దళితులపై దాడులను నియంత్రించాలి
దళితులపై దాడులను నియంత్రించాలి
Published Wed, Dec 7 2016 12:05 AM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM
- సబ్‌ప్లాన్‌ను సక్రమంగా అమలు చేయాలి
- సీపీఐ ఆధ్వర్యంలో భారీ ధర్నా
కర్నూలు(న్యూసిటీ) : దళితులపై దాడులు పెరిగిపోతున్నా నియంత్రణకు సర్కారు చర్యలు తీసుకోవడం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి కె. రామాంజనేయులు ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు కావస్తున్నా నేటికీ దళితులపై దాడులు జరుగుతుండడం దురదృష్టకరమన్నారు. సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు మంగళవారం కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా చేపట్టారు. ముందుగా రాజ్‌విహార్ దగ్గర ఉన్న అంబేడ్కర్ భవన్ నుంచి బుధవారపేట మీదుగా కలెక్టరేట్ వరకు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీగా వచ్చారు. దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను సక్రమంగా వినియోగించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. హైదరబాదు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు ఆర్‌ఎస్‌ఎస్ నాయకులే కారణమన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి భీమలింగప్ప మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ఇతర పనులకు మళ్లించకుండా దళిత, గిరిజనుల అభివృద్ధికే ఖర్చు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు గోదావరి, కృష్ణా పుష్కరాలకు ఈ నిధుల నుంచి రూ.వెయ్యి కోట్లు మళ్లించడం ఎంతవరకు సమంజసమన్నారు. వేలాది ఎకరాల భూములను పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేశారని ఆరోపించారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.శేఖర్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాలు, కమిటీ నాయకులు ఎన్.మనోహర్ మాణిక్యం, పి.గోవిందు, ఆర్.గురుదాస్, కె.రాధాకృష్ణ, ఎన్.లెనిన్ బాబు, మునెప్ప, రామకృష్ణారెడ్డి, మద్దిలేటి శెట్టి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement