Vikram Kirloskar
-
టయోటా కిర్లోస్కర్ వైస్ చైర్‌పర్సన్‌గా మానసి టాటా.. ఎవరీ మానసి?
సాక్షి,ముంబై: టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్‌పర్సన్‌గా విక్రమ్ కిర్లోస్కర్ కుమార్తె మానసి టాటా నియమితు లయ్యారు. ఆమె తండ్రి విక్రమ్ కిర్లోస్కర్ అకాలమరణం తరువాత, కంపెనీ JV కంపెనీల బోర్డులో డైరెక్టర్ అయిన మానసి టాటాను టయోటా కిర్లోస్కర్ ఆటో విడిభాగాల (TKAP) వైస్ చైర్‌పర్సన్‌గా నియమించింది. తక్షణమే వైస్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు టయోటా కిర్లోస్కర్ మోటార్ గురువారం ప్రకటించింది. మానసి టాటా ఇప్పటికే టయోటా కిర్లోస్కర్ మోటార్లో డైరెక్టర్ల బోర్డులో సభ్యురాలిగా ఉన్నారు. అలాగే కంపెనీ కార్పొరేట్ నిర్ణయాలు ,వ్యూహాత్మక కార్యకలాపాలలో కీలకంగా ఉన్నారని కంపెనీ ఒకప్రకటనలో తెలిపింది. ఇంక్లూజివ్ థినింగ్ , పీపుల్ సెంట్రిక్ ఔట్లుక్"ని తీసుకొచ్చి, భారతీయ ఆటో పరిశ్రమపై ఆమెకున్న పదునైన అవగాహనతో పాటు, 'అందరికీ మాస్ హ్యాపీనెస్' అందించడంలో కంపెనీ నిబద్ధతను ఆమె నియామకం మరింత బలోపేతం చేస్తుందని టొయోటా కిర్లోస్కర్ మోటార్ సీఎండీ మసకాజు యోషిమురా అన్నారు" మానసి టాటా అమెరికాలోని రోడ్ ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుండి గ్రాడ్యుయేట్ అయ్యారు. కేరింగ్ విత్ కలర్ అనే ఎన్జీవో ద్వారా కర్ణాటకలోని మూడు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలపై పనిచేస్తున్నారు ఆమె 2019లో నోయెల్ టాటా (రతన్ టాటా సవతి సోదరుడు)కుమారుడు నెవిల్లే టాటాను వివాహం చేసుకున్నారు. కిర్లోస్కర్ సామ్రాజ్యం ఐదోతరం ప్రతినిధిగా తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాలని బిజినెస్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా మానసి తండ్రి విక్రమ్ కిర్లోస్కర్ గతేడాది నవంబర్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. డిసెంబరులో, కిర్లోస్కర్ సిస్టమ్స్ కంపెనీ యొక్క JV కంపెనీలైన టయోటా ఇండస్ట్రీస్ ఇంజిన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కిర్లోస్కర్ టయోటా టెక్స్టైల్ మెషినరీ ప్రైవేట్ లిమిటెడ్ (KTTM), టయోటా మెటీరియల్ హ్యాండ్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (TMHIN), DNKI బోర్డులో మానసి టాటాను డైరెక్టర్‌గా నియమించింది. -
తక్షణమే రూ.15 లక్షల కోట్ల ప్యాకేజీ కావాలి
న్యూఢిల్లీ: పరిశ్రమలకు తక్షణమే రూ.15 లక్షల కోట్లు లేదా జీడీపీలో 7.5 శాతానికి సమాన స్థాయిలో ఆర్థిక ఉద్దీపనల ప్యాకేజీని ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఐఐ కోరింది. కరోనా వైరస్ దేశ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావానికి కారణమైనట్టు పేర్కొంది. వైరస్ ప్రభావం మరో 12–18 నెలల (చికిత్స లేదా వ్యాక్సిన్ వచ్చే వరకు) వరకు కొనసాగే అవకాశాలున్న నేపథ్యంలో పరిశ్రమలకు, పేదలకు తక్షణమే ప్రభుత్వం నుంచి మద్దతు అవసరమని అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల నుంచి కోలుకునేందుకు రెండేళ్లు పడుతుందని పేర్కొంది. ప్రభుత్వ పేపర్లను ఆర్బీఐకి విక్రయించడం ద్వారా రూ.2 లక్షల కోట్లు, సెకండరీ మార్కెట్ నుంచి రూ.2 లక్షల కోట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవడం ద్వారా రూ.4లక్షల కోట్ల మేర సర్దుబాటు చేసుకోవచ్చని సూచించింది. ‘‘50 రోజులకు పైగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ముందస్తు అంచనాల కంటే కూడా ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం గణనీయంగా ఉండనుంది. దీన్ని అధిగమించేందుకు భారీ ఆర్థిక ప్యాకేజీ అవసరం. అప్పుడే ఉద్యోగాలు, జీవనోపాధిని కాపాడుకోవచ్చు’’ అని సీఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ అన్నారు. ప్రభుత్వ ప్యాకేజీలో రూ.2 లక్షల కోట్లను జన్‌ధన్ ఖాతాదారులకు నగదు బదిలీ రూపంలో అందించడం కూడా భాగంగా ఉండాలని సిఐఐ సూచించింది. కార్మిక చట్టాలను రద్దు చేయండి: కార్మిక చట్టాలను దేశవ్యాప్తంగా రెండు నుంచి మూడేళ్ల కాలానికి రద్దు చేయాలంటూ పారిశ్రామిక సంఘాలు డిమాండ్ చేశాయి. దాంతో కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన పరిస్థితుల నుంచి పరిశ్రమలు గట్టెక్కగలవని అభిప్రాయపడ్డాయి. కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్ శుక్రవారం సీఐఐ, ఫిక్కీ, అసోచామ్ ప్రతినిధులతో ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించడం, పరిస్థితుల మెరుగుపై వెబినార్ నిర్వహించారు. చట్ట పరిధిలో సవరణలు ఇవ్వాలని, కార్మికుల పని గంటలను 8 గంటల నుంచి 12 గంటలకు పెంచాలని కోరాయి. అలాగే, కనీస వేతనం, బోనస్ మినహా కార్మిక చట్టంలోని మిగిలిన సెక్షన్లను సస్పెండ్ చేయాలని కోరాయి. -
వ్యాపార నిబంధనాలు తొలగించండి
న్యూఢిల్లీ: దేశంలో వ్యాపారాలను మరింత సులభంగా నిర్వహించుకునే వాతావరణం కల్పించాలని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కేంద్రాన్ని కోరారు. 2020–21 బడ్జెట్ ముందస్తు సంప్రదింపుల్లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్, సీఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్, అసోచామ్ ప్రెసిడెంట్ బాలకృష్ణ గోయెంకా తదితర పారిశ్రామిక ప్రముఖులతోపాటు కార్మిక సంఘాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమైన సూచనలు, డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. మరింత స్వేచ్ఛ... ‘‘దేశంలో వ్యాపార నిర్వహణను సులభంగా మార్చే విషయమై చర్చించేందుకే నేను ఈ రోజు ఇక్కడకు వచ్చాను. నా డిమాండ్ ఇదే. వినియోగదారుల ప్రయోజనాన్ని, పెట్టుబడులను సమతౌల్యం చేయాల్సి ఉంది’’ అని సునీల్ భారతీ మిట్టల్ సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులకు చెప్పారు. కంపెనీల కొనుగోళ్లు, విలీనాలు, వ్యాపార విభజన, ఎన్సీఎల్టీ ప్రక్రియను ఆలస్యం చేస్తున్న ఆదాయపన్ను సెక్షన్లపై సూచనలు చేసినట్టు వెల్లడించారు. ‘‘పరిశ్రమలు మరింత స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం ఉండాలన్నదే ఆలోచన. వాటిని ఆర్థిక మంత్రి చక్కగా స్వీకరించారు. భారత పారిశ్రామికవేత్తల శక్తిని ద్విగుణీకృతం చేసే విధంగా ఈ బడ్జెట్ ఉండాలని కోరుకుంటున్నాం’’ అని మిట్టల్ తెలిపారు. వ్యాపార సులభతర నిర్వహణ కీలక పాత్ర పోషిస్తుందని అసోచామ్ ప్రెసిడెంట్ బాలకృష్ణగోయంకా పేర్కొనగా, చాలా పరిశ్రమలకు ఇదే ఆందోళనకర అంశమని సీఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ చెప్పారు. వ్యాపార సులభ నిర్వహణతోపాటు వృద్ధి ప్రేరణకు ఏం చేయగలమన్న అంశంపై చర్చించినట్టు ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూపు అధినేత సంజీవ్ గోయెంకా తెలిపారు. ‘‘అన్ని రకాల సలహాలను వారు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ తరహా స్పందనను ప్రభుత్వం నుంచి చూడడం ఇదే మొదటిసారి’’ అని గోయెంకా పేర్కొన్నారు. మందగమనం చాలా రంగాల్లో ఉత్పత్తి సామర్థ్యం వినియోగంపై ప్రభావం చూపించిందన్నారు. ఇది సాధారణ స్థితికి రావడానికి మూడు, నాలుగు త్రైమాసికాల సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు. పన్ను భారం తగ్గించాలి.. ‘‘రూ.20 లక్షల కంటే ఒక ఏడాదిలో తక్కువ ఆర్జించే వారికి ఆదాయపన్ను తగ్గించాలని సూచన చేశాం. దీనివల్ల వినియోగదారుల చేతుల్లో ఖర్చు చేసేందుకు మరింత ఆదాయం ఉంటుంది. అది ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుంది. ఈఎంఐలను తగ్గించాలనీ కోరాం. ఆర్బీఐ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని మరింతగా వినియోగదారులకు బదిలీ చేస్తే ఈఎంఐల భారం తగ్గుతుంది’’ అని ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమాని తెలిపారు. ఆదాయపన్ను సీలింగ్ పెంచాలి: కార్మిక సంఘాలు కనీస వేతనాన్ని రూ.21,000 చేయాలని, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద కనీస పెన్షన్‌ను రూ.6,000కు పెంచాలని, వార్షికంగా రూ.10 లక్షల ఆదాయం ఉన్న వారిని ఆదాయపన్ను నుంచి మినహాయించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కార్మిక సంఘాలు కోరాయి. బడ్జెట్ ముందస్తు సంప్రదింపుల్లో భాగంగా తమ డిమాండ్లను మంత్రి ముందుంచాయి. దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడంపై ఆందోళనను వ్యక్తం చేశాయి. ఉద్యోగ కల్పన దిశగా రానున్న బడ్జెట్లో ఉండాల్సిన చర్యలను సూచించాయి. ► మౌలిక, సామాజిక రంగాలు, వ్యవసాయంపై ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వ్యయం చేయడం ద్వారా ఉద్యోగాలను కల్పించొచ్చు. ►అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాల తగ్గింపు, అదనపు పోస్టులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలి. ► నిత్యావసర వస్తువులను స్పెక్యులేటివ్ ఫార్వార్డ్ ట్రేడింగ్ నుంచి నిషేధించాలి. ►సామర్థ్యాలు ఉండి కూడా దెబ్బతిన్న ప్రభుత్వరంగ సంస్థలను పునరుద్ధరించేందుకు బడ్జెట్ నుంచి నిధుల సహకారం ఇవ్వాలి. ►10 మంది ఉద్యోగులను కలిగిన కంపెనీలనూ ఈపీఎఫ్‌వో పరిధిలోకి తీసుకురావాలి. ప్రస్తుతం ఇది కనీసం 20 మంది ఉద్యోగులున్న కంపెనీలకు వర్తిస్తోంది. ►గ్రాట్యుటీని ఏడాదిలో 15 రోజులకు కాకుండా కనీసం 30 రోజులకు చెల్లించేలా చేయాలి. ►హౌసింగ్, మెడికల్, ఎడ్యుకేషన్‌కు సంబంధించి ఇస్తున్న అలవెన్స్‌లపై పన్ను మినహాయింపు ఇవ్వాలి. ►స్టీల్, బొగ్గు, మైనింగ్, హెవీ ఇంజనీరింగ్, ఫార్మా, డ్రెడ్జింగ్, సివిల్ ఏవియేషన్, ఫైనాన్షియ ల్ రంగంలోని ప్రభుత్వరంగ సంస్థలను వ్యూహాత్మక విక్రయాలకు దూరంగా ఉంచాలి. -
ఉద్దీపన ప్యాకేజీతో ఎకానమీకి ఊతం: సీఐఐ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన చర్యలు ఆర్థిక వ్యవస్థను స్థిరపర్చగలవని పరిశ్రమల సమాఖ్య సీఐఐ పేర్కొంది. బహుళ రంగ, బహుముఖ విధానపరమైన చర్యలతో వృద్ధికి ఊతం లభించగలదని సీఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ తెలిపారు. అంతర్జాతీయంగా ప్రతికూలతలు, వాణిజ్యపరమైన మందగమనం కారణంగా ప్రపంచ ఎకానమీకి అస్తవ్యస్తంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రకటన పరిశ్రమలకు ఊరటనిచ్చేవిగా ఉన్నాయని చెప్పారు. ‘ద్రవ్య లోటుపై ఒత్తిడి పడకుండా బహుళ రంగాలకు ఊతమిచ్చే ప్రతిపాదనలు రూపొందించిన తీరు ప్రశంసనీయం. ఈ ప్రకటనలతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సిక్సర్ కొట్టారు’ అని కిర్లోస్కర్ తెలిపారు. కొద్ది నెలల్లో ఎకానమీ మళ్లీ పుంజుకోగలదని సీఐఐ ఆశాభావం వ్యక్తం చేసింది. -
పన్నులు మరింత తగ్గించాలి
న్యూఢిల్లీ: కార్ల అమ్మకాలు వరుసగా రెండో ఆర్థిక సంవత్సరంలో కూడా పడిపోయాయి. ఆర్థిక మందగమనం కారణంగా కార్లకు డిమాండ్ తగ్గిందని, 2013-14 ఆర్థిక సంవత్సరంలో కార్ల విక్రయాలు 4.65 శాతం తగ్గాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియాం) వెల్లడించింది. ఫలితంగా ఈ రంగంతో సంబంధం ఉన్న లక్ష-లక్షన్నర ఉద్యోగాలు పోయాయన్న అంచనాలున్నాయని సియాం అధ్యక్షుడు విక్రమ్ కిర్లోస్కర్ చెప్పారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు స్వల్పంగా పుంజుకోవచ్చని, కనీసం ప్రతికూల ఫలితాలు రాకపోవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గింపును కొనసాగించే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వాహన రంగంపై పన్నులు బాగా ఉన్నాయని, పన్నులు మరింత తగ్గించాలని ఆయన కోరారు. వృద్ధికి ఊతమిచ్చేలా, తయారీ రంగం పుంజుకునేలా, వినియోగదారు సెంటిమెంట్‌ను పెంచేలా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పడే చర్యలు తీసుకుంటే వాహన రంగానికి కూడా ప్రయోజనమేనని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పెరుగుతుండడంతో తేలిక రకం వాణిజ్య వాహనాల విక్రయాలు పెరుగుతాయని, టూవీలర్ల, ముఖ్యంగా స్కూటర్ల విక్రయాలు మరింతగా పెరుగుతాయని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో వాహన కంపెనీలు రూ.20 వేల కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టాయని, 35 కొత్త మోడళ్లు, 51 కొత్త వేరియంట్లు మార్కెట్లోకి వచ్చాయని వివరించారు. స్వచ్ఛంద వాహన రీకాల్ విధానానికి వాహన పరిశ్రమ అనుకూలమేనని ఆయన వివరించారు. పెరిగిన మారుతీ మార్కెట్ వాటా భారత ప్రయాణికుల కార్ల మార్కెట్లో మారుతీ సుజుకి వాటా మరింత పెరిగి 42 శాతానికి చేరింది. గత ఆర్థిక సంవత్సరానికి వాహన విక్రయాలకు సంబంధించిన గణాంకాలను సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో కార్ల విక్రయాలు తగ్గినప్పటికీ, మారుతీ మార్కెట్ వాటా 39.43 శాతం నుంచి 42 శాతానికి పెరగడం విశేషం. సియామ్ గణాంకాల ప్రకారం... హ్యుందాయ్ కంపెనీ 15.18 శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానంలో నిలిచింది. ఇక మూడో స్థానంలో టాటా మోటార్స్‌ను తోసిరాజని మహీంద్రా అండ్ మహీంద్రా(10.15 శాతం) దూసుకువచ్చింది. 8 శాతం మార్కెట్ వాటాతో టాటా మోటార్స్ నాలుగో స్థానంతో సరిపుచ్చుకుంది. ఐదవ స్థానంలో హోండా(5.36 శాతం మార్కెట్ వాటా), ఆరవ స్థానంలో టయోటా(5.14 శాతం)లు నిలిచాయి. -
‘సియాం’ కొత్త అధ్యక్షుడిగా విక్రమ్ కిర్లోస్కర్
న్యూఢిల్లీ: సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియాం) కొత్త అధ్యక్షుడిగా విక్రమ్ కిర్లోస్కర్ ఎన్నికయ్యారని సియాం తెలిపింది. ఆయన టయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక సియాం కొత్త వైస్ ప్రెసిడెంట్‌గా అశోక్ లేలాండ్ ఎండీ వినోద్ దాసరి, కోశాధికారిగా జనరల్ మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ లొవెల్ పాడాక్లు ఎన్నికయ్యారని సియాం పేర్కొంది. భారత వాహన పరిశ్రమకు ఉన్నత స్థానాన్ని కల్పించేందుకు కృషి చేస్తామని విక్రమ్ కిర్లోస్కర్ పేర్కొన్నారు. భారత వాహన పరిశ్రమ తయారీ రంగంలో అగ్రస్థానంలో ఉండడమే కాకుండా వినియోగదారుల ప్రయోజనాలు కాపాడే గురుతర బాధ్యతను కూడా నిర్వర్తిస్తోందని చెప్పారు.