♦ బాధితురాలి నుంచి వివరాల సేకరణ
♦ నిందితుడిపై ఎస్‌సీ అట్రాసిటీ, అత్యాచారం కేసులు
జోగిపేట: ‘ఈ పాపం ఎవరిది’ అనే శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో ఈనెల 11న ప్రచురితమైన కథనానికి స్పందించిన సీఐ వెంకటయ్య బాధిత బాలికను పిలిపించి విచారణ ప్రారంభించారు. సోమవారం ఉదయం గ్రామ మాజీ సర్పంచ్ జనార్దన్‌గౌడ్ బాధితురాలి(14)ని జోగిపేట సీఐ కార్యాలయానికి తీసుకువచ్చారు. బాలికకు జరిగిన అన్యాయంపై సీఐ వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాను నిజాంసాగర్ సమీపంలోని అచ్చంపేటకు బంధువుల వద్దకు ఆటోలో వెళ్లిన సమయంలో నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన రవి అనే వ్యక్తి తనకు తనకు పరిచయం ఏర్పడిందని, అతడు తనను శారీరకంగా వాడుకున్నాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి రెండు నెలలుగా ముఖం చాటేస్తున్నాడని సీఐకి బాధితురాలు తెలిపింది.
గర్భవతిని అని చెప్పిన తర్వాత ఫోన్‌లో మాట్లాడడం మానేశాడన్నారు. ముందు తనకు పెళ్లి కాలేదని చెప్పిన రవి, తాను గర్భవతినయ్యానని చెప్పడంతో అతడు తనకు పెళ్లైందని, బిడ్డ కూడా ఉందని చెబుతున్నాడని, ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడని బాధితురాలు వివరించింది. మోసం చేసిన వ్యక్తి ఆధారాలున్నాయా? అని సీఐ ప్రశ్నించగా అతడి పేరు రవి అని, అతడి ఫోన్ నంబరు చెప్పింది. వెంటనే సీఐ ఆ నంబరు ఎవరిదో ఆన్‌లైన్‌లో తెలుసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అయితే ఆ నంబరు నారాయణఖేడ్ మండలం కొత్తపల్లికి చెందిన పోచయ్యదని తేలింది. నిజాంపేట వద్ద ఆటో నడుపుతానని, తనను ఎన్నోసార్లు ఆటోలో ఎక్కించుకొని తీసుకువెళ్లాడని చెప్పడంతో వెంటనే అతడిని తీసుకురావాల్సిందిగా సీఐ సిబ్బందిని ఆదేశించారు.
నిందితుడిపై అత్యాచారం, ఎస్‌సీ అట్రాసిటీ కేసు నమోదు
దళిత బాలికను మోసం చేసి ఆ మెపై అత్యాచారానికి పాల్పడడంతోపాటు నిందితుడు రవిపై ఎస్‌సీ, అట్రాసిటీ కేసును నమోదు చేసినట్లు సీఐ వెంకటయ్య తెలిపారు. బాధితురాలు సోమవారం నిందితుడి వివరాలు తెలుపడంతోపాటు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేస్తున్నట్లు ఆయన తెలి పారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపనున్నట్లు ఆయన తెలిపారు. డెలివరీ అనంతరం ఇద్దరికి డీఎన్‌ఏ పరీక్షలను నిర్వహిస్తామని సీఐ చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఇన్‌చార్జి డీఎస్పీకి సీఐ వివరించారు.