గులాబీ నేతపై నయీమ్ ‘కత్తి’?
గ్యాంగ్‌స్టర్‌తో అంటకాగిన నాయకుల్లో గుబులు
కఠిన చర్యలకు సిద్ధమవుతున్న టీఆర్‌ఎస్ అధిష్టానం
ఓ ఎమ్మెల్సీతో రాజీనామా చేయించే అవకాశం
మరి కొందరు నేతలపైనా చర్యలుంటాయని ప్రచారం
నయీమ్‌తో నాయకుల సంబంధాలపై స్పష్టతకు వచ్చిన సీఎం
సొంతింటిని చక్కదిద్ది.. తర్వాత ఇతర పార్టీల నేతలపై కేసులు
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో అంటకాగిన రాజకీయ నాయకులకు కేసుల ముప్పు పొంచి ఉందా? టీడీపీ, కాంగ్రెస్ నాయకులపై కేసులు పెట్టే ముందు తమ పార్టీకి చెందిన వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని టీఆర్‌ఎస్ అధినాయకత్వం భావిస్తోందా? పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి. ఎన్‌కౌంటర్‌లో నయీమ్ హతమై నెల రోజులు గడిచిపోయాక కూడా సిట్ నేతృత్వంలో ఇంకా అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి.
పోలీసుల విచారణలో నయీమ్ అనుచరులు వెల్లడిస్తున్న అంశాలు పలువురు రాజకీయ నేతలు, కొందరు పోలీసు అధికారుల మెడకు చుట్టుకునేలా ఉన్నాయి. అయితే టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీతో కలసి నడిచిన వారికంటే వివిధ పార్టీల నుంచి గులాబీ గూటికి చేరిన నాయకులకే నయీమ్‌తో ఎక్కువగా సంబంధాలున్నాయని ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. నయీమ్‌తో సంబంధాలు నెరిపి బినామీలుగా వ్యవహరించిన వారు కొందరు అధికార పార్టీలో పదవుల్లో ఉన్నారు. ఇప్పుడు అందరి దృష్టి వారిపైనే కేంద్రీకృతమై ఉంది. ఇలా పార్టీ మారి టీ ఆర్‌ఎస్‌లో చేరిన ఓ ఎమ్మెల్సీపై వేటు పడడం ఖాయమని పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలిసింది.
వారంతా భయంభయంగా..
ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో పలువురు నాయకులు ప్రస్తుతం వివిధ హోదాల్లో ఉన్నారు. వీరికి గతంలోనే నయీమ్‌తో సంబంధాలు ఉన్నాయనేందుకు అతడి డైరీలో ఆధారాలు లభించాయని చెబుతున్నారు. ఇప్పుడు పేరుకు తమ పార్టీలో ఉన్నా.. నయీమ్‌తో సంబంధాలు ఏర్పడింది, కొనసాగించింది ఇతర పార్టీల్లో ఉన్నప్పుడేనని, అందువల్ల వారి కోసం పార్టీకి చెడ్డపేరు ఎందుకు తెచ్చుకోవాలన్న చర్చ కూడా జరిగిందంటున్నారు.
ఇందులో భాగంగానే నల్లగొండ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్సీతో రాజీనామా చేయించాలన్న అంశంపై చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ నెల 20న అసెంబ్లీ, మండలి సమావేశాలు మొదలు కానున్న నేపథ్యంలో అంతకుముందే సదరు ఎమ్మెల్సీతో రాజీనామా చేయిస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
రాజీనామా చేయించడం వల్ల తమ పార్టీకి వచ్చే చెడ్డపేరు ఏమీ ఉండదన్న అంశంపైనా పార్టీ నేతలు విశ్లేషించారని అంటున్నారు. మరోవైపు నయీమ్‌తో సంబంధాలున్నాయని ప్రచారం జరిగిన పలువురు నాయకులు ఒకింత భయం భయంగానే గడుపుతున్నారు. వీలు చిక్కినప్పుడల్లా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును కలిసి తమ తప్పేమీ లేదని వివరించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. ఇటీవల బాగా ప్రచారం జరిగిన ఓ ఎమ్మెల్సీ.. సీఎం కేసీఆర్‌ను కలిశారని, తన గురించి చెప్పుకున్నారని వినికిడి. మరో ఎమ్మెల్సీ కూడా సీఎంను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడ్డారని అంటున్నారు.
ముందు సొంతింటి నుంచే..
నయీమ్ కేసులో సంబంధాలున్న వివిధ పార్టీల నేతలపై కేసులు నమోదు చే సేందుకు ముందుగా సొంతింటిని చక్కదిద్దాలన్న చర్చ టీఆర్‌ఎస్‌లో జరిగింది. గ్యాంగ్‌స్టర్‌తో అంటకాగి, ఆర్థికంగా లాభం పొందిన వారెవరైనా పార్టీలో ఉంటే ముందుగా వారిపై కేసులు పెట్టి, ఆ తర్వాత ఇతర పార్టీల నేతలపై చర్యలకు దిగాలన్న చర్చ జరిగినట్లు సమాచారం.
ఇప్పటికే తమ పార్టీలో ఎవరెవరికి, ఏ స్థాయిలో సంబంధాలున్నాయన్న అంశంపై గులాబీ అధినేత ఓ స్పష్టతకు వచ్చారని, ఆయన ఇచ్చే గ్రీన్‌సిగ్నల్ కోసమే పోలీసులు ఎదురు చూస్తున్నారని సమాచారం. కొద్ది రోజుల కిందట టీడీపీకి చెందిన ఓ మాజీ మంత్రి పేరు తెరపైకి రావడం, అధికార పార్టీ కావాలనే తమపై నిందలు వేస్తోందని ఆయన ఈ ప్రచారాన్ని తిప్పికొట్టారు. నేపథ్యంలోనే ప్రభుత్వం ఒక అడుగు వెనుకకు వేసిందంటున్నారు. ఏ పక్షం నుంచి విమర్శలు రాకుండా చర్యలు తీసుకునే పనిలో టీఆర్‌ఎస్ ఉందని, ఈ నెలాఖరులోగా కొందరిపై వేటు పడడం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.