భారత పౌరసత్వ సవరణ చట్టం బహు గొప్ప విషయంగా భావిస్తున్న నాయకులు, మేధావులు తమ దేశంలో తమ పౌరులపై సమాజం చేస్తోన్న దురాగతాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లో హిందువులపై జరుగుతున్న హింస, వివక్షను పట్టించుకోవడం తప్పు కాదు. కానీ నీ పౌరులు,నీ దేశం బిడ్డలు, నీకు ఓట్లు వేసి గెలిపించిన నీ ఓటర్లు వేలాదిగా కుల హింసకు రాలిపోతుంటే, దేశంలో జరుగుతున్న అరాచకాలను చూసీచూడనట్లు నటిస్తూ, పరోక్షంగా వాటిని ప్రోత్సహిస్తున్నట్టు కాక మరేమిటి? ఈ స్థాయిలో దళితులపైనా, మైనారిటీలపైనా జరుగుతున్న హింస వారిని ఏ తీరాలకు నెడుతోంది? కొత్తగా పౌరసత్వం ఇవ్వడం అటుంచి, ఈ గడ్డమీద పుట్టి ఈ గడ్డమీదే పెరిగిన ఎందరో బిడ్డలు క్షణక్షణం ప్రాణభయంతో భీతిల్లుతోన్న స్థితిలో వీరంతా ఎక్కడ తలదాచుకోవాలి?
‘‘ఒక వ్యక్తి స్వేచ్ఛను కోల్పోతే, మొత్తం సమాజం సర్వస్వం కోల్పోతుంది. ఒక వ్యక్తి స్వాతంత్య్రాన్ని నిరాకరిస్తే సమాజం నిర్మాణం జరగదు. ఇది సమాజానికీ, మనిషికీ ఉన్న వైరుధ్యం. ఒక వ్యక్తి తన శక్తి సామ ర్థ్యాలను ప్రదర్శించడానికి సంపూర్ణ స్వేచ్ఛకావాలి. వ్యక్తిగత స్వేచ్ఛ, సమాజం స్వాతంత్య్రం రెండూ పరస్పర ఆధారితాలు.’’ మహాత్మా గాంధీ వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్య్రాల గురించి చేసిన వ్యాఖ్యానమిది. ప్రభుత్వాలకైనా, సమాజానికైనా, సమూహాలకైనా, వ్యక్తులకైనా ఈ మాటలు శిరోధార్యాలు కావాలి. అయితే గత కొంతకాలంగా భారత దేశంలో జరుగుతున్న పరిణామాలు ఇటువంటి వాతావరణాన్ని కల్పించకపోగా, మరింత ఆందోళనకర పరిస్థితులను సృష్టిస్తున్నాయి. భారతదేశంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఆమోదం పొందిన తర్వాత ప్రజల్లో పెరిగిన అశాంతిని ప్రభుత్వాలు లక్ష్యపెట్టడంలేదు. పైగా ఈ చట్టాన్ని ఒక చారిత్రక సంఘటనగా అభివర్ణిస్తున్నారు. పైగా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తోన్న వాళ్ళందరినీ దేశద్రోహులుగా ముద్ర వేస్తున్న పరిస్థితి భిన్నాభిప్రాయాలను సహించలేని తత్వాన్ని బయట పెడుతోంది. పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో హింసకు గురై నిరాశ్రయులైన ప్రజలకు ఆశ్రయం కల్పించి, వారికి పౌరసత్వం ఇవ్వడమే ఈ చట్టం ఉద్దేశ్యమని వాదిస్తున్నారు. అయితే దీన్ని వ్యతిరేకిస్తోన్నవారిని మానవత్వం లేని మనుషులుగా చిత్రీకరిస్తున్న పరిస్థితి ఆందోళనకు గురిచేస్తోంది.
ఆయా దేశాల్లో ముస్లిమేతరులపై, ప్రత్యేకించి హిందువుల పట్ల వివక్ష పెరిగినమాట వాస్తవమే, వారిపై దాడులూ నిజమే. ఎవరైతే అక్కడి నుంచి పారిపోయి వచ్చారో వారిని ఆదుకోవడం మానవ త్వమే. అయితే ఆ పని మనదేశం ఒక్కటే చేయడం లేదు. చాలా యూరప్ దేశాలు ఇతర దేశాల నుంచి రక్షణ కోసం వలసవచ్చిన వారిని ఆదుకుంటున్నాయి. శరణార్థులుగా వారికి అండగా నిలుస్తు న్నాయి. కానీ మన దేశంలో మతప్రాతిపదిక మీద జరుగుతున్న ఈ ప్రక్రియ కొంత అనుమానాస్పదంగా ఉంది. పొరుగుదేశాల్లో హిందు వులపై జరుగుతున్న దాడులను చాలా దయార్ద్ర హృదయంతో అర్థం చేసుకొని ఈ కార్యక్రమాన్ని రూపొందించామంటున్నారు కానీ.. తాము పాలిస్తున్న గడ్డమీద జరుగుతోన్న భయానకమైన దాడుల విష యంలో ఇప్పటి వరకు ప్రభుత్వం పెదవి విప్పి ఒక్కమాట కూడా మాట్లాడినట్టు కనపడకపోవడానికి కారణం ఎప్పుడైనా ఆలోచిం చారా? దీన్నెవరైనా ప్రశ్నిస్తే వారిని దేశ ద్రోహులుగానూ, సమాజ విద్రోహులుగానూ పేర్కొంటోన్న పరిస్థితి. ఇటీవల జెఎన్‌యూ పరిణామాలు అందుకు ఒక ఉదాహరణ మాత్రమే. పొరుగు దేశాల్లో హిందువులపై జరుగుతున్న దాడులతో పోలిస్తే దేశంలోని దళితులపై జరుగుతున్న దాడులు ఏవీ తక్కువ కాదన్న విషయాన్ని గ్రహించాలి.
మనదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 72 ఏళ్ళు దాటాయి. ఇంత కాలం తర్వాత కూడా దళితులపైనా, అణగారిన వర్గాలపైనా జరుగు తున్న అత్యాచారాల లెక్కలను చూస్తూ కూడా మానవత్వం ఉన్న పెద్దలకు ఎందుకు మనసు చలించడం లేదో అర్థం కాదు. ఈ దేశంలో అంటరాని కులాలకు తమ సామాజిక వర్గాన్ని ఏ పేరున పిలవాలో నిర్ణయించుకునే హక్కు లేదు. దళిత అనే పదాన్ని సైతం వాడరా దంటూ నిషేధం విధించారు. ఈ గడ్డమీద పుట్టి, ఈ మట్టిలో పెరిగిన అదే సామాజిక వర్గాలకు గానీ, లేదా ఇతర మతస్తులకు గానీ తమకు నచ్చిన ఆహారం తీసుకునే కనీస హక్కులేదు. పిలిచే పేరునీ, తినే తిండినీ ఒక సామాజిక వర్గం శాసించే స్థితి ఈ వ్యవస్థ వాస్తవికతకు దర్పణంగా నిలుస్తుంది. 1950 నుంచి 1994 వరకు ప్రత్యేకంగా దళితుల మీద జరిగిన అత్యాచారాల లెక్కలను జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) డాక్యుమెంట్లలో పొందపరచలేదు. అయితే 1994 నుంచి 2018 వరకు అందుబాటులో ఉన్న లెక్కలను పరిశీలిస్తేనే హృదయమున్న ప్రతిమనిషీ చలించక తప్పదు. 1994 నుంచి 2018 వరకు కేవలం 24 ఏళ్లలో 16 వేల ఏడు మంది హత్యకు గుర య్యారు. 37,596 మంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. ఆధిపత్య కులాల దాడుల్లో 82,335 మంది తీవ్రగాయాల పాల య్యారు. ఇందులో ఎంతో మంది అంగవికలులయ్యారు.
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో జరుగుతున్న అభివృద్ధి మనిషిని మానవత్వం వైపు నడిపిస్తుందని భావించడం తప్పేమీ కాదు. అది భారతదేశంలో పూర్తిగా అబద్ధమని తేలిపోయింది. ప్రతియేటా హత్యలు, అత్యాచారాలు, దాడుల సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గు తున్న దాఖలాల్లేవు. కుల విద్వేషం ప్రత్యేకించి అంటరాని కులాల పట్ల ఉన్న ద్వేషం ఈ దాడులకు కారణంగా భావించక తప్పదు. 1994లో 546 మంది దళితులు హత్యకు గురైతే, 2004లో అది 654కి చేరింది. 2014 వచ్చేసరికి 704 మంది దళితులు హత్యకు గుర య్యారు. భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హత్యల సంఖ్య మరింత పెరిగింది. 2018 లెక్కల ప్రకారం 798 మంది కుల హింసకు బలయ్యారు. అదేవిధంగా 1994లో 992 మంది దళిత మహిళలపై కులోన్మాద అత్యాచారాలు జరిగితే, 2004 వచ్చేసరికి 1157 మందికి ఆ సంఖ్య చేరింది. 2014లో 2233 మంది దళిత మహిళలు అత్యాచారాలకు, హింసకు బలయ్యారు. భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంఖ్య తారాస్థాయికి చేరింది. 2015లో 2326, 2016లో 2541, 2017లో 2714, 2018లో 2936 మంది దళిత మహిళలపై అత్యాచారాలు జరిగాయి. మొత్తం ఈ 24 ఏళ్ళలో ఎనిమిది లక్షల 24వేల 652 కేసులు నమోదయ్యాయి. 1994లో 33,908 కేసులు నమోదుకాగా, 2018లో 42793 కేసులు రిజిస్టర్ అయ్యాయి. కానీ శిక్షలు పడింది మాత్రం అత్యల్పం. 2017– 18 హోంమంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం కేవలం 16.3 శాతం శిక్షలు పడినట్టు నమోదైంది. చాలా కేసుల్లో కింది స్థాయి న్యాయస్థానాలు విధించిన శిక్షలను హైకోర్టులు, సుప్రీంకోర్టులు కొట్టివేసి, నిందితు లను నిర్దోషులుగా వదిలిపెడుతున్నాయి. ఇక్కడ కుల పక్షపాతమే ప్రధానంగా కనిపిస్తున్నది.
సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన చుండూరు కేసు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఎంతో సంచలనం సృష్టించిన ఆ కేసులో ముద్దాయి లందరూ నిర్దోషులుగా హైకోర్టు తీర్పు చెప్పడం ఎంతో బాధను, ఆవేదనను కలిగించింది. 1994కు ముందు జరిగిన కొన్నివేల సంఘటనలకు సంబంధించి ప్రభుత్వాలు లెక్కలు చూపడం లేదు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలులోకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ సంఘటనలను ప్రత్యేకంగా చూపెట్టారు. మొత్తం ఏడు దశాబ్దాల భారత రాజ్యాంగం అమలులో 45 సంవత్సరాల పాటు దళితులపై జరిగిన అత్యాచారాల లెక్కలే నమోదుకాలేదు. సరాసరి లెక్కలను కనుక చూస్తే ప్రతి సంవత్సరం కనీసం 500 మంది దళితులు హత్యకు గురైతే, ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 23 వేలకు చేరుకుంది. అంటే, ఇప్పటి వరకు 40 వేల మంది దళితులు కుల హింసకు, అంటరానితనమనే దుర్మార్గానికీ బలయ్యారు. అదే విధంగా 45 సంవత్సరాలలో అత్యాచారాలకు బలైన మహిళల సంఖ్య ఇంకొక 40 వేలకు కలిపితే 60 వేలకుపైగా మహిళలు అత్యాచారాలకు బలయ్యారు. ఈ స్థాయిలో హింస జరిగినా కూడా ఇక్కడున్న పాల కులకు దీనిని నివారించాలని గానీ, నిర్మూలించాలనిగానీ అనిపించ కపోవడం, కులతత్వం అనుకోవాలా? మానవత్వం అనుకోవాలా?
భారత పౌరసత్వ సవరణ చట్టం బహు గొప్ప విషయంగా భావిస్తున్న నాయకులు, మేధావులు తమ దేశంలో తమ పౌరులపై సమాజం చేస్తోన్న దురాగతాల గురించి ఆలోచించాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లో హిందువులపై జరుగుతున్న హింస, వివక్షను పట్టించుకోవడం తప్పుకాదు. కానీ నీ పౌరులు, నీ దేశం బిడ్డలు, నీకు ఓట్లు వేసి గెలిపించిన నీ ఓటర్లు వేలాదిగా కుల హింసకు రాలిపోతుంటే, దేశంలో జరుగుతున్న అరాచకాలను చూసీచూడనట్లు నటిస్తూ, పరోక్షంగా వాటిని ప్రోత్సహిస్తున్నట్టు కాక మరేమిటి? నీ దేశం పట్ల ఇంత నిర్లక్ష్యం ఏ మానవత్వా నికి, ఏ రాజనీతిజ్ఞతకు అద్దం పడుతుందో అంతుపట్టదు. ఈ స్థాయిలో దళితులపైనా, మైనారిటీల పైనా జరుగుతున్న హింస వారిని ఏ తీరాలకు నెడుతోంది? కొత్తగా పౌరసత్వం ఇవ్వడం అటుంచి, ఈ గడ్డమీద పుట్టి ఈ గడ్డమీదే పెరిగిన ఎందరో బిడ్డలు క్షణక్షణం ప్రాణభయంతో భీతిల్లుతోన్న స్థితిలో వీరంతా ఎక్కడ తలదాచుకోవాలి? ఎక్కడికి పారిపోవాలి? ఏ దేశంలో తమ చిరునామాని వెతుక్కోవాలి? ఎవరి శరణుకోరాలి? ఇదే ఇప్పుడు ఈ దేశపాలకులు నిర్లక్ష్యం చేయకూడని తక్షణ సమస్య. ఇప్పటికైనా ఈ విషయాల్లో ప్రభుత్వాలు, వ్యక్తులు, సంఘాలు, సంస్థలు సమూహాలు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది.
మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077
Comments
Please login to add a commentAdd a comment