ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగితే చాలు.. పార్టీతో సంబంధం లేకుండా నిధులు వరదై పారుతాయి. అవీఇవీ అనే తేడా లేకుండా మళ్లించేస్తారు.
ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగితే చాలు.. పార్టీతో సంబంధం లేకుండా నిధులు వరదై పారుతాయి. అవీఇవీ అనే తేడా లేకుండా మళ్లించేస్తారు. అడ్డుకట్ట వేసేందుకు చట్టాలు చేసినా నిలువరించే పరిస్థితి లేకపోతోంది. పైకి అలాంటిదేమీ లేదనే వాదనలు వినిపిస్తున్నా.. అధికారిక గణాంకాలు అసలు నిజాన్ని వెల్లడిస్తున్నాయి.
సాక్షి, కర్నూలు: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల కేటాయింపులో వివక్ష కొనసాగుతోంది. జనాభా ప్రాతిపదికన కేటాయించిన నిధులను ఇతర ప్రాంతాలకు, వర్గాలకు కేటాయిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఈ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో చట్టం చేసిన తర్వాత కూడా.. నిధుల మళ్లింపులో మార్పు రాకపోవడం గమనార్హం. జనరల్ స్థానాలకు నిధులను అధికంగా కేటాయిస్తూ.. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలకు మొండిచేయి చూపడం సర్వసాధారణమవుతోంది.
పభుత్వాన్ని, ముఖ్యులను ఎంతగా ప్రభావితం చేయగలరో వారే నిధులను అధికంగా రాబట్టుకోగలుగుతున్నారనేది స్పష్టమవుతోంది. సబ్‌ప్లాన్‌లో భాగంగా విద్యార్థుల సమగ్ర సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కళాశాలల వసతిగృహ భవనాలు, సమీకృత వసతి గృహ సముదాయాలు, వసతి గృహ భవనాలకు 2013-14 సంవత్సరం మొదటి విడతగా విడుదల చేసిన నిధులను ‘సాక్షి’ లోతుగా పరిశీలించింది. మొత్తం రూ.46 కోట్లు మంజూరు కాగా జిల్లాలోని 13 నియోజకవర్గాలకు పంపిణీ చేశారు.
పస్తుత నియోజకవర్గాలను 2001 జనాభా ప్రాతిపదికన.. 2008-09లో పునర్విభజన చేశారు. ఆ ప్రకారం చూసినా నిధుల కేటాయింపులో వివక్ష తేటతెల్లమవుతోంది. జిల్లాలో రెండు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. సబ్‌ప్లాన్ ప్రకారం చూస్తే.. ఈ రెండు నియోజకవర్గాలకు ఎక్కువ నిధులు కేటాయించాల్సి ఉంది. అయితే జనరల్ స్థానాలైన కర్నూలు, బనగానపల్లె, ఆదోని నియోజకవర్గాలకు పెద్దపీట వేశారు. ఈ పరిస్థితి కాంగ్రెస్, టీడీపీ నేతల ప్రమేయాన్ని చెప్పకనే చెబుతోంది. వాటి విషయాన్ని పక్కనపెడితే.. ఎస్సీ నియోజకవర్గమైన నందికొట్కూరుకు అతితక్కువగా రూ.125.44 లక్షలు మాత్రమే కేటాయించారు.
శ్రీశైలం నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి అధికార పార్టీ నాయకుడే అయినా నిధులను రాబట్టుకోవడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. మంత్రాలయం నియోజకవర్గానికి అత్యంత తక్కువగా రూ.12 లక్షలు కేటాయించగా.. ఎమ్మిగనూరు నియోజకవర్గానికి ఒక్క పైసా కేటాయించకపోవడం గమనార్హం. జనాభా ప్రాతిపదికన చూపినా నందికొట్కూరు నియోజకవర్గానికి నిధులు ఎక్కువగా కేటాయించాల్సి ఉంది. అయితే రూ.125 లక్షలతోనే సరిపెట్టడం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం అమలు తీరుకు అద్దం పడుతోంది.