కలెక్టర్‌, జేసి సంతకాల ఫోర్జరీ కేసు: తీగ లాగితే కదులుతున్న డొంక | Collector And Jc Signature Forgery Case Revealed More Informations | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌, జేసి సంతకాల ఫోర్జరీ కేసు: తీగ లాగితే కదులుతున్న డొంక

Published Tue, May 24 2022 11:06 AM | Last Updated on Tue, May 24 2022 11:20 AM

Collector And Jc Signature Forgery Case Revealed More Informations - Sakshi

అనంతపురం శ్రీకంఠంసర్కిల్‌: కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్‌ సంతకాల ఫోర్జరీతో భూములకు నకిలీ ఎన్‌ఓసీలు సృష్టించిన వ్యవహారంలో కూడేరు పోలీసులు తీగ లాగితే డొంక కదులుతోంది. అనుమానితులను పుట్టపర్తి పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. కూడేరు మండలం కమ్మూరుకు చెందిన బోయ నారాయణప్ప పేరిట సర్వే నంబరు 525, 526లో 34.86 ఎకరాల భూమిని ఇటీవల అనంతపురం, ధర్మవరానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు నాగార్జునరెడ్డి, శ్రీనాథ్‌రెడ్డి, మరో ఇద్దరి భాగస్వామ్యంతో కొనుగోలు చేశారు. ఎకరా రూ.54 లక్షల ప్రకారం అగ్రిమెంటు చేసుకున్నారు.

కొనుగోలు చేసిన వ్యక్తులు అగ్రిమెంటు మీద ఎక్కువ ధరతో అమ్మకానికి పెట్టారు. అయితే ఈ భూమిలో కొంత భాగానికి 1954లో మంజూరైన డీ–పట్టా భూమిని నిషేధిత భూముల జాబితా (22ఏ) నుంచి తొలగింస్తే మరింత ఎక్కువ ధర దక్కుతుందన్న ఆశతో ఎన్‌ఓసీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కూడేరు తహసీల్దార్, అనంతపురం ఆర్డీఓ కార్యాలయాల్లో సంతకాలు పూర్తయిన తర్వాత  ఫైలు కలెక్టర్‌ కార్యాలయానికి చేరి ఆగిపోయింది. దీంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు.. గతంలో కలెక్టరేట్‌లో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేసిన మహబూబ్‌బాషాను ఆశ్రయించారు. రూ.10 లక్షలు ఇస్తే త్వరగా చేయించి ఇస్తానని వారితో అతను ఒప్పందం కుదుర్చుకున్నాడు.

దీంతో వారు కొంత మొత్తాన్ని ముట్టజెప్పడంతో వారికి మహబూబ్‌బాషా ఎన్‌ఓసీ తెచ్చిచ్చారు. దానిని చూపి వ్యాపారులు అధిక ధరకు భూమిని విక్రయించేందుకు తోటి రియల్టర్లను కలిశారు. భూమి పత్రాలతో పాటు ఆ సర్టిఫికెట్‌ను వాట్సాప్‌లో షేర్‌ చేశారు. అలా చక్కర్లు కొట్టిన ఆ పత్రాలు ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి చేతికి చేరాయి. రెండు రోజుల క్రితం లేదన్న ఎన్‌ఓసీ ఇప్పుడు ఎలా వచ్చిందని ఆరా తీసిన ఆ ప్రజాప్రతినిధి చివరకు కలెక్టర్‌కు సమాచారం అందజేశారు. దీంతో కలెక్టర్, జేసీ సంతకాల మార్ఫింగ్‌ అని నిర్ధారణ అయింది.  

కలెక్టరేట్‌లో సహకరించిందెవరు? 
కలెక్టర్, జేసీ సంతకాల మార్ఫింగ్‌తో ఎన్‌ఓసీ  సృష్టించిన వైనంపై కలెక్టరేట్‌లో మహబూబ్‌బాషాకు ఎవరు సహకరించారనే అంశంపై విచారణ మొదలైంది.  సంబంధిత సెక్షన్‌లోని సిబ్బందిని పోలీసులు విచారణ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

పరారీలో కీలక నిందితుడు 
కలెక్టర్, జేసీ సంతకాల మార్ఫింగ్‌తో ఎన్‌ఓసీ సృష్టించిన కీలక నిందితుడు మహబూబ్‌బాషా పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై కూడేరు తహసీల్దార్‌ ఫిర్యాదు మేరకు మహబూబ్‌బాషాపై అనంతపురం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో 420, 421, 467, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పలువురు అనుమానితులను అనంతపురం ఇన్‌చార్జ్‌ డీఎస్పీ ఎ.శ్రీనివాసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలిసింది.  

(చదవండి: ఫిర్యాదు చేస్తే అవిటితనాన్ని వెక్కిరించి కొట్టి...)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement