న్యూఢిల్లీ: దేశంలో నమోదైన 5,068 విదేశీ కంపెనీల్లో 2022 జూలై 27వ తేదీ నాటికి 3,291 కంపెనీలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ సోమవారం వెల్లడించారు. క్రియాశీలంగాలేని విదేశీ కంపెనీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అంశాన్ని పరిశీలించడం లేదని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కంపెనీల చట్టం, 2013ను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది.
దేశంలో పనిచేస్తున్న కంపెనీలు ఈ చట్టం కింద తప్పనిసరిగా నమోదుకావాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆమోదం పొందిన తర్వాత విదేశీ కంపెనీలు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌ఓసీ) ఢిల్లీలో నమోదవుతాయి. విదేశీ క్రియాశీల కంపెనీలు తప్పనిసరిగా చట్ట ప్రకారం స్టాట్యూటరీ ఫైలింగ్ జరుపుతాయి. వివిధ చట్ట పరమైన అంశాలకు అనుగుణంగా పనిచేస్తాయి. ఆయా అంశాలపై లోక్‌సభలో మంత్రి లిఖిత పూర్వక సమాధానం చెప్పారు. భారతదేశంలో 1,777 విదేశీ కంపెనీలు తమ వ్యాపార కార్యాలయాను మూసివేసినట్లు చెప్పారు.
షెల్ కంపెనీల నిర్వచనం లేదు: కంపెనీల చట్టంలోని నిబంధనల ప్రకారం, రిజిస్టర్డ్ విదేశీ షెల్ కంపెనీలను నిర్వచించలేదని మంత్రి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘‘కంపెనీల చట్టంలోని సెక్షన్ 2(42)లోని నిబంధనలు విదేశీ కంపెనీలు నిర్వచనాన్ని ఇస్తున్నాయి. దీని ప్రకారం భారతదేశం వెలుపల ఒక కంపెనీ లేదా సంస్థ రిజిస్టరై, అది భారతదేశంలో స్వయంగా లేదా ఏజెంట్ ద్వారా, భౌతికంగా లేదా ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా ఏవైనా వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడానికి వీలుంది. ఇలాంటి కంపెనీని చట్టం విదేశీ కంపెనీగా పేర్కొంటోంది’’ అని సింగ్ తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంజూరు చేసిన బ్రాంచ్ ఆఫీస్ అద్దె ఒప్పందం అమలు నిలిచిపోవడం, చెల్లుబాటు గడువు ముగియడం వంటి కారణాల వల్ల భారతదేశంలో ఒక విదేశీ కంపెనీ క్రియాశీలంగా లేదని పరిగణిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
119 కేసుల విచారణకు ఎస్‌ఎఫ్‌ఐఓకు ఆదేశాలు..
2017–18 నుండి ఇప్పటి వరకు 119 కేసులను విచారించాలని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐఓ)ను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ కోరినట్లు మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపింది. 2020–21, 2021–22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి అలాగే 2022–23 జూన్ 30వ తేదీ వరకూ కార్పొరేట్ మోసానికి పాల్పడిన ఏ లిస్టెడ్ కంపెనీని గుర్తించలేదని సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తెలియజేసినట్లు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment