‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’లో ప్రసంగిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్
వాషింగ్టన్: అమెరికా ప్రయోజనాలు, ఆర్థికవ్యవస్థ, విలువలను చైనా, రష్యా వంటి దేశాలు సవాల్ చేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇందుకోసం దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. స్వాప్నికులకు మేలుచేయడంతోపాటు, వలస విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అధ్యక్ష పగ్గాలు చేపట్టాక తొలిసారి స్టేట్ ఆఫ్ ది యూనియన్‌ను ఉద్దేశించి బుధవారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) ఆయన ప్రసంగించారు.
80 నిమిషాలసేపు కొనసాగిన ఈ ప్రసంగంలో ‘అమెరికా ఫస్ట్’ నినాదం, నాలుగు స్తంభాల వలస విధానం, నైపుణ్యాధారిత వలసలు (భారత్ వంటి దేశాల నిపుణులకు మేలుచేసే) ఏడాది పాలనలో ఆర్థిక విజయాలు, స్టాక్‌మార్కెట్ వృద్ధి, నిరుద్యోగం తగ్గటం వంటి విజయాలనూ పేర్కొన్నారు. దేశ స్థితిగతులు, తన విజయాలు, ప్రణాళికలను కాంగ్రెస్ ఉభయసభలకు దేశాధ్యక్షుడు వివరించేదే ఈ ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్ ’ ప్రసంగం.
విభేదాలను పక్కనపెట్టి
‘మనమంతా రాజకీయాలకు అతీతంగా ఏకమై దేశానికి మేలు చేసే లక్ష్యంతో ముందుకెళ్లాలి’ అని ట్రంప్ డెమొక్రాట్, రిపబ్లికన్ సభ్యులకు పిలుపునిచ్చారు. ‘మన పౌరులను వర్ణం, మతం, జాతితో సంబంధం లేకుండా కాపాడాలనేదే నా అభిప్రాయం. అమెరికన్లు తమ దేశాన్ని ప్రేమిస్తారు. వారికి ప్రేమను పంచే ప్రభుత్వాలనే కోరుకుంటారు’ అని ట్రంప్ పేర్కొన్నారు. ‘ఇది నవ అమెరికా క్షణం. అమెరికా కలలో జీవించాలనుకునే వారికి ఇంతకన్నా గొప్ప అవకాశం ఉండదు’ అని పేర్కొన్నారు. అధ్యక్షుడిగా పనిచేయటం వ్యాపారాన్ని నడిపినట్లు కాదని అర్థమైందని.. ప్రభుత్వం నడిపేందుకు హృదయంతో పనిచేయాల్సి ఉంటుందని ఈ ఏడాదిలో తెలుసుకున్నానన్నారు. అమెరికాలోని వివాదాస్పద గ్వాంటనమో జైలును ముసివేయటం లేదని ట్రంప్ తెలిపారు. దీనికి సంబంధించిన ఆదేశాలపై సమావేశానికి ముందే ట్రంప్ సంతకం చేశారు.
నాలుగు స్తంభాల విధానం
18లక్షల మంది స్వాప్నికులకు లబ్ధిచేకూర్చటం, వలసల విధానంలో సంస్కరణలకోసం నాలుగు స్తంభాల విధానాన్ని ట్రంప్ ప్రతిపాదించారు. ‘మన ప్రణాళిక ప్రకారం, విద్య, పనికి సంబంధించిన నిబంధనలకు సరిపోతారో, నీతివంతమైన ప్రవర్తనను కనబరుస్తారో వారు అమెరికా పూర్తిస్థాయి పౌరులుగా ఉండేందుకు అనుమతి పొందుతారు’ అని మొదటి స్తంభాన్ని వివరించారు. ఇది స్వాప్నికులకు మేలుచేసే నిర్ణయంగా భావిస్తున్నారు. మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మించటమే రెండో స్తంభం. ట్రంప్ మొదట్నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న లాటరీ వీసా విధానాన్ని రద్దుచేయటమే మూడో పిల్లర్ ఉద్దేశం. గొలుసుకట్టు వీసాల విధానానికి చరమగీతం పాడటమే నాలుగో పిల్లర్. అమెరికా పౌరసత్వం పొందిన వ్యక్తి ఎందరైనా తన బంధువులు, కావాల్సిన వారిని అమెరికాకు తీసుకొచ్చి ఉపాధి కల్పించటమే ఈ వీసా విధానం.
నిరుద్యోగం తగ్గింది
దేశంలో 45 ఏళ్ల అత్యల్ప స్థాయికి నిరుద్యోగం చేరుకుందని ఆయన పేర్కొన్నారు. చిరు వ్యాపారుల విశ్వాసం అపరిమితంగా పెరిగిందన్నారు. స్టాక్ మార్కెట్ రికార్డులను బద్దలు చేస్తూ దూసుకెళ్తోందన్నారు. వ్యాపార పన్నురేటును 35 శాతం నుంచి 21 శాతానికి తగ్గించటం పెద్ద పన్నుల సంస్కరణన్నారు.
ఉత్తరకొరియాకు హెచ్చరిక
ఉత్తరకొరియా నిర్లక్ష్యపూరిత ధోరణిపై ట్రంప్ తన ప్రసంగంలో మండిపడ్డారు. అణు క్షిపణులను పరీక్షించటం ద్వారా అమెరికా నగరాలను బెదిరించాలని చూస్తోందన్నారు. గత ప్రభుత్వాలు అమెరికాను ప్రమాదకర స్థితిలోకి నెట్టేలా చేసిన తప్పులను తను చేయబోనని స్పష్టం చేశారు. ‘అంతర్గతంగా అమెరికా బలాన్ని, విశ్వాసాన్ని పునర్నిర్మిస్తున్నాం. విదేశీగడ్డపైనా మన బలాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాం.
ప్రపంచవ్యాప్తంగా విలువల్లేని కొన్ని దేశాలు, ఉగ్రవాద సంస్థలు, చైనా, రష్యా వంటి శత్రుదేశాలు మన ప్రయోజనాలు, ఆర్థిక వ్యవస్థ, విలువలకు సవాల్ విసురుతున్నాయి. ఈ సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో మనం బలహీనంగా ఉంటే ముందడుగు వేయలేం’ అని ట్రంప్ పేర్కొన్నారు. ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ట్రంప్ కేబినెట్ సభ్యులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, గతేడాది అమెరికన్ కాల్పుల్లో మృతిచెందిన భారతీయుడు శ్రీనివాస్ కూచిభొట్ల భార్య సునయన కూడా ఈ ప్రసంగానికి ఆహ్వానితురాలిగా హాజరయ్యారు.
ట్రంప్ స్వీయ కరతాళాలు
వివాదాస్పద వ్యాఖ్యలకు, వింత హావభావాలకు పేరుగాంచిన ట్రంప్ ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ ప్రసంగం సమయంలోనూ వింతగా వ్యవహరించారు. ప్రసంగిస్తూ మధ్యలో తన వ్యాఖ్యలకు ప్రశంసగా తనకు తానే చప్పట్లు కొట్టుకుంటూ ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనిపై సోషల్ మీడియాలో భారీగా స్పందనలు వచ్చాయి. చాలా మంది ప్రజలు ట్రంప్‌ను ఎద్దేవా చేస్తూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ ప్రసంగ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా తులసీ గబార్డ్, కెవిన్ యోడర్‌లతో సునయన (మధ్యలో)
Comments
Please login to add a commentAdd a comment