
అంతర్జాతీయంగా తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఎదురయితే, పసిడి ధర వేగంగా పెరగడం సహజం. ఆర్థిక వ్యవస్థపై నిజానికి కోవిడ్–19(కరోనా) వైరస్ ప్రభావం కారణంగా అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్–నైమెక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) ధర ఈ నెల మొదట్లో పసిడి ఎనిమిదేళ్ల గరిష్టం 1,704 డాలర్లను తాకింది. అయితే అటు తర్వాత పెట్టుబడులకు సురక్షిత సాధనంగా భావించే ఈ మెటల్ నుంచీ డబ్బును ఇన్వెస్టర్లు ఉపసంహరించి డాలర్‌లోకి పంప్ చేయడం ప్రారంభించారు. దీనితో ఆరు ప్రధాన కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ 103 స్థాయి దాటేసింది (52 వారాల కనిష్టం 95.61). పసిడి 20వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో 1,501 డాలర్ల వద్ద ముగిసింది. ఒక దశలో 1,460 డాలర్ల స్థాయినీ చూసింది. పసిడి 52 వారాల కనిష్టం 1,266 డాలర్లు.
బులిష్ ధోరణే...: భారీగా పెరిగిన పసిడి నుంచి ప్రస్తుతం లాభాల ఉపసంహరణే జరుగుతోంది తప్ప, మెటల్ బేరిష్ ధోరణిలోకి వెళ్లలేదన్నది పలువురి అభిప్రాయం. ఒకవేళ అలా అయినా మహాఅయితే మరో 150 డాలర్లు పతనం కావచ్చని, 1,360, 1,300 డాలర్లు పసిడికి పటిష్ట మద్దతని వాదనలు ఉన్నాయి. పసిడి కొనుగోళ్లకు ఇది సువర్ణ అవకాశమని యూబీఎస్ గ్రూప్‌లో కమోడిటీ, విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వానీ గార్డెన్ పేర్కొంటున్నారు. పలు సెంట్రల్ బ్యాంకులు సరళతర ఆర్థిక విధానాలు అనుసరిస్తున్న నేపథ్యంలో తిరిగి పసిడి భారీగా పెరగడం ఖాయమన్నది ఆయన విశ్లేషణ. కరోనా ప్రభావంతో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమై కరెన్సీ యుద్ధం ప్రారంభమయిన పక్షంలో పసిడే ఇన్వెస్టర్లకు ఏకైక పెట్టుబడి సాధనమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment