సాక్షి, నల్లగొండ : తన ప్రధాన అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యపై సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్య వెనుక అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందని... డీఎస్పీని ఇక్కడకు తీసుకు వచ్చి అరాచకం సృష్టిస్తున్నారని, ఈ హత్యకు దగ్గరుండి ప్లాన్ చేసింది డీఎస్పీనేని ఆరోపించారు. కోమటిరెడ్డి శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘ఆరేళ్ల క్రితం (డిశెంబరు 2011) నా కొడుకు చనిపోయినప్పుడు సగం చనిపోయిన. ఇప్పుడు నా ప్రాణానికి ప్రాణం తన తమ్ముడిలాంటోన్ని చంపారు. హంతకులు ఊటకూరు గ్రామంలో ఉన్నారని సమాచారం ఉంది. హత్యలే చేయాలనుకుంటే మీరెవ్వరు మిగలరు. మా పద్ధతి అదికాదు. దోషులను శిక్షిస్తే శ్రీనివాస్ కుటుంబానికి శాంతి కలుగుతుంది. ఆ కుటుంబం కోసం నా ప్రాణాలు ఇస్తా. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్నవారిపై చర్యలుతీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.
మరోవైపు శ్రీనివాస్ హత్యపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు మాట్లాడుతూ... ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ హత్య చేయించినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. మాఫియా డాన్ నయీమ్‌కు వీరేశంకు దగ్గర సంబంధాలున్నాయని ఆరోపించారు. ఎమ్మెల్యే మనుషులే ఈ హత్యను చేసినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఇది చంపడం కాదని, బీసీల ఆడపడుచు బొట్టు తీసేశాడని వీహెచ్ వ్యాఖ్యానించారు. ఈ హత్య వెనుక నల్లగొండ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇంఛార్జ్ హస్తం కూడా ఉందన్నారు. ఇది ముమ్మాటికి టీఆర్‌ఎస్ చేయించిన హత్యేనని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ పతనం నల్లగొండ నుంచే ప్రారంభం అవుతుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment