కారు చీకట్లలో చైతన్య దీప్తులు | Deep in the dark movings | Sakshi
Sakshi News home page

కారు చీకట్లలో చైతన్య దీప్తులు

Published Thu, Aug 27 2015 12:51 AM | Last Updated on Mon, Oct 8 2018 9:06 PM

కారు చీకట్లలో చైతన్య దీప్తులు - Sakshi

కారు చీకట్లలో చైతన్య దీప్తులు

కొత్త కోణం
కేరళ సమాజం వర్ణ, కుల విభేదాలతో చీలిపోయి, అశాంతితో ఉన్న కాలంలో శ్రీ నారాయణ గురు సాగించిన సాంఘిక సంస్కరణోద్యమం అందరిదీ ఒకటే కులమని, అందరికీ దేవుడు ఒకడేనని చాటింది. గురు స్ఫూర్తితో అంటరాని పరయా కులానికి చెందిన అయ్యంకాళి  కులాధిపత్యానికి, వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. గురు ఉద్యమం విద్య, విజ్ఞానంతో సాగితే, అయ్యంకాళికి ప్రతిఘటన తప్పలేదు. ఈ ఇద్దరు వ్యక్తులు, రెండు ఉద్యమాలు రగిల్చిన చైతన్యమే కేరళలో ప్రగతిశీల, ప్రజాస్వామ్య భావాల వ్యాప్తికి, అభివృద్ధికి పునాదులను వేశాయి.  

గ్రామ పరిపాలనలో, విద్య, వైద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో, మహిళా, శిశు సంక్షేమంలో మనం మొదటగా చెప్పుకునే రాష్ట్రం కేరళ. ప్రజాభివృద్ధి ప్రస్థానంలో ఆ రాష్ట్రం యావత్ భారతంలో ప్రప్రథమ స్థానంలో నిలుస్తోం దంటే అందుకు కారణం అక్కడి మట్టి నుంచి పుట్టిన చైతన్యపు కెరటాలే. కేరళ చరిత్రలో 19వ శతాబ్దం చివరి అర్ధభాగం నుంచి 20వ శతాబ్దం మొదటి అర్థభాగం వరకు జరిగిన ఎన్నో సంఘర్షణలు, సంస్కరణలే ఈనాటి ప్రగతికి సోపానాలు. ఈ ప్రయాణంలో ఎన్నో సంస్థలు, వ్యక్తులు, సంఘాలు, ఉద్య మాలు ఉన్నప్పటికీ ఈ రోజు ఇద్దరు వ్యక్తులను, రెండు ఉద్యమాలను మన నం చేసుకోవాల్సి ఉంది. కేరళలో 1855 ఆగస్టు 26న  జన్మించిన శ్రీ నారా యణ గురు, 1863 ఆగస్టు 28న జన్మించిన అయ్యంకాళి ఆ ప్రాంత చరిత్రను తిరగరాశారు. శ్రీ నారాయణ గురు ఉద్యమమే దళిత ఉద్యమ పోరాట యోధుడు అయ్యంకాళికి స్ఫూర్తినిచ్చింది.

వివక్ష, ఆంక్షల చెరసాలలో...
‘‘నేను ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో పర్యటిస్తున్నాను. కేరళకు చెందిన స్వామి నారాయణ గురును మించిన గొప్ప ఆధ్యాత్మికవేత్త నాకు ఎక్కడా తారసపడలేదని నిజాయితీగా ఒప్పుకుంటున్నాను’’ అంటూ రవీంద్రనాథ్ ఠాగూర్ చేసిన వ్యాఖ్యలు నారాయణ గురు ఔన్నత్యాన్ని చాటుతున్నాయి. మహా త్మాగాంధీ హరిజనోద్ధరణ కార్యక్రమం రూపుదిద్దుకోవడానికి ముందే నారాయణ గురును కలిసి మతం, కులం, మతాంతరీకరణ, అంటరానితనం లాంటి అనేక సమస్యలపై మాట్లాడారు. అంటే నారాయణ గురు ప్రభావం మహాత్మాగాంధీ మీద ఉన్నదని అర్థం.

నారాయణ గురు సామాజిక కార్య క్రమంలో ప్రవేశించే నాటికి కేరళలో కులవ్యవస్థ బలంగా ఉండేది. అణచి వేత, వివక్షలు విపరీతంగా సాగుతుండేవి. కులాల అడ్డుగోడలు ప్రజల మధ్య అశాంతికి కారణమయ్యాయి. ఆధిపత్య కులాలకు అదనపు సౌకర్యాలు, హద్దుమీరిన హక్కులు, కింది కులాలకు ఆంక్షలు, అమానుష శిక్షలు అమ లులో ఉండేవి. ఆధిపత్య కులాలుగా సవర్ణుల జాబితాలో నంబూద్రీలు (కేరళ బ్రాహ్మణులు), క్షత్రియులు ఉంటే ఆ తరువాత స్థానంలో శూద్రులుగా పిలిచే నాయర్లు ఉండేవారు. ఈళవ (ఎజవ)లు అవర్ణుల జాబితాలో పైస్థాయిలో ఉండగా, పులయ, పరయ, నాయాదీలు ఇంకా దిగువన అంటరానివారుగా ఉండేవారు. అగ్రవర్ణాలతో నిమ్నకులాలు కలిసినప్పుడు వారు ఎంత దూరం పాటించాలో కూడా నిర్ణయించారు. నంబూద్రీలకు, దేవాలయ గర్భగుడికి క్షత్రియులు కనీసం రెండడుగుల దూరాన్ని పాటించాలి. నాయర్లు 16 అడు గుల దూరం, ఈళవలు 32 అడుగుల దూరం, పులయ, పరయలు 64 అడు గుల దూరం. నాయాదీలనే మరో అంటరాని కులం నంబూద్రీల కనుచూపు మేరలో కూడా కనిపించకూడదు. పొరపాటున ఏ నాయాదీనైనా బ్రాహ్మ ణులు చూస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.


అవర్ణులలోని అంటరానికులాలైన పులయ, పరయ, నాయాదీలపై మరిన్ని తీవ్ర ఆంక్షలుండేవి. ఏ అవర్ణుడైనా నిర్ణీత దూరాన్నిమించి ఒక నంబూద్రికి దగ్గరగా వచ్చినట్లయితే తీవ్ర శిక్షలు ఉండేవి. అవర్ణులను చంపిన ఘటనలు కూడా ఉన్నాయి. నిమ్న కులాలకు గుర్తుగా ఆ కులాల స్త్రీలు ఛాతీ మీద వస్త్రాలు కప్పుకోవడానికి, రవికలు తొడుక్కోవడానికి వీలులేదు. అవరు ్ణలంతా చెప్పులు తొడుక్కోడానికి అనర్హులు. వర్షం పడుతున్నా గొడుగులు వాడకూడదు. మంచి బట్టలు వేసుకోరాదు, నగలు ధరించరాదు. ఆధిపత్య కులాలతో మాట్లాడేటప్పుడు ‘‘తమ బానిసను మాట్లాడుతున్నాను’’ అని మొదలు పెట్టాలి.

‘‘మనుషులందరిదీ ఒకే కులం, ఒకే దేవుడు’’
ఇటువంటి పరిస్థితుల్లో 1855 ఆగస్టు 26న శ్రీ నారాయణ గురు ఈళవ కులం లో పుట్టారు. ఈ కులం అవర్ణులలో ఎగువ స్థాయిలో ఉన్నప్పటికీ వారికి పాఠ శాలల్లో, దేవాలయాల్లో ప్రవేశం ఉండేది కాదు. అయితే ఈ కులంలో కొంద రికి భూములుండేవి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితి ఉండేది. జనాభాలో వీరు 30 శాతం వరకు ఉండేవారు. బంధుమిత్రుల సహకారంతో నారాయణ గురు తల్లిదండ్రులు కుమారునికి విద్యాబుద్ధులు నేర్పించారు. గురు ఆయు ర్వేద వైద్యం, సంస్కృతం, తత్వశాస్త్రం, హిందూ మత గ్రంథాల్లో మంచి పరిజ్ఞానం సంపాదించారు. అయితే ఆయన తను నేర్చుకున్న విద్యను పుల య, పరయ కులాల పిల్లలకు నేర్పడానికి ప్రయత్నిస్తే ఈళవ కులంతోపాటు, తల్లిదండ్రులు కూడా వ్యతిరేకించారు.

దానితో ఇల్లు విడిచిపెట్టి, ఈ వివక్షను పోగొట్టడానికి మార్గాలను అన్వేషించారు. అనేక మంది వ్యక్తులతో, సంస్థ లతో, క్రైస్తవ, ముస్లిం మత పెద్దలతో చర్చలు జరిపారు. అంటరాని కులాల ఇళ్లలో ఉన్నారు. అందరితో సహవాసం చేశారు. చివరకు ముల్లును ముల్లుతోనే తీయాలని... తిరువనం తపురం సమీపంలోని ‘అరువిప్పురం’ అనే గ్రామంలో 1888 శివరాత్రి ఉదయం ఒక శివలింగాన్ని ప్రతిష్టించారు. దేవాలయాల్లోకి ప్రవేశం లేదని ఆవేదన చెందే ప్రజలకు ఇది పెద్ద ఊరటనిచ్చింది. అక్కడే నారాయణ గురు ఒక గురుకులాన్ని, ఒక సంస్కృత పాఠశాలను ప్రారంభించారు. ఆయన అలా కేరళ, తమిళనాడు, కర్ణాటక, శ్రీలంకల్లో అరవై దేవాలయాలను నిర్మించారు.

ప్రతి దేవాలయం గోడల మీద ఉండే ‘‘మనుషులందరిదీ ఒకే కులం, ఒకే దేవుడు’’ ‘‘కులం అడగొద్దు, కులం చెప్పొద్దు, కులం గురించి ఆలోచిం చొద్దు’’ ‘‘మతం ఏదైనా మనిషిని ఎదగ నివ్వాలి’’ అనే నినాదాలు ప్రజలను మేల్కొల్పేవి. అయితే, నారాయణ గురు అనతికాలంలోనే ఆలయాల నిర్మా ణానికి స్వస్తి చెప్పి, నిమ్న కులాల వారి చదువులు, ఆర్థిక పరిస్థితిని మెరు గుపరచడం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ‘‘విద్య ద్వారా స్వేచ్ఛ, సంఘటి తమవడం ద్వారా శక్తి, పరిశ్రమించడం ద్వారా ప్రగతి’’ అనే సూక్తులు కేరళ లోని నిమ్నవర్గాల ప్రజలను, ప్రత్యేకించి ఈళవ కులస్తులను చైతన్య పరి చాయి. ఆయన తన ఉద్యమాన్ని సంఘటితం చేయడానికి డాక్టర్ పల్పు వంటి వాళ్లతో కలిసి ‘శ్రీ నారాయణ గురు ధర్మ పరిపాలనా యోగం’ (ఎస్‌ఎన్‌డీపీ) అనే సంస్థను స్థాపించారు.

కులం ముళ్ల కంచెల్లో రగిలిన చైతన్యం  
మరొక పోరాట యోధుడు అయ్యంకాళి ఇదే కాలంలో కులాధిపత్యానికి, వివ క్షకు వ్యతిరేకంగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆయన తిరువనంతపురా నికి దగ్గరలోని వెంగనూరులో పులయ అంటరాని కులంలో జన్మించారు. ఆయనకు చదువులేదు. కూలిగా పనిచేశాడు. నారాయణ గురు ఉద్యమం విద్య, విజ్ఞానంతో సాగితే, అయ్యంకాళికి ప్రతిఘటనా పోరాటం చేపట్టడం, రక్తం చిందించడం తప్పలేదు. అవర్ణులలోని పైస్థాయి వారైన ఈళవలను కొం త వ్యతిరేకతతోనైనా సమాజం అంగీకరించింది. కానీ అంటరాని పులయ, పరయలను వర్ణ సమాజం, ఆధిపత్య కులాలు గుర్తించడానికి ఇష్టపడలేదు. అందుకే సంఘర్షణ అనివార్యమైంది. రక్తపాతం జరిగింది. సమాజంలో ఎన్ని వైరుధ్యాలున్నా, కులాల మధ్య ఎన్ని విభేదాలున్నా, అంటరాని కులాల విష యానికి వచ్చేసరికి ఇనుప కంచెలు మొలుస్తాయన్న అంబేడ్కర్ మాటలు అక్షరసత్యాలయ్యాయి.
 

పులయలు వీధుల్లో నడవరాదనే ఆంక్షలను అయ్యంకాళి ఎదిరించారు. అనేక మంది యువకులతో నడక పోరాటాన్ని చేపట్టారు. బలరామాపురం లోని చళియార్ బజార్‌కు చేరుకునేసరికి అగ్రవర్ణాల గుంపు ఎదురు నిలి చింది. కోట్లాట మొదలై, ఇరువర్గాల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. దీన్ని కేరళలో దళితుల మొదటి సాయుధ ఘర్షణగా చెప్పుకోవచ్చు. పులయలు సంఘటితమవుతుండటంతో ఆధిపత్య కులాలు దాడులకు దిగాయి. అయ్యం కాళి వాటిని ఎదిరించడానికి ఆత్మరక్షణ దళాలను నిర్మించారు. ఉద్యమాన్ని సంఘటితం చేయడానికి ‘సాధుజన పరిపాలన సంఘం’ స్థాపించారు. దాని తరఫున కొన్ని డిమాండ్లతో ప్రభుత్వానికి దరఖాస్తులను సమర్పించారు. వాటిలో ఒకటైన పాఠశాలల్లో అంటరాని కులాల పిల్లలను చేర్చుకోవడం పట్ల ఆనాటి ట్రావెంకూర్ సంస్థానం దివాను రాజగోపాలాచారి సానుకూలంగా స్పందించి ఉత్తర్వులు ఇచ్చారు.

భూస్వాములు వాటి అమలుకు నిరాకరిం చారు. దీనికి విరుగుడుగా అయ్యంకాళి ‘‘మీరు మా పిల్లలను చదువుకోనివ్వక పోతే మీ పొలాల్లో పిచ్చిగడ్డి మొలుస్తుంది. మీ పొలాలు బీళ్ళు పడతాయి’’ అని హెచ్చరించారు. దీనితో భూస్వాములు దిగివచ్చారు. అయితే ఒక అమ్మా యిని బడిలో చేర్పించడానికి వెళ్తే ఆధిపత్య కులాల వారు దాడిచేశారు. దానిని అయ్యంకాళి ప్రతిఘటించారు. ఇట్లా కొన్ని పదుల సంఘర్షణలు జరిగాయి. అయ్యంకాళిని హత్యచేయడానికి కిరాయి గూండాలతో దాడి చేయించారు. ట్రావెంకూర్ సంస్థానం ప్రజాసభలో పులయల సమస్యలపై, ప్రత్యేకించి విద్యాసౌకర్యాల కల్పన గురించి ఆయన చేసిన ప్రసంగాలు అందరినీ ఆకట్టు కున్నాయి. దేశ చరిత్రలోనే మొదట కూలీల సమ్మెను నిర్వహించిన ఘనత అయ్యంకాళిదే. సభకు పోలీసులు అనుమతి నిరాకరిస్తే, సమీపంలోని సము ద్రంలో పడవలన్నింటిని ఒక చోటకి చేర్చి సభ నిర్వహించిన గొప్ప ఉద్యమ వ్యూహకర్త అయ్యంకాళి. ఆయనది అత్యంత సాహసోపేతమైన ప్రతిఘటనా ఉద్యమం.


శ్రీ నారాయణ గురు సంస్కరణోద్యమం, అయ్యంకాళి ప్రతిఘటనోద్య మం తర్వాతి కాలంలో కేరళ కమ్యూనిస్టు ఉద్యమానికి బీజాలు వేశాయి. అం తేకాదు కేరళలో  ప్రగతిదాయకమైన, ప్రజాస్వామ్య భావాలకు, అభివృద్ధికి పునాదులను వేశాయి. కేరళ చైతన్యానికి శ్రీకారం చుట్టిన శ్రీ నారాయణ గురు, అయ్యంకాళి చిరస్మరణీయులు.







మల్లెపల్లి లక్ష్మయ్య
(వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు)
మొబైల్: 97055 66213.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement