న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రభావాలను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థ మూలాల బలోపేతానికి సాయపడతాయని.. తద్వారా దీర్ఘకాలంలో స్థిరమైన ఆర్థిక వృద్ధి సాధ్యపడుతుందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ మేరకు ఓ నివేదిక విడుదల చేసింది. ‘‘విధానపరమైన వాతావరణానికితోడు భాగస్వాములు అందరూ కలసి తీసుకున్న చర్యలు.. అవకాశాలను సొంతం చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి సామర్థ్యాన్ని ఇనుమడింపజేస్తుంది’’ అంటూ కేంద్ర ఆర్థిక శాఖ రూపొందించిన నెలవారీ ఆర్థిక నివేదిక తెలియజేసింది.
కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉండడం అన్నది స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి వృద్ధి రేటుకు ప్రతికూలంగా మారుతుందని.. అయితే ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలు దీన్ని అధిగమించేలా చేస్తాయంటూ వివరించింది. సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 30 మధ్య దేశంలో కరోనా కేసులు గరిష్టాలకు చేరినట్టు తెలుస్తోందని పేర్కొంది. వ్యవసాయ రంగంలో తాజాగా చేపట్టిన సంస్కరణలు ఎప్పుడో సాకారం కావాల్సినవిగా అభిప్రాయపడింది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ, ఆర్థిక వ్యవస్థను క్రమంగా తెరవడం అన్నవి దేశ ఆర్థిక రికవరీకి తోడ్పడ్డాయంటూ కేంద్ర ఆర్థిక శాఖ తన నివేదికలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment