సబ్‌ప్లాన్ నిధులు ఖర్చు చేయకుంటే చర్యలు
సబ్‌ప్లాన్ నిధులు ఖర్చు చేయకుంటే చర్యలు
Published Tue, Oct 25 2016 11:14 PM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM
కర్నూలు సిటీ: ఎస్సీ సబ్‌ప్లాన్ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ హరికిరణ్ అధికారులను ఆదేశించారు. ఇందుకు కేటాయించిన నిధులు ఖర్చు చేయకుంటే సంబంధిత అధికారులపై అట్రాసిటీ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఎస్సీ సబ్‌ప్లాన్‌పై అధికారులతో జేసీ సమీక్షించారు. సబ్‌ప్లాన్‌కు కేటాయించిన బడ్జెట్‌ను పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలన్నారు. మున్సిపాల్టిలో 40 శాతం ఎస్సీ జనాభా ఉన్నట్లు ధ్రువీకరించిన తర్వాతే పనులు చేపట్టాలన్నారు. 2014–15కు సంబంధించిన పనులు పెండింగ్‌లో ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఇకపై సబ్‌ప్లాన్ కింద చేస్తున్న పనులపై రెగ్యులర్‌గా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని, అందుకు సంబంధించి పూర్తి వివరాలతో రావాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ప్రతి కుటుంబానికి నెలకు రూ.10 వేల ఆదాయం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఇందుకు అనుగుణంగా అధికారులు లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రణాళికలు తయారు చేయాలన్నారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ప్రసాద్ రావు, ఆయా శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement