మన ప్రధాన ఆర్థిక వేత్తలు పాశ్చాత్య దేశాల్లోని ఉత్తమ విధానాలను కాపీ కొట్టి సత్వరం సొంతం చేసుకునేందుకే అలవాటు పడిపోయారు తప్పితే దేశానికి ఏది నిజంగా అవసరమైంది అనే ప్రాథమిక సమాచారాన్ని కనుగొనడానికి ప్రయత్నించలేదు. దేనికైనా సరే విదేశాలకేసి చూడటమే సులభమని భావిస్తూ వచ్చారు. ఆరోగ్యం, విద్య, ఆహారం, వ్యవసాయం వంటి సామాజిక రంగాలపై పెడుతున్న వ్యయాన్ని కుదించాలని పిలుపునిచ్చే వారిదే పైచేయి కావడంతో దేశంలో ప్రైవేటీకరణ తృష్ణ పెరుగుతూ పోయింది. ప్రజారోగ్య మౌలిక వ్యవస్థలో మన వైఫల్యాలను కరోనా సెకండ్ వేవ్ స్పష్టంగా ఎత్తి చూపింది. భారత్ వంటి దేశాలకు ఎలాంటి ఆర్థిక విధానాలు అవసరం అనే అంశంపై ఇప్పుడే పెద్ద ఎత్తున చర్చ జరగాలి.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ ప్రభుత్వ ఆసుపత్రిలో పలువురు రోగులు తమ మడతమంచాలను తామే తెచ్చుకున్నారని, అనేకమంది నేలపై బెడ్ షీట్లు వేసుకుని పడుకున్నారని ఒక జాతీయ పత్రిక నివేదించింది. ఇక పాట్నాలోని రెండు ప్రభుత్వ ఆసుపత్రులలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఈ ఆసుపత్రుల్లో చేరాలంటేనే ప్రజలు తిరస్కరిస్తున్నారని, ఇంట్లోనే ఉండి చికిత్స చేయించుకోవడానికే వీరు ప్రాధాన్యమిస్తున్నారని, దేవుడు కరుణించకపోతే ఇంటిలోనే చావాలని కోరుకుంటున్నారని ఒక ప్రముఖ ఆంగ్ల వెబ్ సైట్ పేర్కొంది.
ఈ రెండు వార్తా నివేదికలు మన గ్రామీణ ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతుల కల్పన ఎంత దిగజారిపోయిందో తేల్చి చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్ ఎంత తీవ్రంగా చొచ్చుకుపోయింది అనే వాస్తవాన్ని ఈ రెండు వార్తా కథనాలు స్పష్టం చేశాయి. గ్రామీణ ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతుల కల్పన ఎంతగా మట్టిగొట్టుకుపోయింది అనే విషయం అర్థమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణను మెరుగుపర్చి ఉంటే ప్రస్తుతం కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం సాపేక్షంగా సులభతరమై ఉండేది. దేశంలో ఎంత దుర్భర పరిస్థితులు నెలకొని ఉన్నాయో చెప్పడానికి పంజాబ్‌లోని అబోహర్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గంలో 68 గ్రామాలకు కలిపి ఒకే ఒక ఆసుపత్రి ఉన్న వైనాన్ని గుర్తించాలి. ఈ ఆసుపత్రిలోనూ ఒక్కటంటే ఒక్క ఆక్సిజన్ పడక లేదు. దేశంలోని ఇతర గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.
వాస్తవానికి, పట్టణ ప్రాంతాల్లో సెకండ్ వేవ్ విరుచుకుపడటానికి ముందుగా, ప్రభుత్వ గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ దాదాపుగా కుప్పగూలిపోయిన స్థితిలో ఉంది. కానీ ఈ పరిస్థితి మనపై పెద్దగా ప్రభావితం చూపదు కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేశాం. గ్రామీణ కుటుంబంలో ఒక వ్యక్తి తీవ్ర అనారోగ్యం పాలైతే ఆ కుటుంబం మొత్తంగా దారిద్య్ర రేఖ దిగువకు పడిపోతుందని అనేక అధ్యయనాలు మనకు చూపించాయి. వైద్య బిల్లులు చెల్లించాలంటే వీరు తరచుగా రుణాలు తీసుకోవలసి ఉంటుంది. దీంతో వారు మరింత అప్పుల ఊబిలోకి కూరుకుపోతారు. వైద్య చికిత్స కోసం గ్రామీణ ప్రాంతాల్లోని జనాభాలో 74 శాతం మంది ప్రైవేట్ రంగంపైనే ఆధారపడుతున్నారు. దీంతో ప్రజారోగ్య సంరక్షణ పేదలకు అందుబాటులో లేకుండా పోయింది.
కోవిడ్–19 మహమ్మారి విరుచుకుపడటంతో నగరాల్లోని ఆసుపత్రులలో ఆక్సిజన్, ఔషధాలు, పడకలు నిండుకున్నాయి. దీంతో రోగుల బంధువులు, స్నేహితులు సహాయం కోసం సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. మన నగరాల్లోనూ ప్రజారోగ్య సంరక్షణ కుప్పగూలిపోవడానికి సిద్ధంగా ఉందని కాస్త ఆలస్యంగానైనా సరే ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఇప్పటికే చాలా ఆసుపత్రుల్లో పడకలు అందుబాటులో లేవు. రోగులను వారి బంధువులు ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి ప్రవేశం కోసం తీసుకెళుతున్న దృశ్యాలు కలవరపెడుతున్నాయి. ఇది నగర మధ్యతరగతిని తీవ్రంగా కంపింపజేస్తోంది. విషాదమేమిటంటే నగరాల్లోని చాలా కుటుంబాలు తమ ప్రియతములను ఇప్పటికో కోల్పోయాయి. మీ ఫేస్‌బుక్ టైమ్‌లైన్‌ని కాస్త తెరిచి చూడండి, ప్రాణాంతక మహమ్మారి బారిన పడి కన్నుమూసిన వారి బంధువులు, స్నేహితులు నివాళి పలుకుతున్న దృశ్యాలు విస్తృతంగా మీకు కనిపిస్తాయి.
సకాలంలో ఆసుపత్రిలో ప్రవేశం దొరికి వైద్య సహాయం అంది ఉంటే అనేకమంది ప్రాణాలు నిలిచేవని ఇప్పుడు ప్రజలు గుర్తిస్తున్నారు. కాబట్టే కరోనా సెకండ్ వేవ్‌లో మరణాల సంఖ్య ఇంతగా పెరగడానికి ఆరోగ్య మౌలిక వసతులు తగినంత లేకపోవడమే కారణమని అర్థమవుతోంది. కానీ మనం ఒక విషయంలో స్పష్టతతో ఉండాలి. మనం వ్యవస్థను తప్పుపట్టే ముందు.. ప్రజారోగ్య వ్యవస్థను ప్రైవేటీకరిస్తున్నప్పుడు మనందరం మూగ ప్రేక్షకుల్లా నిలబడి చూస్తుండిపోవడం వాస్తవం కాదా? బడ్జెట్‌లో ఆరోగ్యం, విద్య, వ్యవసాయంపై ప్రభుత్వ పెట్టుబడులపై తీవ్రంగా కోత విధించేవైపుగా ప్రభుత్వ విధానం కొట్టుకుపోతున్నప్పుడు జాతీయ స్రవంతి ఆర్థికవేత్తలను, మీడియాను ప్రశ్నించడంలో మనం విఫలం కాలేదా? మారిన ప్రభుత్వ విధానం మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనే ఆలోచన మన మనస్సుల్లో ఉంది కాబట్టే నిమ్మళంగా ఉండిపోయాం.
మన చుట్టూ మృత్యుదేవత తాండవిస్తున్న దృశ్యాలైనా మనలను మేల్కొల్పుతాయా అంటే హామీ ఇవ్వలేను. కానీ ట్విట్టర్‌లో ఎవరో ప్రభుత్వ ఆసుపత్రులు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని నివేదించారు కూడా. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ప్రజారోగ్య వ్యవస్థతో ప్రభుత్వం ఎలా చెలగాటమాడుతూ వచ్చిందో ఇది తేల్చి చెప్పింది. ఆ తర్వాత నీతి ఆయోగ్ సైతం జిల్లా ఆసుపత్రులను ప్రైవేటీకరించాలని, పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం నమూనాలోకి వీటిని తీసుకురావాలని సూచించింది. దేశంలోని అగ్రశ్రేణి ఆసుపత్రులు వైద్య పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నప్పుడు ఎంతమంది విధాన నిర్ణేతలు, మీడియా వ్యక్తులు, కార్పొరేట్ బడా సంస్థలు అభినందనలు తెలియజేశాయో మర్చిపోవద్దు. పైగా ద్రవ్యలోటును పరిమితుల్లో పెట్టడానికి సామాజిక రంగంపై పెడుతున్న పెట్టుబడులపై కోత విధించాలని కొందరు సుప్రసిద్ధ ఆర్థిక వేత్తలు కూడా సెలవిచ్చారని మనం మర్చిపోరాదు. నిజానికి, పార్లమెంటులో జరిగిన ప్రతి బడ్జెట్ సమావేశమూ ద్రవ్యలోటుపైనే కన్నేసి ఉంచిందని మర్చిపోకూడదు.
గత సంవత్సరం అంటే 2020లో నీతి ఆయోగ్ మళ్లీ 250 పేజీల విధాన పత్రంతో ముందుకొచ్చింది. కొత్తగా నెలకొల్పనున్న లేదా ఇప్పటికే కొనసాగుతున్న ప్రైవేట్ వైద్య కళాశాలలను పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా జిల్లా ఆసుపత్రులతో అనుసంధానం చేసే పథకాలను తీసుకురావాలని ఈ పత్రం పేర్కొంది. విదేశాల్లోని ఉత్తమ విధానాలకు అనుగుణంగా ప్రభుత్వ ఆరోగ్య మౌలికవసతుల రంగాన్ని ఎలా ప్రైవేటీకరించాలో తెలిపే మార్గదర్శినిని కూడా నీతి ఆయోగ్ పేర్కొంది. పైగా, కొద్దిమంది ఆరోగ్య కార్యకర్తలు మినహా దేశంలోని ప్రతి ఒక్కరూ వీటిపట్ల కూడా మౌనం వహించారు.
ఇదే నిజమైన సమస్య. మన ప్రధాన ఆర్థిక వేత్తలు పాశ్చాత్య దేశాల్లోని ఉత్తమ విధానాలను కాపీ కొట్టి సత్వరం సొంతం చేసుకునేందుకో అలవాటు పడిపోయారు తప్పితే దేశానికి ఏది నిజంగా అవసరమైంది అనే ప్రాథమిక సమాచారాన్ని కనుగొనడానికి వీరు ఏమాత్రం ప్రయత్నించలేదు. దేనికైనా సరే విదేశాలకేసి చూడమే సులభమని వీరు భావిస్తూ వచ్చారు. కానీ ప్రపంచంలోని అత్యంత సమర్థవంతమైనదిగా రేటింగ్ ఉంటున్న బ్రిటన్ లోని పబ్లిక్ సెక్టర్ నేషనల్ హెల్త్ సర్వీస్‌పై వీరు ఎందుకు చూపు సారించరు అని నాకు ఆశ్చర్యమేస్తుంది. ఏదేమైనప్పటికీ ఆరోగ్యం, విద్య, ఆహారం, వ్యవసాయం వంటి సామాజిక రంగాలపై పెడుతున్న వ్యయాన్ని కోసిపడేయాలని పిలుపునిచ్చే ఆర్థిక వేత్తలదే పైచేయి కావడంతో దేశంలో ప్రైవేటీకరణ తృష్ణ పెరుగుతూనే పోయింది.
ప్రజారోగ్యానికి డబ్బు తక్కువగా ఉన్నట్లయితే, ఆరోగ్య మౌలిక వ్యవస్థను ఎలా ముందుకు తీసుకుపోగలం? అంతర్జాతీయ సంస్థలు చెప్పిందానికల్లా గుడ్డిగా తలూపుకుంటూ పోదామా? క్రెడిట్ రేటింగ్ సంస్థల ఆదేశాలను మనమెందుకు పాటించాలి? విషాదకరమేమంటే ద్రవ్యలోటును తగ్గించడం అనే మందునే మన కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తూ పోతున్నాయి. మన వైఫల్యాలను కరోనా సెకండ్ వేవ్ స్పష్టంగా ఎత్తి చూపింది. భారత్ వంటి దేశాలకు ఎలాంటి ఆర్థిక విధానాలు అవసరం అనే అంశంపై ఇప్పుడే పెద్ద ఎత్తున చర్చ జరగాలి. ప్రాణాంతక సెకండ్ వేవ్ మనల్ని పునరాలోచనలో పడవేస్తుందని, మన ఆర్థిక విధానాలపై విధాన నిర్ణేతలు పునరాలోచించి ఆత్మనిర్భర్ భారత్ సవాళ్లను ఎదుర్కోగలరని ఆశిద్దాం.
దేవీందర్ శర్మ
వ్యాసకర్త ఆహారం, వ్యవసాయరంగ నిపుణులు
ఈ–మెయిల్ : hunger55@gmail.com
Comments
Please login to add a commentAdd a comment