
సాక్షి, హైదరాబాద్: ఎవరూ ఊహించని అనిశ్చిత స్థితిలో ప్రపంచం ప్రస్తుతం కొట్టుమిట్టాడుతోందని, ఆరోగ్యరంగంలో మౌలిక వసతులను పటిష్టం చేయడం ద్వారా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సీఈఓ క్లబ్ హైదరాబాద్‌కు చెందిన సుమారు వంద మంది ముఖ్యులతో కేటీఆర్ శనివారం వీడియో కాల్ ద్వారా సంభాషించారు. లాక్‌డౌన్ ప్రభావంతో పాటు, వ్యాపార వాణిజ్య కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
వైరస్ వ్యాపిస్తున్న తీరును బట్టి రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాన్ని మార్చుకుంటోందని, సరైన సమయంలో అప్రమత్తమై దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడాన్ని సరైన చర్యగా అభివర్ణించారు. కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్రప్రభుత్వం సర్వ శక్తులూ ఒడ్డుతోందని, సమాజంలో అట్టడుగు వర్గాల పట్ల అత్యంత శ్రద్ధ చూపుతోందన్నారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు వివిధ రంగాలకు చెందిన నిపుణులతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతుందని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. లైఫ్ సైన్సెస్ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరిగి వేగం పుంజుకోవడంలో దోహదం చేస్తుందన్నారు. సీఈఓలు పేర్కొన్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత మేర పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఈఓలు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment