దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపే విధానాలను ఆర్థికమంత్రి ప్రతి ఏటా బడ్జెట్‌లో ప్రస్తావించడం రివాజు కాగా ప్రభుత్వం చేపట్టిన కీలక విధానాలను ఇటీవల కాలంలో బడ్జెట్ ప్రసంగంలో కాకుండా బాహాటంగా ప్రకటించటం అలవాటుగా మారింది. పెద్దనోట్ల రద్దు వంటి కీలకమైన ద్రవ్యవిధాన ప్రకటనలు కూడా బడ్జెట్ సమర్పణకు వెలుపలనుంచే వచ్చాయి. కార్పొరేట్ రంగానికి 2019 సెప్టెంబర్ 19న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ పన్ను రాయితీని కూడా బడ్జెట్ సమావేశాలకు ఎంతో ముందుగా ప్రకటించారు. దీంతో బడ్జెట్ విశ్వసనీయత దెబ్బతింటోంది. ప్రభుత్వాల రాజకీయ ప్రేరేపిత లక్ష్యాలకు, ద్రవ్యవ్యవస్థ పటిష్టతకు మధ్య అంతరం పెరిగిపోతున్న నేటి తరుణంలో తాజా బడ్జెట్ ప్రజానుకూలతను, అదే సమయంలో ఆర్థిక ప్రక్రియ జవాబుదారీతనాన్ని సమతుల్యం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
మునుపటి సంవత్సరాల్లో మాదిరి కాకుండా ‘ప్రభుత్వ ఆర్థికం’ అనేది కేంద్ర బడ్జెట్ సమర్పణ రోజున విస్తృత స్థాయిలో ప్రకటితం కావటం లేదు. ఆర్థిక మంత్రి కేంద్రబడ్జెట్ సమర్పణలో కొత్త ఆర్థిక విధానాలు, పథకాలు వెల్లడిస్తుండటం రివాజు. కానీ ఈరోజు అత్యంత ప్రధానమైన ఆర్థిక విధాన ప్రకటనలను సంవత్సరం పొడవునా ప్రకటిస్తూ వచ్చారు. ఇవన్నీ బడ్జెట్ ప్రసంగానికి విడిగా ప్రకటితమవుతూ వచ్చాయి. నిజానికి బడ్జెట్ సమర్పణలో కాకుండా ముఖ్యమైన ద్రవ్యసంబంధ ప్రకటనలు ప్రత్యేకించి మూలధన సేకరణ, మదుపునకు సంబంధించిన ప్రకటనలు బడ్జెటుకు ముందూ లేక ఆ తర్వాత వెల్ల డిస్తూ వస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిన పెద్దనోట్ల రద్దు వంటి కీలకమైన ద్రవ్యవిధాన ప్రకటనలు కూడా బడ్జెట్ సమర్పణకు వెలుపలనుంచే వచ్చాయి. మందకొడిగా ఉంటున్న మదుపులకు ఊతమిచ్చేందుకు కార్పొరేట్ రంగానికి 2019 సెప్టెంబర్ 19న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ పన్ను రాయితీని కూడా బడ్జెట్ సమావేశాలకు ఎంతో ముందుగా ప్రకటించారు.
ఈ ధోరణి కారణంగా మారుతున్న పరిస్థితుల్లో బడ్జెట్ విశ్వసనీయత అనేది ముఖ్యమైన అంశంగా మారుతోంది. బడ్జెట్‌లో ఇచ్చిన హామీలు, ఆ ప్రకటనలకు మద్దతుగా బడ్జెట్‌లో కేటాయింపులకు చాలా వ్యత్యాసం ఉంటోంది. ఈ అంతరాన్ని సాంకేతికంగా నిర్దిష్టమైన రీతిలో విశ్లేషించడం లేదు. బడ్జెట్‌లో అత్యధిక కేటాయింపులు చేయడం అంటే అత్యధికంగా ఖర్చుపెట్టడం అని కాదు. ఈ అంతరమే బడ్జెట్ విశ్వసనీయతను కుదించివేసింది. విధానపరమైన అనిశ్చితత్వం, ముందే గ్రహించని ద్రవ్య ప్రకటనలు అనేవి మదుపుదారు విశ్వాసాన్ని దెబ్బతీయడమే కాకుండా సూక్ష్మ ఆర్థిక స్థిరత్వానికి నష్టం కలుగుజేస్తాయి. గత ఆర్థిక బడ్జెట్ (2019–20)లో చేసిన ప్రకటనలను చూస్తే ఆర్థిక గణన తక్కువగా ప్రభుత్వ రాజకీయ దార్శనికత ఎక్కువగా ప్రతిఫలించాయని చెప్పాలి.
