తాజా బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పుకోదగ్గ భారీ చర్యలేమీ ప్రకటించలేదు. అందుకు బదులు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులను కొత్త విధానంతో బుజ్జగించే పనికి పూనుకున్నారు. అయితే ఈ విధానం ఆచరణలో ఎలావుం టుందో, దీనివల్ల కలిగే మేలేమిటో ఇంకా చూడాల్సేవుంది. మరోపక్క భారీయెత్తున పెట్టుబడుల్ని ఉపసంహరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుని ద్రవ్య లోటును అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ వసూళ్లు మందగించిన పర్యవసానంగా ఏర్పడ్డ లోటును సహేతుకమైన 3.8 శాతానికి కట్టడి చేయడంలో ప్రభుత్వం విజయం సాధించింది. నిరుటి బడ్జె ట్‌లో పెట్టుకున్న లక్ష్యంకన్నా ఇది 0.5 శాతం మాత్రమే ఎక్కువ. కానీ ఇది ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించు కోవడం వల్ల (పీఎం కిసాన్ యోజన, మరికొన్ని ఇతర కార్యక్రమాల్లో నిధులు ఖర్చు చేయకపోవడంద్వారా), రిజర్వ్ బ్యాంకు తన దగ్గరున్న ‘మిగులు నిధులు’ బదిలీ చేయడం, జాతీయ పొదుపు నిధులనుంచి రూ. 2.4 లక్షల కోట్లు రుణం తీసుకోవడం వల్ల మాత్రమే సాధ్యమైంది.
దీంతో మొత్తంగా గత సంవత్సరం స్థూల రుణాలు రూ. 7.4 లక్షల కోట్లకు పరిమితం చేయడం సాధ్యమైంది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటు 10 శాతం వరకూ ఉండొచ్చని అంచనా వేశారు. కానీ పన్ను వసూళ్ల ఆదాయం ప్రాతిపదికగా ఈ అంచనా వేయడం కొత్త ప్రశ్నలను రేకెత్తిస్తోంది. ఉదాహరణకు రాగల సంవత్సరంలో స్థూలంగా పన్ను ఆదాయం రూ. 24.23 లక్షల కోట్లు ఉండొచ్చని కేంద్రం ఆశలు పెట్టుకుంది. గడిచిన సంవత్సరం ఆదాయంతో పోలిస్తే ఇది 12 శాతం అధికం. చూడటానికిది సహేతుకంగానే కనిపిస్తుంది. నిరుడు పెట్టుకున్న లక్ష్యం 18 శాతాన్ని చేరడం కష్ట మైన నేపథ్యంలో, వచ్చే ఏడాది 12 శాతం పెంపుదల లక్ష్యాన్ని అందుకోవడం కూడా కష్టమే. దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని సరిచేయడానికి ఈ బడ్జెట్‌లో తీసుకున్న అతి పెద్ద చర్య పన్నులు తగ్గే అవకాశంవున్న నూతన ఆదాయం పన్ను వ్యవస్థను ప్రకటించడమే. ఈ కొత్త విధానం వల్ల రూ. 40,000 కోట్ల మేర ఆదాయం కోల్పోవచ్చునని ఆర్థిక మంత్రి అంచనా వేశారు. ఈ మిగులును వినియోగదారులు ఖర్చు చేస్తే డిమాండ్ పునరుద్ధరణ సాధ్యమవుతుందన్న విశ్వాసం ప్రభు త్వానికి ఉన్నట్టుంది.
కానీ అలాగే జరగొచ్చునని చెప్పడం తొందర పాటవుతుంది. వివిధ మంత్రిత్వ శాఖలకు చేసిన కేటాయింపులు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. వ్యవ సాయం, గ్రామీణాభివృద్ధి కూడా కలిసి వున్న గ్రామీణ రంగానికి రూ. 2.83 లక్షల కోట్లు కేటాయించారు. ఇది ముగు స్తున్న సంవత్సరం కన్నా 5.5 శాతం అధికం. అలాగే విద్యా శాఖ కేటాయిం పులు కూడా ఇతోధికంగా పెరిగాయి. కానీ ఇచ్చిన సొమ్మును ఖర్చు చేయక పోవడంలో ఆ శాఖ ఆరితేరింది. ఈసారి ద్రవ్య లోటు లక్ష్యం 3.5 శాతం సందేహాస్పదమైనదే. కొత్త ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం అత్యాశలా కన బడుతోంది. ప్రధానమైన ప్రభుత్వ రంగ సంస్థల్లో తన వాటాను అమ్మడం ద్వారా రూ. 2.1 లక్షల కోట్లు రాబట్టవచ్చునని సర్కారు ఆశిస్తోంది. ఇందులో రూ. 90,000 కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా లభిస్తాయని అంచనా. అయితే ఎల్‌ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయం రాజకీయంగా సవాళ్లను ఎదుర్కొనక తప్పదు. పన్నేతర వసూళ్ల ద్వారా వచ్చే ఆదాయం 2.16 లక్షల కోట్లకు పెరుగుతుందని నిర్మలా సీతారామన్ అంచనా వేశారు.
నిజానికి నిరుడు టెలికాం సంస్థల నుంచి రూ. 59,000 కోట్లు ఆదాయం రాగా, ఈసారి అది రూ. 1,33,000 కోట్లు ఉండొచ్చ న్నది అంచనా. ఇంత భారీ మొత్తం అదనంగా వస్తుందని ప్రభు త్వం భావించడానికి కారణం ఉంది. సవరించిన స్థూల రెవెన్యూ బకాయిలు చెల్లించాల్సిందేనని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల వచ్చిపడే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ అంచనాకొచ్చినట్టు కనబడుతోంది. కానీ అలా చెల్లించాల్సివస్తే అది తమకు చావు బాజా మోగించినట్టేనని టెలికాం సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు. గత సెప్టెంబర్‌లో ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడం పేరిట ప్రభుత్వం కార్పొరేట్ పన్ను రేటును భారీగా తగ్గించింది. దీంతో కార్పొరేట్ సంస్థలకు కలిసొచ్చిన మొత్తం రూ. 1,50,000 కోట్లు. కానీ వృద్ధి రేటుకు తోడ్పడిందేమీ లేదు.
బడ్జెట్ ముగింపులో ఆమె వినియోగ, పారిశ్రామిక వస్తువు లపై పన్నుల మోత మోగించారు (మొత్తం 22 వస్తువులపై 2.5 నుంచి 70 శాతం వరకూ ఈ పెంపుదలలున్నాయి). వీటన్నిటి ద్వారా ఎక్సైజ్ సుంకాల రూపంలో ప్రభుత్వానికి రూ. 20,000 కోట్ల ఆదాయం లభిస్తుంది. ఇది తప్పుడు సంకేతం పంపు తుందా? అదే జరిగే అవకాశంవుంది. అయితే ప్రభుత్వం లెక్క చేస్తుందా లేదా అన్నది చూడాలి. మొత్తానికి అటు ప్రైవేటు మదు పునుగానీ, ఇటు వినిమయాన్నిగానీ భారీగా పెంచే నిర్దిష్టమైన చర్యలు ఈ బడ్జెట్‌లో లేవు. ఏతావాతా దేశ ఆర్థిక వ్యవస్థ మదుపు భారాన్ని తానే మోసే పాత్రను ప్రభుత్వం కొనసాగించకతప్పదని దీన్ని చూస్తే అర్ధమవుతుంది.
(‘ది వైర్’ సౌజన్యంతో)
అనూజ్ శ్రీనివాస్
వ్యాసకర్త ఆర్థిక వ్యవహారాల నిపుణుడు
Comments
Please login to add a commentAdd a comment