పన్నులు మరింత తగ్గించాలి
న్యూఢిల్లీ: కార్ల అమ్మకాలు వరుసగా రెండో ఆర్థిక సంవత్సరంలో కూడా పడిపోయాయి. ఆర్థిక మందగమనం కారణంగా కార్లకు డిమాండ్ తగ్గిందని, 2013-14 ఆర్థిక సంవత్సరంలో కార్ల విక్రయాలు 4.65 శాతం తగ్గాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియాం) వెల్లడించింది. ఫలితంగా ఈ రంగంతో సంబంధం ఉన్న లక్ష-లక్షన్నర ఉద్యోగాలు పోయాయన్న అంచనాలున్నాయని సియాం అధ్యక్షుడు విక్రమ్ కిర్లోస్కర్ చెప్పారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు స్వల్పంగా పుంజుకోవచ్చని, కనీసం ప్రతికూల ఫలితాలు రాకపోవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు.
ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గింపును కొనసాగించే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వాహన రంగంపై పన్నులు బాగా ఉన్నాయని, పన్నులు మరింత తగ్గించాలని ఆయన కోరారు. వృద్ధికి ఊతమిచ్చేలా, తయారీ రంగం పుంజుకునేలా, వినియోగదారు సెంటిమెంట్‌ను పెంచేలా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పడే చర్యలు తీసుకుంటే వాహన రంగానికి కూడా ప్రయోజనమేనని వివరించారు.
గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పెరుగుతుండడంతో తేలిక రకం వాణిజ్య వాహనాల విక్రయాలు పెరుగుతాయని, టూవీలర్ల, ముఖ్యంగా స్కూటర్ల విక్రయాలు మరింతగా పెరుగుతాయని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో వాహన కంపెనీలు రూ.20 వేల కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టాయని, 35 కొత్త మోడళ్లు, 51 కొత్త వేరియంట్‌లు మార్కెట్లోకి వచ్చాయని వివరించారు. స్వచ్ఛంద వాహన రీకాల్ విధానానికి వాహన పరిశ్రమ అనుకూలమేనని ఆయన వివరించారు.
పెరిగిన మారుతీ మార్కెట్ వాటా
భారత ప్రయాణికుల కార్ల మార్కెట్లో మారుతీ సుజుకి వాటా మరింత పెరిగి 42 శాతానికి చేరింది. గత ఆర్థిక సంవత్సరానికి వాహన విక్రయాలకు సంబంధించిన గణాంకాలను సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో కార్ల విక్రయాలు తగ్గినప్పటికీ, మారుతీ మార్కెట్ వాటా 39.43 శాతం నుంచి 42 శాతానికి పెరగడం విశేషం. సియామ్ గణాంకాల ప్రకారం... హ్యుందాయ్ కంపెనీ 15.18 శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానంలో నిలిచింది.
ఇక మూడో స్థానంలో టాటా మోటార్స్‌ను తోసిరాజని మహీంద్రా అండ్ మహీంద్రా(10.15 శాతం) దూసుకువచ్చింది. 8 శాతం మార్కెట్ వాటాతో టాటా మోటార్స్ నాలుగో స్థానంతో సరిపుచ్చుకుంది. ఐదవ స్థానంలో హోండా(5.36 శాతం మార్కెట్ వాటా), ఆరవ స్థానంలో టయోటా(5.14 శాతం)లు నిలిచాయి.