
న్యూఢిల్లీ: ‘విమానాశ్రయాలు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రజలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బాగుందనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి’ అని కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి సురేశ్ అంగడీ అన్నారు. ఆర్థికమాంద్య పరిస్థితులు ఉన్నాయని అసత్యాలు ప్రచారం చేసి ప్రధాని మోదీ ప్రతిష్టను తగ్గించేందుకే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ‘మూడేళ్లకు ఒకసారి ఆర్థిక వ్యవస్థ కొంత మందగించడం సహజమే. అది త్వరలోనే సర్దుకుంటుంది’ అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌సహా ప్రతిపక్ష పార్టీలు ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తాలని యోచిస్తున్నాయి. దీనిపై సురేశ్ అంగడీ మాట్లాడుతూ, ఆర్థిక మందగింపు సహజమేనని, త్వరలో పుంజుకుంటుందని, ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని విమర్శించేందుకు కారణం లేక, దీనిని ప్రస్తావిస్తున్నాయని ఎద్దేవా చేశారు.