'వాళ్లంతా కూడా నయీం బాధితులే'
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీంతో నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ నేతలకు సంబంధాలు ఉన్నాయంటూ వస్తున్న ఆరోపణలను ఆ పార్టీ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పూల రవీందర్, ఎమ్మెల్యే వేముల వీరేశం ఖండించారు. మంగళవారం వారు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరున్నంత మాత్రాన తప్పుచేసినట్టు కాదన్నారు. ప్రాథమిక సమాచారం మేరకే ఎఫ్‌ఐఆర్ నమోదవుతుందని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో తప్పులకు పాల్పడలేదని స్పష్టం చేశారు.
పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కోమటిరెడ్డి బ్రదర్స్‌వి చీప్ పాలిటిక్స్' అని మండిపడ్డారు. నయీమ్ మా ఎమ్మెల్యేలను బెదిరించారని అన్నారు. తమ పార్టీ అయినా వేరే పార్టీ అయినా చట్ట ప్రకారమే చర్యలు ఉంటాయని చెప్పారు. నేతి విద్యాసాగర్‌పై నమోదు అయింది ఎఫ్‌ఐఆర్ మాత్రమేనని తెలిపారు. ఎఫ్‌ఐఆర్ నమోదు అయినంత మాత్రాన దోషి కాదన్నారు. కాంగ్రెస్ నిరసన అనడానికి సిగ్గు ఉండాలని ధ్వజమెత్తారు. పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశావని ప్రశ్నించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల మోచేతి నీళ్లు తాగావని కోమటిరెడ్డి బ్రదర్స్‌పై పల్లా రాజేశ్వర్‌రెడ్డి నిప్పులు చెరిగారు.
తప్పులు చేసి ఉంటే.. చర్యలు తీసుకుకేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమని తెలిపారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా నయీం బాధితులే' అని వెల్లడించారు. నయీం వల్ల లాభం పొందింది ఎవరూ? నష్టం పొందిందెవరో అందరికీ తెలుసునని చెప్పారు. తమ పార్టీకి చెందిన సాంబశివుడు, రాములను హత్యచేసినప్పుడు ఎందుకు స్పందించలేదని పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పూల రవీందర్ సూటిగా ప్రశ్నించారు.
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. కోమటిరెడ్డి బ్రదర్స్ అక్రమంగా సంపాదించిన డబ్బులతో పదవులు కొంటున్నాడని ఆరోపించారు. 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే చట్టపరంగా వెళ్తామన్నారు. గుండాగిరితో రాజకీయాల్లోకి వచ్చారని విమర్శించారు. నయీమ్‌కు రాజకీయ, ఆర్థిక సహకారం కోమటిరెడ్డి బ్రదర్స్ అందించారనే అనుమానం కలుగుతుందని అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌తో బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. నయీంతో కాంగ్రెస్ నేతలు లబ్ధిపొందారని ఆయన విమర్శించారు. గత ముఖ్యమంత్రులు కూడా నయీంతో అంటకాగారని విమర్శించారు.