లండన్: డిమాండ్ పడిపోయిన నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు మరింత పతనమై, తమ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలకుండా ముడిచమురు ఉత్పత్తి దేశాలు అసాధారణ చర్యలు తీసుకుంటున్నాయి. రేట్ల పతనానికి అడ్డు కట్ట వేసే దిశగా ఉత్పత్తిని భారీగా తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఉత్పత్తి దేశాలన్నీ దీనిపై ఒక అంగీకారానికి వచ్చినట్లు సుదీర్ఘంగా సాగిన వర్చువల్ సమావేశం అనంతరం పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్ వెల్లడించింది. ఈ డీల్ ప్రకారం జూలై దాకా ఒపెక్, దాని భాగస్వామ్య దేశాలు చమురు ఉత్పత్తిని రోజుకు 10 మిలియన్ బ్యారెళ్ల మేర (బీపీడీ) తగ్గించుకోనున్నాయి.
ఆ తర్వాత నుంచి డిసెంబర్ దాకా 8 మిలియన్ బీపీడీకి, 2021 నుంచి 16 నెలల పాటు 6 మిలియన్ బీపీడీకి పరిమితం చేయనున్నాయి. తొలుత ఈ డీల్‌కు ఒప్పుకోకపోయినప్పటికీ ఉత్పత్తి కోతతో తమకు వాటిల్లే నష్టాలను భర్తీ చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భరోసా ఇవ్వడంతో మెక్సికో కూడా అంగీకారం తెలిపింది. అమెరికాతో పాటు మరిన్ని దేశాలు కూడా తమవంతుగా ఉత్పత్తి కోతలను పరిశీలిస్తున్నాయి. తాజా డీల్‌తో ప్రపంచవ్యాప్తంగా చమురు ఉత్పత్తిలో 15 శాతానికి కోతపడవచ్చని విశ్లేషకుల అంచనా. ఇటు పరిమాణంపరంగాను, అటు ఉత్పత్తి కోతలో భాగమవుతున్న దేశాల సంఖ్యాపరంగాను ఇది అసాధారణమని తెలిపారు. ఇంధన రంగంలో బద్ధవిరోధులైన దేశాలు కూడా ఇందులో పాలు పంచుకోవడం విశేషమని పేర్కొన్నారు.
ఇది సరిపోదు..
అయితే, భారీగా పడిపోయిన క్రూడాయిల్ డిమాండ్‌పరమైన నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రతిపాదిత కోతలేమీ సరిపోయే అవకాశాలు లేవని విశ్లేషకులు చెప్పారు. ఇప్పటికే నిల్వలు భారీగా పేరుకుపోయాయని, ఉత్పత్తి కోతలపై ఆయా దేశాలు ఆలస్యంగా నిర్ణయాలు తీసుకున్నాయని పేర్కొన్నారు. ఒకవేళ ఉత్తర అమెరికన్ సంస్థలు 5 మిలియన్ బ్యారెళ్ల మేర ఉత్పత్తిని తగ్గించుకున్నా.. ఇంకా 5–10 మిలియన్ బీపీడీ మేర సరఫరా అధికంగానే ఉంటుందని అంచనా. ఏప్రిల్‌లో సరఫరా, డిమాండ్ మధ్య 27.4 మిలియన్ బీపీడీ స్థాయిలో అసమతౌల్యత ఉంటుందని రీసెర్చ్ సంస్థ రైస్టాడ్ ఎనర్జీ అంచనా.
డిమాండ్‌కి మించి సరఫరా!
కరోనా వైరస్ వ్యాప్తితో చమురు డిమాండ్, ధరలపైనా ప్రతికూల ప్రభావం పడుతోంది. దీంతో ఉత్పత్తి తగ్గించుకోవాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే, దీని వల్ల అమెరికన్ సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందనే ఉద్దేశంతో, తన మార్కెట్ వాటాను కాపాడుకునేందుకు రష్యా అంగీకరించలేదు. ఇది సౌదీ అరేబియాకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఉత్పత్తిని భారీగా పెంచేసి రేట్లను తగ్గించేయడం ద్వారా ధరలపరమైన పోరుకు తెరతీసింది. అప్పట్నుంచి రేట్ల పతనం మొదలైంది. రేట్లు పడిపోవడంతో చాలా దేశాలు చౌకగా చమురు కొనుగోళ్లకు ఎగబడి నిల్వ చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు స్టోరేజీలో సగటున 79 శాతం దాకా నిండుగా ఉందని అంచనా. 7.4 బిలియన్ బ్యారెళ్ల చమురు, తత్సంబంధ ఉత్పత్తుల నిల్వలు ఉన్నాయని.. ఇవి కాకుండా 1.3 బిలియన్ బ్యారెళ్లు రవాణాలో ఉన్నాయని పరిశ్రమవర్గాలు
తెలిపాయి.
2020లో గరిష్ట.. కనిష్టాలు...
నిజానికి 2020 తొలి మూడు నెలల్లోనే అంతర్జాతీయంగా క్రూడ్ ధర భారీ ఎగువ, దిగువ స్థితులను చూడ్డం గమనార్హం. అంతక్రితం మూడు నెలల నుంచీ క్రూడ్ ధర అప్‌ట్రెండ్‌లోనే ఉంది. జనవరిలో అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ మేజర్ జనరల్ ఖాసిం సులేమానీ మరణించడం, ఆ తర్వాత భౌగోళిక ఉద్రిక్త పరిణామాలు చోటుచేసుకోవడంతో ముడిచమురు రేటు ఒక్కసారిగా ఎగిసింది. అప్పటికి 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. అయితే ఆ వెంటనే.. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు, క్రూడ్ ఉత్పత్తికి భయంలేదన్న సంకేతాలు.. తత్సబంధ పరిణామా లతో క్రమంగా చల్లారింది.
అటు తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావంతో క్రూడ్ ధర మరికొంత చల్లారగా, రష్యా–సౌదీ అరేబియాల మధ్య మార్చి మొదటి వారంలో చోటుచేసుకున్న ‘ధరల యుద్ధం’తో 19 సంవత్సరాల కనిష్టానికి పడిపోయింది. ఈ మూడు నెలల కాలంలో ధరల పరిస్థితిని చూస్తే, అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో నైమెక్స్ లైట్ స్వీట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 66.6–19.27 డాలర్ల గరిష్ట, కనిష్ట స్థాయిలను చూడగా, బ్రెంట్ క్రూడ్ ధర 75.6–21.65 డాలర్ల గరిష్ట, కనిష్ట స్థాయిల్లో తిరుగాడాయి. శుక్రవారం గుడ్‌ఫ్రైడే సెలవు రోజు కాగా, గురువారం ట్రేడింగ్‌లో నైమెక్స్ లైట్ స్వీట్ క్రూడ్ ధర 23.21 డాలర్ల వద్ద ముగియగా, బ్రెంట్ 31.82 డాలర్ల వద్ద ఉంది. తాజా డీల్ నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్ సందర్భంగా క్రూడ్ ధరలు భారీగా పెరిగే అవకాశాలు
కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment