విశ్లేషణ
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), 2019కి జవసత్వాలు అందించే 39 పేజీల నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర పాలనా యంత్రాంగం ఓటర్లను విభజించాలని చూస్తోందంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్న తరుణంలో లోక్‌సభ ఎన్నికలకు కొన్ని వారాల ముందుగా చోటు చేసుకున్న ఈ పరిణామం వివాదాన్ని రేకెత్తించింది. కాగా, మరో ఎన్నికల హామీని తాను నెరవేర్చినట్లు బీజేపీ చెప్పుకొంది. పౌరసత్వాన్ని హరించడానికే సీఏఏని ఉపయోగిస్తారనే భయాలు కేవలం నిరాధారమైనవని తిప్పికొట్టింది.
అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో హింసాత్మక చర్యల కారణంగా పారిపోయి భారతదేశంలో అక్రమంగా లేదా అనధికారికంగా స్థిరపడిన ఆరు మతా లకు చెందిన మైనారిటీలకు పౌరసత్వం అందించడం ఈ చట్టం ప్రధాన లక్ష్యం. ఈ ఆరు మత బృందాలు ఆ దేశాలకు చెందిన హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, పార్సీలు, జైనులు. ఆ దేశాలకు చెందిన ముస్లింలను సీఏఏ నుంచి మినహాయించారు. ఈ దేశాలకు చెందిన ముస్లింలను పై చట్టం నుంచి మినహాయించడానికి హేతువు ఏమిటంటే... ఆ మూడు దేశాలూ ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ఇస్లామిక్ దేశాలు. కాబట్టి వారు తమతమ దేశాలలో తగు న్యాయం పొందగలరని ఇది సూచిస్తుంది.
దరఖాస్తులను పర్యవేక్షించడానికి కేంద్ర అధికా రులతో కూడిన కమిటీలను రూపొందించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియపై నియంత్రణను కలిగి ఉంది. పాత విధానంలో జిల్లా అధికారులే అభ్యర్థ నలను స్వీకరించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశం ప్రకారం పౌరసత్వం కోసం దరఖాస్తు చేసు కోవడంలో నిరీక్షణ వ్యవధిని, సీఏఏ 11 నుండి ఐదు సంవత్సరాలకు తగ్గిస్తుంది. అయితే దరఖాస్తుదా రులు వారి మాతృభూమి నుండి అధికారిక పత్రాలను సమర్పించాలి.
అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాలలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నప్పటికీ, 2019– 20లో భారతదేశం అంతటా ఈ సవరణ చట్టంపై వీచిన తుపానుతో పోలిస్తే ఇవి పెద్దగా సద్దులేనివి గానే కనిపిస్తాయి. అయితే, రాబోయే కొద్ది వారాల్లో అభ్యంతరాలు పెరిగే అవకాశం ఉంది. ఈ అంశంలో మరొక పెద్ద సమస్య దాగి ఉంది.
ముఖ్యంగా రాజ్యాంగబద్ధతను వ్యతిరేకిస్తున్న సీఏఏకి సంబంధించిన అనేక చట్టపరమైన సవాళ్లను సుప్రీంకోర్టు ఇంకా వినలేదు, తీర్పు ఇవ్వలేదు. ఇక్కడ కీలకమైన వాదన ఏమిటంటే, మతాన్ని పౌరసత్వానికి గుర్తుగా ప్రతిష్టించడం ద్వారా, రాజ్యాంగానికి చెందిన ప్రాథమిక స్వరూపాన్నే పౌరసత్వ సవరణ చట్టం ఉల్లంఘిస్తుందన్నదే. అదే సమయంలో భారత రాజ్యాంగం మతపరమైన వివక్షను నిషేధిస్తుంది. చట్టం ముందు ప్రజలందరికీ సమానత్వం, చట్టం ద్వారా సమాన రక్షణకు హామీ ఇస్తుంది.
ఈ చట్టంపై తొలి సవాలు 2020లో వచ్చింది. సుప్రీంకోర్టు ఈ అభ్యంతరాలను ఇంకా వినలేదు. అయితే, ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం, గత ఏడాది డిసెంబర్‌లో పౌరసత్వ చట్టం, 1955లోని సెక్షన్ 6ఏ చెల్లుబాటుకు సంబంధించిన మరో కేసులో తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నిర్దిష్ట సవరణ 1985లో కుదిరిన అస్సాం ఒప్పందం నాటిది.
ఇది బంగ్లాదేశ్ నుండి అక్రమ వలసలకు సంబంధించిన శాశ్వత సవాలుపై రాష్ట్రంలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నించింది. చట్టవిరుద్ధంగా వచ్చిన వారిని భారతీయ పౌరులుగా గుర్తించడానికి ఇది ఒక యంత్రాంగాన్ని అందించింది. అస్సాంలో బంగ్లాదేశ్ వలసదారులకు పౌరసత్వం మంజూరు చేయడానికి 1971 మార్చి 25ని కటాఫ్ తేదీగా నిర్ణయించడమైంది.
పౌరసత్వ సవరణ చట్టం భారతదేశం అంతటా ఒకే విధంగా వర్తించదు. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, ప్రత్యేక రాజ్యాంగ రక్షణ ఉన్న అస్సాం (తక్కువ జనాభాతో), త్రిపురలోని మూడు గిరిజన ప్రాబల్య ప్రాంతాలలో ఈ చట్టం అమలు కాదు.
2019లో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ)ని తీసుకురావడం ద్వారా అస్సాంలో పరిస్థితి క్లిష్టంగా మారింది. 19 లక్షల దరఖాస్తుదారులు దీనికి వెలుపలే ఉండిపోయారు. వీరిలో ఎక్కువమంది హిందువులు, స్థానిక సంఘాల సభ్యులే ఉన్నారు తప్పితే, ముస్లింలు కాదు. ఇది బీజేపీనీ, దాని మిత్ర పక్షాలనూ ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటి నుంచి వారు ఈ చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. అస్సాంలో అక్రమ వలసలకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్యకర్తలు కూడా సీఏఏని వ్యతిరేకించారు. మతం పౌరసత్వాన్ని నిర్ణయించకూడదని వాదించారు.
సహాయాన్ని పొందవలసిన సామాజిక బృందాల జాబితా కూడా అసంపూర్ణంగా కనిపిస్తోంది. ఇందులో శ్రీలంకలోని తమిళ హిందువులు, క్రైస్తవులు వంటి సమూహాలు లేవు. వీరిలో 90,000 మందికి పైగా భారత్‌లో శరణార్థులుగా ఉన్నారు. మయన్మార్ నుండి వచ్చిన చిన్ క్రైస్తవులు కూడా జాబితాలో లేరు. వీరిలో 45,000 మందికి పైగా ఒక్క మిజోరంలోనే ఉన్నారు.
ఒక మతానికి చెందినవారైనప్పటికీ, ఆ మతంలోని మైనారిటీ శాఖలపై వేధింపుల ప్రమాదం తగ్గదు. అయినా పాకిస్తాన్ లోని అహ్మదీయులు, అఫ్గానిస్తాన్‌లోని హజారాలు వంటి బలహీనమైన ముస్లిం సమూహాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం సీఏఏకి కనిపించలేదు.
సంజయ్ హజారికా
వ్యాసకర్త రచయిత, కాలమిస్ట్
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment