దళితులపై దాడులు అమానుషం
Published Thu, Aug 25 2016 10:41 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
హిమాయత్‌నగర్ :
నిజమాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని నాగాపూర్ గ్రామంలో దళితులపై అగ్రకులాలు వారు చేసిన దాడి అమానుషమని తెలంగాణ మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాస్త దయానంద్ అన్నారు. గురువారం ఈ ఘటనపై మస్త దయానంద్ మాట్లాడుతూ ఉమ్మెడ లక్ష్మి, చిన్న గంగు, పోశన్న, గంగారాంలకు ప్రభుత్వం 42 ఎకరాల భూమి ఇచ్చిందన్నారు. ఈ భూమిలో రెండు ఎకరాలు మీది కాదంటూ అగ్రకులానికి చెందిన ఎంబారి పెద్దనారాయణ, ఎంబారి చిన్ననర్సయ్య, ముండలి పెద్దరాజన్న, రొడ్డ రాజేశ్వర్, నల్లూరు చెన్నయ్య, ఎంబరి చిన్ననర్సయ్యలు లాక్కున్నారన్నారు. దీనిపై వారు పోరాటం చేయగా గతంలో జిల్లా జాయింట్ కలెక్టర్ స్పందించి ఆ రెండెకరాల భూమి కూడా దళితులదేనని స్పష్టం చేశారు. ఈ క్రమంలో దళితులు తమ భూమిలో పశువులను ఉంచడంతో ఎందుకు ఉంచారంటూ అగ్రకులాల నాయకులు దళిత మహిళలని కూడా చూడకుండా దాడి చేశారన్నారు. దాడి చేసిన అగ్రకులాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని దయానంద్ హెచ్చరించారు.
Advertisement