ఓటు వేసే కోట్లాదిమంది ప్రజలకు తాము ఓటు వేసే ప్రతినిధుల పట్ల నూటికి నూరు శాతం విశ్వాసంలేదు. ఓటు వేసి గెలిపించిన తర్వాత ప్రజాప్రతినిధుల వ్యవహారశైలి అసంతృప్తినే మిగులుస్తున్నది. గడచిన లోక్‌సభ 2014లో వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు పారిశ్రామిక వేత్తల సంఖ్య 20 శాతానికి పెరిగింది. అంటే దాదాపు వంద మందికి పైగా పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తులు ప్రజాప్రతినిధులుగా పార్లమెంటులోకి అడుగుపెట్టారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఎక్కువ భాగం పారిశ్రామిక వేత్తలకూ, పెట్టుబడిదారులకూ లబ్ధి చేకూర్చేవిగా ఉన్నాయి. దీనివల్ల పేదలు, సామాన్య ప్రజలు ప్రభుత్వాల దృష్టి నుంచి జారిపోయారు.
‘‘ప్రజలతో నిత్యం సంబంధాలు కలిగి ఉండడం, ప్రజల అభిప్రాయాలకు అమిత మైన గౌరవం ఇవ్వడం, వాళ్ళ తలలో నాలుకలాగా మెలగడం, ప్రజలు సాగించే కార్యకలాపాలకు అండదండగా నిలబడడం, ప్రజల కోసం ఎటువంటి త్యాగానికైనా వెనుదీయకపోవడం నిజమైన ప్రజాప్రతినిధికి ఉండాల్సిన లక్షణాలలో కొన్ని ప్రధానమైన అంశాలు. అయితే అవి మాత్రమే సరిపోవు. ప్రజల క్షేమం, సంక్షేమం, ప్రగతితో పాటు, ప్రజలకు ఏమి కావాలో, దేశానికీ, సమాజానికీ ఏది అవసరమో, ఏది కాదో నిర్ణయించుకోగలిగే వివేచన, విచక్షణా జ్ఞానం ప్రజాప్రతినిధికి ఉండాల్సిన గుణాలలో అత్యుత్తమమైనది’’ అంటూ 1774 నవంబర్, 3న గ్రేట్ బ్రిటన్‌లోని బిస్టల్‌లో ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త, రాజనీతిజ్ఞుడు ఎడ్మండ్ బర్క్ చేసిన ప్రసంగంలోని మాటలివి. ఆనాడు అక్కడి పౌరులతో మాట్లాడుతూ, ప్రజలు ఏది చెబితే అదే వేదమని కూడా నమ్మకూడదనీ, వాళ్ళు చెప్పిన దాంట్లో మంచీ, చెడులను బేరీజు వేసుకోగలిగే శక్తి ఉండాలనీ, ప్రజలు ఆశించిన దానితో పాటు, వాళ్ళకు ఏది అవసరమో తెలుసుకొని, ప్రజలను ఒప్పించగలిగే మేధో శక్తి ప్రజాప్రతినిధులకు అవసరమని కూడా ఎడ్మండ్ బర్క్ స్పష్టం చేశారు. ఎడ్మండ్ బర్క్ పద్ధెనిమిదవ శతాబ్దంలో రాజకీయ పరిణామాలను విశ్లేషించిన గొప్ప రాజనీతిశాస్త్రవేత్త. బాబాసాహెబ్ అంబేడ్కర్ లాంటి వాళ్ళు చాలా మంది ఎడ్మండ్ బర్క్ రచనల నుంచి ఎంతో స్ఫూర్తిని పొందారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ రాసిన ‘కుల నిర్మూలన’ పుస్తకంలో ఎడ్మండ్ బర్క్ వ్యాఖ్యానాలను ఉటంకించడం విశేషం.
అయితే ప్రస్తుతం ఎడ్మండ్ బర్క్ ప్రస్తావన ఎందుకనే ప్రశ్న రాకమానదు. భారత దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు జరిగే ఈ ఎన్నికల్లో 543 మంది లోక్‌సభ సభ్యులను మన ప్రతినిధులుగా ఎన్నుకోబోతున్నాం. అయితే ఓటు వేసే కోట్లాదిమంది ప్రజలకు తాము ఓటు వేసే ప్రతినిధుల పట్ల నూటికి నూరు శాతం విశ్వాసంలేదు. చాలాసార్లు అయిష్టంగానో, ఏం చేయాలో తోచని నిర్లిప్తతల మధ్య ఓట్లు వేయకతప్పని పరిస్థితుల్లో కూడా ఓట్లు వేస్తున్నారు. ఓటు వేసి గెలిపించిన తర్వాత ప్రజాప్రతినిధుల వ్యవహారశైలి అసంతృప్తినే మిగులుస్తున్నది. ఇటీవల కాలంలో ఇది మరింత పెరిగింది. అసంతృప్తినీ, అశాంతినీ మిగిల్చిన పరిస్థితులను సహిస్తూ ప్రజలు ఎల్లకాలం అట్లాగే ఉంటారని భావించకూడదు. ప్రజలు తమ అవసరాలకు తగ్గట్టుగా ఉండగలిగే వ్యవస్థను సృష్టించుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. శాంతియు తంగా, సాయుధంగా సాగిన ఎన్నో ఉద్యమాలు, విప్లవాలు ప్రజల ఆశలనూ, ఆకాంక్షలనూ నెరవేర్చుకునే మార్గాలయ్యాయి. పరిస్థితులు మారుతున్న కొద్దీ కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.
అందుకే ఈ సందర్భంలో జరుగుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి, అందులో పాత్రధారులైన ప్రజాప్రతినిధులు, ఓటర్ల గురించి కొంత చర్చించుకోవడం అవసరమనిపిస్తోంది. ఆనాటి జనపదాల ఆదిమ ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి, నేటి ప్రజాస్వామ్య వ్యవస్థల దాకా భారత దేశం ఎన్నో అనుభవాలను చవిచూసింది. మరెన్నో పాఠాలను, గుణపాఠాలను నేర్చుకున్నది. విదేశీ పాలకులు, స్వదేశీ రాజులు సాగించిన రాచరిక పాలనను కూడా భారత దేశం రుచిచూసింది. పదిహేడవ శతాబ్దం నుంచి బ్రిటిష్ పాలకులు సాగించిన పాలన కూడా భారత దేశానికి ఎన్నో విషయాలను నేర్పిం చింది. అందుకే 1947వ సంవత్సరంలో బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి స్వాతంత్య్రం పొందిన తర్వాత ఎటువంటి పాలనావ్యవస్థ ఉండాలనే అంశం మీద సుదీర్ఘమైనా, లోతైన చర్చ జరిగింది. అన్ని రకాల వ్యవస్థలనూ పరిశీలించిన అనంతరం భారత దేశానికి ప్రజాస్వామ్య వ్యవస్థ అవసరమని భావించారు. అందులో కూడా ఆమెరికాలో లాగా, అధ్యక్ష తరహా పాలన కావాలా? బ్రిటన్‌లో లాగా పార్లమెంటరీ వ్యవస్థ కావాలా? అనే అంశంపై రాజ్యాంగసభలో పెద్దలు సుదీర్ఘంగా చర్చిం చారు. అయితే చాలా మంది పార్లమెంటరీ వ్యవస్థవైపే మొగ్గుచూపారు. అధ్యక్షతరహా పాలన నియంతృత్వ విధానాలకు దారితీస్తుందని అభిప్రాయపడ్డారు.
పార్లమెంటరీ వ్యవస్థలో అటువంటి చెడు పరిణామాలకు తావుండదని భావించారు. పార్లమెంటరీ వ్యవస్థ నిజమైన ప్రజల భాగస్వామ్యానికీ, ప్రజాస్వామ్య స్ఫూర్తికీ బాటలు వేస్తుందని రాజ్యాంగసభ అభిప్రాయపడింది. అయితే అందులో ఇద్దరు పాత్రధారులు. ఒకరు ప్రజాప్రతినిధులు, రెండోవారు ఓటర్లు. అయితే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ గత ఏడు దశాబ్దాలుగా అందించిన అనుభవాలను మనం ఒకసారి మననం చేసుకోవడం అవసరం. ప్రజల భాగస్వామ్యంతో కొనసాగే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే నిర్ణేతలు. భారత రాజ్యాంగంలోని పీఠికలో కూడా ‘భారత ప్రజలమైన మేము’ అని మొదలవుతుంది. అంటే భారతదేశ ప్రజలందరూ ఆమోదించినవిగా భావించాలి. భారత ప్రజలందరి తరఫున కొంత మంది బాధ్యత తీసుకొని మన రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆ తర్వాత అది ప్రజలందరూ ఆమోదించినదిగా మనం భావిస్తున్నాం. అట్లాగే భారత దేశంలో పాలన సాగించాలంటే 120 కోట్ల మంది ప్రజలు ఒక చోట కూర్చొని నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదు. అందుకే నిర్ణీత జనాభా కలిగిన ప్రాంతానికి ఒక ప్రతినిధిని ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు. దానినే ప్రజాప్రాతినిధ్య వ్యవస్థ అంటున్నాం.
అంటే 543 మంది లోక్‌సభ సభ్యులు 120 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధులు. అందుకే వారి మీద చాలా ఎక్కువ బాధ్యత ఉంటుంది. ప్రజల తరఫున వారే ఆయా సభలలో ప్రజల ఆర్థిక, సామాజికాభివృద్ధితోపాటు ప్రజలు ఎదుర్కొంటోన్న అనేక సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇటీవలి పరిణామాలు దానికి భిన్నంగా ఉన్నాయి. ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్న వాళ్ళ స్వభావాన్ని బట్టి చూస్తే ప్రజాస్వామ్యం ఎదుర్కొంటోన్న సంక్షోభం అర్థం అవుతుంది. లోక్‌సభలో వృత్తుల వారీగా సభ్యుల స్వభావాన్ని బట్టి చూస్తే ప్రస్తుత పరిస్థితులు మనకు అర్థం అవుతాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మొదటి లోకసభ నుంచి తొమ్మిదవ లోక్‌సభ వరకు అంటే 1952 నుంచి, 1989 వరకు వ్యాపారస్తులుగా, పారిశ్రామికవేత్తలుగా చెప్పుకోదగిన వాళ్ళెవరూ ఆయా సభల్లో ఉండేవారు కాదు. అట్లా తమను తాము ప్రకటించుకున్న వారు చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. కానీ గడచిన లోక్‌సభ 2014లో వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు పారిశ్రామిక వేత్తల సంఖ్య 20 శాతానికి పెరిగింది. అంటే దాదాపు వంద మందికి పైగా పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తులు ప్రజాప్రతినిధులుగా పార్లమెంటులోకి అడుగుపెట్టారు. అయితే పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తులెవరైనా పౌరులే కదా? వారికి మాత్రం పోటీచేసే హక్కులేదా? అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు.
అయితే దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇటీవలి కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఎక్కువ భాగం పారిశ్రామిక వేత్తలకూ, పెట్టుబడిదారులకూ లబ్ధి చేకూర్చేవిగా ఉన్నాయి. దీనివల్ల పేదలు, సామాన్య ప్రజలు ప్రభుత్వాల దృష్టి నుంచి జారిపోయారు. అటవీ ప్రాంతాల్లో సహజవనరులను, ఖనిజాలను కొన్ని కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నాలు జరిగాయి. జరుగుతున్నాయి. అంతే కాకుండా, ప్రభుత్వ రంగంలో లాభాలతో నడిచే పరిశ్రమలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పుతున్నారు. ప్రభుత్వ సంస్థలు నిర్వహించే ఉత్పత్తులను, పరిశ్రమ కార్యకలాపాలు కొద్ది మంది పారిశ్రామికవేత్తలకు అప్పజెప్పుతున్నారు. ఇది పూర్తిగా దేశంలో ఆర్థిక వ్యత్యాసాలను పెంచే ప్రక్రియగా సాగుతున్నది. ఎన్నడూ లేనంతగా ప్రజాధనం కొద్ది మంది చేతుల్లోకి చేరిపోతోంది. అంతేకాకుండా, పారిశ్రామక వేత్తలు, వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు ధనవంతులు తమ వ్యాపార ప్రయోజనాల కోసం గతంలో ఎన్నడూలేని విధంగా వందల కోట్ల రూపాయలను ఎన్నికల్లో వెదజల్లుతున్నారు. ఆ విధంగా ప్రజలను ఒకరకంగా ఓట్లు అమ్ముకునే అవినీతిపరులుగా తయారుచేస్తున్నారు. ఓట్లు కొనడానికి మాత్రమే కాదు, సభలకు జనాన్ని సమీకరించడానికి కూడా డబ్బులు గుమ్మరిస్తున్నారు. దీనివల్ల ఎన్నికల ప్రక్రియ పూర్తిగా అవినీతిమయమైపోయింది.
అందుకే లోక్‌సభలు, శాసనసభలు ఈ రోజు డబ్బున్న వాళ్ళకు దాసోహమైపోయాయి. అయితే ఇక్కడే రెండవ పాత్ర పోషించే ఓటర్లు ఇప్పటికైనా తమ బాధ్యతను గుర్తెరగాలి. ఓటు వేసే వరకే ప్రజాస్వామ్యమనే భావన మనందరిలో ఉంది. నిజమే అది ముఖ్యమే. కానీ ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న వేల, లక్షల కోట్ల బడ్జెట్ నిధులు ఏమైపోతున్నాయనే విషయంలో ఎవరికీ పట్టింపులేదు. ఒకనాటి ప్రధాని రాజీవ్‌గాంధీ చెప్పినట్టు ప్రభుత్వం అభివృద్ధి పేరుతో చేస్తున్న ఖర్చులో కేవలం 18 శాతం మాత్రమే ప్రజలకు చేరుతుందనే అభిప్రాయం ఈనాటికీ నిజం. అందుకే ప్రజాధనమైన బడ్జెట్ నిధులు సక్ర మంగా అమలు జరిగే నిఘా వ్యవస్థ ప్రజల నుంచి ఉద్భవించాలి. అప్పుడు పారిశ్రామిక వేత్తలకు, కాంట్రాక్టర్ల ఇండ్లల్లోకి ధనప్రవాహం ఆగిపోతుంది. అప్పుడు ప్రభుత్వంలోకి రావడానికి వారు ఇష్టపడరు. దానితో నిజమైన ప్రజాసేవ చేసే ప్రజానాయకులు ప్రజల నుంచే పుట్టుకొస్తారు. అటువంటి ప్రయత్నం ఎప్పుడైనా ప్రారంభం కావచ్చు. తాత్కాలికంగా చరిత్ర గతిని మరల్చగలరేమో, చరిత్ర పరిణామక్రమంలో మార్పు అనివార్యం, ఆ మార్పుని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదన్నది కూడా అనేక సార్లు రుజువవుతూ వచ్చింది.
మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077
Comments
Please login to add a commentAdd a comment