నిబంధనల ఆధారిత ద్రవ్య, ఆర్థిక విధాన వ్యవస్థ
భారతదేశంలో ఆర్థిక, ద్రవ్య విధానాలు నిబంధనల ఆధారితంగా మారుతున్నాయి. బడ్జెట్ రూపకల్పన కానీ, ద్రవ్య విధానానికి సంబంధించిన రోడ్ మ్యాప్ కానీ కేంద్రం తీసుకొచ్చిన విత్త బాధ్యత, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎమ్) చట్టం ద్వారా నడుస్తోంది. ఇక ద్రవ్య విధానంకేసి చూస్తే కొన్ని సంవత్సరాలకు ముందు కేంద్ర బడ్జెట్ ‘నూతన ద్రవ్య విధాన చట్రం’ ప్రకటించింది. ఈ ప్రకటనకు ముందు కేంద్రప్రభుత్వం, భారతీయ రిజర్వ్ బ్యాంకు ఒక ఒప్పం దంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం ద్రవ్యవిధాన అధికారులపై ఒకే ఒక లక్ష్యాన్ని విధించింది. అంటే ద్రవ్యోల్బణంపై గురిపెట్టాలని వారికి ముఖ్యంగా సూచించింది. ఇతర అనేక సూక్ష్మ ఆర్థిక సమస్యలను చేపట్టడంతోపాటు, ద్రవ్య అధికారుల జోక్యం ప్రధానంగా ద్రవ్యోల్బణ నియంత్రణపైనే కేంద్రీకరించాలని నిర్దేశించారు.
ఇక విత్త విధానం రంగంపై విత్త బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టం నియంత్రణ ఉంటోంది. ఇది ప్రభుత్వం రుణం తీసుకునే సామర్థ్యంపై పరిమితిని విధించింది. ఇది భారత్‌లో బడ్జెట్ రూపకల్పనపై ప్రభావం వేయటం లేదా? కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న రుణాలు, లోటుకు సంబంధించి నిర్దిష్ట నిబంధనలను విధించేలా విత్త ఏకీకరణ వైపుగా ఒక రోడ్ మ్యాప్ తీసుకువచ్చారు. విత్తపరమైన క్రమశిక్షణ అనేది ఆర్థిక అభివృద్ధిని పెంపొందించాలని సూచించారు. అయితే విత్తపరమైన ఏకీకరణ నిజంగా ఆర్థిక పురోగతిని ప్రోత్సహించిందా? దీనికి సంబంధించిన ఆధారాలు మిశ్రమ స్వభావంతో ఉన్నాయి. నిబంధనల ఆధారితమైన విత్తవిధానపరమైన విజ్ఞతను నిర్వహించేందుకు ఆర్థిక, సామాజిక వ్యయాలకు సంబంధించిన అవగాహన పెరుగుతూ వస్తోంది.
గత కొన్ని సంవత్సరాలుగా స్థూల మూలధన సేకరణ దెబ్బతింటూ వస్తోంది. కారణం.. పరిమితి మించిన లోటు విధానాలు విత్తపరమైన ఏకీకరణ మార్గాల వైపు కేంద్రీకరించకుండా కేవలం లక్ష్యాల సాధనమీదే దృష్టి సారించాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కంటే రాష్ట్ర ప్రభుత్వాలే మూలధన కల్పనపై సాపేక్షికంగా ఎక్కువగా ఖర్చుపెడుతున్నాయి. ఇంతకుముందు, స్థూల మూలధన కల్పనకు ప్రత్యేకించి మౌలిక వసతుల కల్పన కోసం మూలధన నిర్ణయాలపై వ్యూహ రచనకు సంబంధించి కేంద్ర బడ్జెట్ సమర్పించేవరకు వేచి ఉండాల్సి వస్తోంది. అయితే, పీపీపీ నమూనాల ద్వారా మౌలిక వసతుల కల్ప నకు రుణసహాయం చేసే విషయంలోనూ అలాగే కేంద్ర స్థాయిలో నిలి చిపోయిన మూలధన కల్పన విషయంలోనూ ఇటీవల ఒక విధానపరమైన మార్పు జరిగింది. కానీ ఇలాంటి ప్రకటనలు ఉద్దేశపూర్వకంగానే కేంద్ర బడ్జెట్‌లో కనిపించడం లేదు. ఒకవేళ వాటిని బడ్జెట్‌లో పొందుపర్చినప్పటికీ వాటికి అవసరమైన ఫైనాన్స్ విషయంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాబట్టి సూక్ష్మ ఆర్థిక విధాన రూపకల్ప నలో స్పష్టమైన పరివర్తన నేపథ్యంలో కూడా బడ్జెట్ రూపకల్పనలో స్పష్టమైన మార్పు కనబడుతోంది. అదేమిటంటే, వివేకం స్థానంలో నియంత్రిత వివేకం, నిబంధనలు ముందుపీటికి రావడమే.
సంస్థలు
ప్రణాళిక కమిషన్‌కు మంగళం పలకడంతో, ప్రాంతీయ అసమానతలను ఎలా పరిష్కరిస్తారు అనేది పరిష్కరించవలసిన ప్రశ్నగా రంగంలోకి వచ్చింది. బడ్జెట్‌తోపాటు, 15వ ఆర్థిక కమిషన్ అవార్డును కూడా 2020 ఫిబ్రవరిలో ప్రకటించనున్నారు. సమాఖ్య రాజకీయ వ్యవస్థలో సమగ్ర ఆర్థిక సంస్థగా 15వ ఆర్థిక కమిషన్ కీలక పాత్ర వహిస్తుందా? ప్రాంతీయ అసమానతలను పరిష్కరించగలుగుతుందా? అనేది కీలక ప్రశ్న. మరొక సమాఖ్య సంస్థ జీఎస్టీ కౌన్సిల్. ప్రారంభించిన రెండేళ్ల తర్వాత కూడా జీఎస్టీ వ్యవస్థ దేశంలో స్థిరపడలేకపోవడం పెద్ద సమస్య. జీఎస్టీ ద్వారా ఆదాయ సమీకరణకు సంబంధించి తాజా బడ్జెట్ కొంత అంతర్‌దృష్టిని అందించాల్సి ఉంది. అలాగే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆలోచనకూడా బడ్జెట్‌లో ప్రతిఫలించాలి. సమభావం సమస్యను పరిష్కరించడంలోని న్యాయ, విత్త సంస్థల మధ్య అనుసంధానం లేకపోవడం స్పష్టంగా కనబడుతూనే ఉంది.
ఆర్థిక పురోగతి పునరుద్ధరణ
ప్రస్తుత ఆర్థిక మాంద్య పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక పురోగతిని ముందుకు తీసుకెళ్లడంలో ద్రవ్యవిధానం పాత్ర ఏమిటన్నది కీలకమైన అంశం. 2020 బడ్జెట్ దీన్ని పరిష్కరిస్తుందా? ఆర్థిక ఉద్దీపన అనేది ఆర్థిక వృద్ధికి తప్పనిసరిగా దారితీస్తుందా అనే అంశాన్ని తీవ్రంగా చర్చించారు. కొంతమంది ఆర్థిక వేత్తల అభిప్రాయం ప్రకారం భారతదేశంలో ఆర్థిక వృద్ధి మందగమనం అనేది స్వభావరీత్యా సాపేక్షికంగా వ్యవస్థీకృతమైనది. వ్యవస్థీకృతమైన అవరోధాలను పరిష్కరించే విధానాలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. బడ్జెటరీ విధానాలు ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటిస్తున్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రతికూల స్వభావంతో ఉంటున్నాయా ఆనేది తీవ్రంగా చర్చించాల్సిన విషయంగా ఉంటోంది.
ఇటీవలి బడ్జెట్‌లలో వ్యయానికి సంబంధించిన నిర్ణయాలు, చివరి దశలో తీసుకునే నిర్ణయాలకు మధ్య స్పష్టమైన అనుసంధానం ఉంటోంది. ఉదాహరణకు నిరుపేద గృహాలలో మహిళలకు వంట గ్యాస్ అందించడం. ఎన్నికల్లో గెలవడానికి, మెజారిటీ సాదించడానికి సోషల్ సెక్టర్ బడ్జెట్ తప్పనిసరి ప్రమాణంగా ఉంటున్నట్లయితే బడ్జెట్ చట్రం అనేది వచ్చిన ఫలితాలను కాకుండా ఆర్థిక పెట్టుబడులపైనే ఎక్కువగా కేంద్రీకరించే ప్రమాదం ఉంది. అలాగే ఆర్థిక పురోగతిపై పెద్దనోట్ల రద్దు వంటి.. బడ్జెట్లో ముందుగా పేర్కొనని విత్త సంబంధ ప్రకటనలు కలిగించే ప్రభావాల గురించి అంచనా వేయాల్సిన అవసరం ఉంది. అలాగే విధాన ప్రక్రియను సంస్కరించాల్సి ఉంది కూడా. పట్టణ కేంద్రాల కంటే జిల్లాలు పెద్దనోట్ల రద్దు కారణంగా తీవ్రంగా దెబ్బతినిపోయాయని ఒక అధ్యయనం పేర్కొంది. దీంతో ఆర్థిక కార్యాచరణ కుదుపులకు గురైంది. బ్యాంక్ రుణ పెరుగుదల కూడా తగ్గిపోయింది.
చివరగా బడ్జెట్‌కు జవాబుదారీతనం కల్పించే యంత్రాంగాలు ప్రత్యేకించి కాగ్ ద్వారా చేసే పాలసీపరమైన మదింపు, బడ్జెట్ సమర్పణ తర్వాత పార్లమెంటులో జరిగే చర్చల ప్రక్రియద్వారా బడ్జెట్ పారదర్శకత, జవాబుదారీతనం బలోపేతమవుతుంది. విత్తపరమైన విధానాలకు సంబంధించిన రాజకీయ, ఆర్థిక స్వావలంబన కోసం ఏటా జరిగే బడ్జెట్ సైకిల్స్ నుంచి సమర్థవంతమైన మధ్యంతర ద్రవ్య చట్రాన్ని ఏర్పర్చాలనే అభిప్రాయాన్ని చాలామంది అంగీకరిస్తున్నారు. ఇది ఆర్థిక ప్రగతికి శుభపరిణామం.
లేఖా చక్రవర్తి
(ది వైర్ సౌజన్యంతో)
వ్యాసకర్త ఆర్థికవేత్త, ప్రొఫెసర్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ
Comments
Please login to add a commentAdd a comment