atrasiti
-
టీడీపీ నాయకుడిపై అట్రాసిటీ కేసు నమోదు
పెద్దకడబూరు : టీడీపీ జిల్లా కార్యదర్శి రమాకాంత్రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. గ్రామానికి చెందిన ఎస్సీ బొగ్గుల రోగన్న బైక్‌పై ఆదోనికి వెళ్తుండగా, అదే సమయంలో రమాకాంత్‌రెడ్డి కుటుంబీకులతో వాహనంలో ముందు వెళ్తున్నాడు. ముందుగా వెళ్తున్న వాహనం సైడ్ ఇవ్వాలని రోగన్న పలుమార్లు హారన్ కొట్టినా సైడ్ ఇవ్వలేదు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఎందుకు సైడు ఇవ్వడం లేదని అడుగగా.. రమకాంతరెడ్డి తనను కులం పేరుతో దూషించాడని ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ మహబూబ్‌బాషా తెలిపారు. అలాగే ఎస్సీ బొగ్గుల రోగన్నతో తమకు ప్రాణహాని ఉందని రమాకాంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
ఎస్సీ, ఎస్టీ కేసులో ఎస్పీని ముద్దాయిగా చేర్చాలి
–హైకోర్టు న్యాయవాది పురుషోత్తంరెడ్డి ఎమ్మిగనూరు : ఎస్సీ, ఎస్టీ కేసును తన పలుకుబడితో ఫాల్స్‌గా చిత్రీకరించిన జిల్లా ఎస్పీ రవికృష్ణను అదే కేసులో ముద్దాయిగా చేర్చాలని హైకోర్టు సీనియర్ న్యాయవాది పురుషోత్తంరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం విశాల గార్డెన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పెద్దకడబూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో బంగి వెంకటేశ్వర్లు అనే ఎరుకల కులస్తున్ని దూషించి, దాడి చేసిన సంఘటనలో అనుమయ్య అనే వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి (47/2016) కేసు నమోదయిందన్నారు. అయితే ఎస్సీ, ఎస్టీ కేసులను విచారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక డీఎస్పీని నియమించినా జిల్లా ఎస్పీ మాత్రం ఆదోని డీఎస్పీచే విచారించి ఫాల్స్ కేసుగా మార్చారన్నారు. జరిగిన అన్యాయాన్ని వెంకటేశ్వరు నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారన్నారు. కమిషన్ ఆదేశాల మేరకు డీఐజీ రమణ మూర్తి కేసును రీ–ఓపెన్ చేసీ ఎస్సీ, ఎస్టీ కేసుల డీఎస్పీ మురళీధర్‌చే విచారణ చేపట్టాలని ఆదేశించారన్నారు.మురళీధర్‌కూడా దళితుడు కావటంతోనే కేసును ఆయనచే విచారించకుండా ఎస్పీ అవమానించారన్నారు. ఈ సంఘటనను రాయలసీమ ఐజీ దృష్టికి తీసుకుపోతామనీ, అటు తరువాత హైకోర్టులో పిల్ దాఖలు చేసి ఎస్పీని ఆరెస్టు చేయిస్తామన్నారు. సమావేశంలో బా«ధితుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
సబ్‌ప్లాన్ నిధులు ఖర్చు చేయకుంటే చర్యలు
కర్నూలు సిటీ: ఎస్సీ సబ్‌ప్లాన్ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ హరికిరణ్ అధికారులను ఆదేశించారు. ఇందుకు కేటాయించిన నిధులు ఖర్చు చేయకుంటే సంబంధిత అధికారులపై అట్రాసిటీ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఎస్సీ సబ్‌ప్లాన్‌పై అధికారులతో జేసీ సమీక్షించారు. సబ్‌ప్లాన్‌కు కేటాయించిన బడ్జెట్‌ను పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలన్నారు. మున్సిపాల్టిలో 40 శాతం ఎస్సీ జనాభా ఉన్నట్లు ధ్రువీకరించిన తర్వాతే పనులు చేపట్టాలన్నారు. 2014–15కు సంబంధించిన పనులు పెండింగ్‌లో ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఇకపై సబ్‌ప్లాన్ కింద చేస్తున్న పనులపై రెగ్యులర్‌గా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని, అందుకు సంబంధించి పూర్తి వివరాలతో రావాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ప్రతి కుటుంబానికి నెలకు రూ.10 వేల ఆదాయం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఇందుకు అనుగుణంగా అధికారులు లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రణాళికలు తయారు చేయాలన్నారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ప్రసాద్ రావు, ఆయా శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
దళితులపై దాడులు అమానుషం
హిమాయత్‌నగర్ : నిజమాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని నాగాపూర్ గ్రామంలో దళితులపై అగ్రకులాలు వారు చేసిన దాడి అమానుషమని తెలంగాణ మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాస్త దయానంద్ అన్నారు. గురువారం ఈ ఘటనపై మస్త దయానంద్ మాట్లాడుతూ ఉమ్మెడ లక్ష్మి, చిన్న గంగు, పోశన్న, గంగారాంలకు ప్రభుత్వం 42 ఎకరాల భూమి ఇచ్చిందన్నారు. ఈ భూమిలో రెండు ఎకరాలు మీది కాదంటూ అగ్రకులానికి చెందిన ఎంబారి పెద్దనారాయణ, ఎంబారి చిన్ననర్సయ్య, ముండలి పెద్దరాజన్న, రొడ్డ రాజేశ్వర్, నల్లూరు చెన్నయ్య, ఎంబరి చిన్ననర్సయ్యలు లాక్కున్నారన్నారు. దీనిపై వారు పోరాటం చేయగా గతంలో జిల్లా జాయింట్ కలెక్టర్ స్పందించి ఆ రెండెకరాల భూమి కూడా దళితులదేనని స్పష్టం చేశారు. ఈ క్రమంలో దళితులు తమ భూమిలో పశువులను ఉంచడంతో ఎందుకు ఉంచారంటూ అగ్రకులాల నాయకులు దళిత మహిళలని కూడా చూడకుండా దాడి చేశారన్నారు. దాడి చేసిన అగ్రకులాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని దయానంద్ హెచ్చరించారు. -
పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
♦ బాధితురాలి నుంచి వివరాల సేకరణ ♦ నిందితుడిపై ఎస్సీ అట్రాసిటీ, అత్యాచారం కేసులు జోగిపేట: ‘ఈ పాపం ఎవరిది’ అనే శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో ఈనెల 11న ప్రచురితమైన కథనానికి స్పందించిన సీఐ వెంకటయ్య బాధిత బాలికను పిలిపించి విచారణ ప్రారంభించారు. సోమవారం ఉదయం గ్రామ మాజీ సర్పంచ్ జనార్దన్‌గౌడ్ బాధితురాలి(14)ని జోగిపేట సీఐ కార్యాలయానికి తీసుకువచ్చారు. బాలికకు జరిగిన అన్యాయంపై సీఐ వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాను నిజాంసాగర్ సమీపంలోని అచ్చంపేటకు బంధువుల వద్దకు ఆటోలో వెళ్లిన సమయంలో నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన రవి అనే వ్యక్తి తనకు తనకు పరిచయం ఏర్పడిందని, అతడు తనను శారీరకంగా వాడుకున్నాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి రెండు నెలలుగా ముఖం చాటేస్తున్నాడని సీఐకి బాధితురాలు తెలిపింది. గర్భవతిని అని చెప్పిన తర్వాత ఫోన్లో మాట్లాడడం మానేశాడన్నారు. ముందు తనకు పెళ్లి కాలేదని చెప్పిన రవి, తాను గర్భవతినయ్యానని చెప్పడంతో అతడు తనకు పెళ్లైందని, బిడ్డ కూడా ఉందని చెబుతున్నాడని, ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడని బాధితురాలు వివరించింది. మోసం చేసిన వ్యక్తి ఆధారాలున్నాయా? అని సీఐ ప్రశ్నించగా అతడి పేరు రవి అని, అతడి ఫోన్ నంబరు చెప్పింది. వెంటనే సీఐ ఆ నంబరు ఎవరిదో ఆన్లైన్లో తెలుసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అయితే ఆ నంబరు నారాయణఖేడ్ మండలం కొత్తపల్లికి చెందిన పోచయ్యదని తేలింది. నిజాంపేట వద్ద ఆటో నడుపుతానని, తనను ఎన్నోసార్లు ఆటోలో ఎక్కించుకొని తీసుకువెళ్లాడని చెప్పడంతో వెంటనే అతడిని తీసుకురావాల్సిందిగా సీఐ సిబ్బందిని ఆదేశించారు. నిందితుడిపై అత్యాచారం, ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు దళిత బాలికను మోసం చేసి ఆ మెపై అత్యాచారానికి పాల్పడడంతోపాటు నిందితుడు రవిపై ఎస్సీ, అట్రాసిటీ కేసును నమోదు చేసినట్లు సీఐ వెంకటయ్య తెలిపారు. బాధితురాలు సోమవారం నిందితుడి వివరాలు తెలుపడంతోపాటు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేస్తున్నట్లు ఆయన తెలి పారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపనున్నట్లు ఆయన తెలిపారు. డెలివరీ అనంతరం ఇద్దరికి డీఎన్ఏ పరీక్షలను నిర్వహిస్తామని సీఐ చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఇన్చార్జి డీఎస్పీకి సీఐ వివరించారు.