుకోవడం లేదు.
దీనికి బదులుగా ఇటీవల విడుదల చేసిన నీతి ఆయోగ్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ సూచిక ప్రకారం, దేశంలో 22 రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల్లో దారిద్ర్యం, ఆకలి పెరుగుతున్నాయి. ఈ కీలక సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టి మదుపులు పెంచడానికి బదులుగా మీడియా తాజా వార్తలు సూచించినట్లుగా తగ్గిన ప్రభుత్వ రాబడుల నేపథ్యంలో ఈ సంవత్సరం బడ్జెట్‌లో 2 లక్షల కోట్ల రూపాయల వరకు కోత విధించనున్నారు.
కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోలేదంటే ఆశ్చర్యం కలిగించదు. వినియోగదారుల్లో డిమాండ్ తగ్గుముఖం పట్టడం, పెరుగుతున్న నిరుద్యోగం, కుంగిపోతున్న ఆర్థిక వ్యవస్థ వంటి తీవ్ర సమస్యలకు పరిష్కారం ఏమిటంటే ప్రభుత్వ వ్యయాన్ని ప్రత్యేకించి కార్మికులు ఎక్కువగా అవసరమయ్యే మౌలిక సౌకర్యాల కల్పన ప్రాజెక్టుల్లో ప్రభుత్వ వ్యయాన్ని పెంచడమేనని కీన్సియన్ ఆర్థిక సిద్ధాంతం నిర్దేశిస్తోంది. ప్రభుత్వవ్యయం పెంచడమన్నది మొత్తం ఆర్థిక వ్యవస్థకు జీవం పోయడమే కాకుండా మరిన్ని ఉద్యోగాల కల్పనకు దోహదం చేస్తుంది.
దేశంలో ఉత్పత్తి అవుతున్న సరకులకు వినియోగదారుల నుంచి డిమాండ్ బలహీనపడినప్పుడు కార్పొరేట్ రంగ పన్నులను తగ్గించడం అనేది ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోయే ఉత్పత్తిలో మదుపు చేసే విషయంలో కంపెనీలకు ఎలాంటి ప్రోత్సాహకాలనూ అందించలేదు. కార్పొరేట్ పన్నులను తగ్గించిన పక్షంలో కంపెనీలు అపార లాభాలను వెనకేసుకుంటాయి. పైగా దేశంలో పేరుకుపోయిన ఆర్థిక అసమానతలను మరింతగా పెంచుతాయి. అంతే తప్ప ఉద్దీపనలు, కార్పొరేట్ రంగానికి పన్ను రాయితీలు ఆర్థిక పెరుగుదలకు ఎంతమాత్రం దోహదపడవు.
మొత్తంమీద ఆర్థిక వ్యవస్థకు సరైన చికిత్స ప్రభుత్వ ఖర్చును తగ్గించడమే అని భారత్ ఆలోచిస్తున్నట్లు కనబడుతోంది. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు చెందిన సంస్థాగత బలహీనతలను ఎవరూ పట్టించుకోరు. అవేమిటంటే పేలవమైన మౌలిక సదుపాయాల కల్పన, మానవ సామర్థ్యాలు తగినంతగా లేకపోవడం, సరకుల ఉత్పత్తిని పెంపొందించగలిగే పొందికైన పారిశ్రామిక విధానం లోపించడం. పన్నులను ఎగ్గొట్టడానికి అనుమతించే కేంద్ర పన్నుల వ్యవస్థలోని చిల్లులను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే సమయంలో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) రూపంలో వస్తున్న కలెక్షన్లను మరింతగా మెరుగుపర్చవలసి ఉంది.
భారతదేశం తన పొరుగుదేశమైన చైనా ఉదాహరణ నుంచి నేర్చుకోవలసిన అవసరముంది. ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల్లో భారీ పెట్టుబడులు పెట్టడం, పారిశ్రామికీకరణకు సంబంధించి స్వల్ప కాలిక, దీర్ఘకాలిక ప్రయత్నాలను అత్యంత నిర్దిష్టంగా చేపట్టడం, ప్రత్యేకించి విద్యపై మదుపును చైతన్యవంతంగా పెంచుతూ పోవడం అనేవి దశాబ్దాలుగా చైనా ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి రేటును సాధిస్తూ రావడానికి ప్రధాన కారణాలు. బలిష్టంగా ఉన్న ప్రభుత్వరంగ సంస్థల్లో అధిక పెట్టుబడులు పెట్టడానికి బదులుగా తరుగుతున్న రాబడులకు పరిష్కారంగా భారత ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణే ఏకైక మార్గం అనే మార్గంలో ప్రయాణిస్తోంది. ఈ ప్రక్రియలో ఉన్న ప్రమాదాలు వెనువెంటనే అవగతం కాకపోవచ్చు కానీ దేశంలో సంపన్నులకు, పేదలకు మధ్య అంతరం మరింత పెరగడం మాత్రం ఖాయం. సమాజంలో అశాంతికి, ఆందోళనలకు సంపదల మధ్య అగాథ పూరితమైన అంతరమే కారణమని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రభుత్వ పంథాను నిశితంగా గమనించినట్లయితే సామాజిక సంక్షేమరంగాలపై మదుపులో భారీ కోతలు ఖాయమని అర్థమవుతుంది. ఉదాహరణకు ఒక్క పాఠశాల విద్యలోనే దాదాపు రూ.3,000 కోట్ల వరకు కోత విధించనున్నారు. హాస్యాస్పదమైన అంశం ఏమిటంటే, ఈ సంవత్సరమే భారతీయ బిలియనీర్ల సంపద రోజుకు రూ. 1,710 కోట్లవరకు పెరుగుతూ పోయింది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యపై ఇంత భారీ కోత వల్ల విద్యారంగంలో ఇప్పటికే తగినన్ని నిధుల కేటాయింపు లేక కునారిల్లుతున్న పథకాలు తీవ్రంగా దెబ్బతిననున్నాయి. పైగా విద్యా బడ్జెట్‌ను రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించి రూపొందించిన నూతన విద్యా విధానం ముసాయిదా కూడా ముందంజ వేయని పరిస్థితి ఏర్పడింది.
దేశంలో 31 కోట్లమంది వయోజనులు నిరక్షరాస్యులుగా ఉంటున్నప్పుడు భారత్ ఒక బలమైన ఆర్థిక శక్తిగా అవుతుందని ఎలా ఊహించగలం? బహుశా భారతీయ ఆర్థిక విధానంలో అసమానత్వం పట్ల అత్యంత నిర్లక్ష్యం ప్రదర్శించిన కారణంగానే మన అభివృద్ధి రేటు తగ్గుముఖం పడుతోంది.
ప్రపంచ అసమానత్వంపై 2015 అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చేసిన విశ్లేషణ చూపుతున్నట్లుగా, 20 శాతం అతి సంపన్నుల ఆదాయ వాటా ప్రతి సంవత్సరం పెరుగుతుండగా, స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) తగ్గుముఖం పడుతోంది. సమాజంలో అట్టడుగున ఉంటున్న 20 శాతం మంది నిరుపేదల ఆదాయం పెరిగినప్పుడే జీడీపీలో పెరుగుదల సాధ్యపడుతుంది. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలతో పరస్పరం ముడిపడివున్న అభివృద్ధి చట్రంలో పేద, మధ్యతరగతి ప్రజల పాత్ర చాలా ముఖ్యమైనదని ఐఎమ్‌ఎఫ్ అధ్యయనకారులు చెబుతున్నారు. అందుకే దశాబ్దాలుగా బలపడుతూ వచ్చిన భారతీయ సంపన్న వర్గం పన్నుల రూపంలో తన న్యాయమైన వాటాను చెల్లించవలసిన సమయం ఆసన్నమైంది. భారతీయ అత్యంత సంపన్నవర్గంపై సంపదపన్నును తిరిగి ప్రవేశపెట్టడం, వారసత్వ పన్ను, సంపద పన్ను వంటివాటిని పటిష్టంగా అమలు చేయడం ద్వారా మాత్రమే భారతదేశం సంపన్నదేశంగా మారగలదు.
లాభాలపై డివిడెండ్లను ప్రకటించే రంగాలపై మరింత చురుకైన పన్నుల విధానాన్ని అమలు పర్చడానికి కేంద్రప్రభుత్వం డివిడెండ్ పన్నుపై దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే కొన్నేళ్లలో అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలన్న తన దార్శనికతను కేంద్రప్రభుత్వం ఫలవంతం చేయాలంటే, చైనాను అధిగమించాలనే కలను సాకారం చేసుకోవాలంటే.. దేశ ఆర్థిక వ్యవస్థను వెనక్కు లాగుతున్న సంస్థాగత అవరోధాలను పరిష్కరించాల్సి ఉంది. పైగా దాదాపు వందకోట్లమంది నిరుపేదలు, మధ్యతరగతి, బలహీన వర్గాల సమాధులపై దేశంలోని ఒక్క శాతం సంపన్నులు పునాదులు నిర్మించుకునే క్రమం ఇంకా కొనసాగినట్లయితే భారత ఆర్థిక వ్యవస్థ ముందంజ వేయడం అసాధ్యం. అసంభవం కూడా. అందుకే అతికొద్దిమంది సంపన్నులకు మాత్రమే కాకుండా ప్రతి భారతీయుడికీ ప్రయోజనం కలిగించే ఆర్థిక వ్యవస్థ రూపకల్పన సమస్యను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించగలుగుతుందా అనే విషయానికి వస్తే ఈ ఏడాది బడ్జెట్ ప్రభుత్వ చిత్తశుద్ధికి పరీక్షగా మిగిలిపోనుంది.
అంజెలా తనేజా
(ది వైర్ సౌజన్యంతో)
వ్యాసకర్త కేంపెయిన్ లీడ్, ఇనీక్వాలిటీ, ఆక్స్‌ఫామ్ ఇండియా
Comments
Please login to add a commentAdd a comment