న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన చర్యలు ఆర్థిక వ్యవస్థను స్థిరపర్చగలవని పరిశ్రమల సమాఖ్య సీఐఐ పేర్కొంది. బహుళ రంగ, బహుముఖ విధానపరమైన చర్యలతో వృద్ధికి ఊతం లభించగలదని సీఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ తెలిపారు. అంతర్జాతీయంగా ప్రతికూలతలు, వాణిజ్యపరమైన మందగమనం కారణంగా ప్రపంచ ఎకానమీకి అస్తవ్యస్తంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రకటన పరిశ్రమలకు ఊరటనిచ్చేవిగా ఉన్నాయని చెప్పారు. ‘ద్రవ్య లోటుపై ఒత్తిడి పడకుండా బహుళ రంగాలకు ఊతమిచ్చే ప్రతిపాదనలు రూపొందించిన తీరు ప్రశంసనీయం. ఈ ప్రకటనలతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సిక్సర్ కొట్టారు’ అని కిర్లోస్కర్ తెలిపారు. కొద్ది నెలల్లో ఎకానమీ మళ్లీ పుంజుకోగలదని సీఐఐ ఆశాభావం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment