సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే వీరేశం నయీంకంటే డేంజర్ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆ నయీంకంటే వీరేశమే బడా నయీం అని అన్నారు. తన ప్రధాన అనుచరుడు శ్రీనివాస్‌ను హత్య చేయించింది ముమ్మాటికి ఎమ్మెల్యే వీరేశమేనని, ఆయన కాల్ డేటా, ఆయన కిరాయి హంతకుల కాల్ డేటా చూస్తే ఆ విషయం తెలిసిపోతుందని అన్నారు. హంతకులు హత్య చేసి నేరుగా నకిరేకల్ వెళ్లి ఆగినట్లు స్వయంగా డీజీపీ కూడా చెప్పారని, వీరేశం చెబితేనే తాము హత్య చేసినట్లు నిందితులు కూడా ఇప్పటికే డీజీపీ వద్ద ఒప్పుకున్నారని, ఆ వార్తలు రేపు మీరు టీవీల్లో చూసి షాక్ కు గురవుతారని కోమటిరెడ్డి చెప్పారు.
వీరేశం అనే వ్యక్తిని ఎమ్మెల్యే అనడానికి తనకు సిగ్గుగా ఉందన్న కోమటి రెడ్డి సినీ ఫక్కీలో శ్రీనివాస్‌ను హత్య చేయించారని అన్నారు. ఒక మున్సిపల్ చైర్మన్ భర్తను చంపడం మాములు విషయం కాదని, కోట్లు ఖర్చు చేసి శ్రీనివాస్‌ను హత్య చేశారని తెలిపారు. మూడేళ్ల నుంచే శ్రీనివాస్ హత్యకు కుట్ర చేశారని చెప్పారు. శ్రీనివాస్‌కు అపాయం ఉందని గతంలోనే భార్యభర్తలను అసెంబ్లీ చాంబర్‌కు తీసుకెళ్లి ముఖ్యమంత్రి కాళ్లు పట్టుకున్నంత పనిచేసినా ఆయన కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటి నుంచో పార్టీ మారాలని శ్రీనివాస్‌పై ఒత్తిడి తెస్తున్నారని, తన (వెంకట్‌రెడ్డి) సంగతి మేం (టీఆర్‌ఎస్) చూసుకుంటామని బెదిరించారని, అయినా అతడు వినకపోవడంతోనే ఈ హత్య చేయించారని అన్నారు. శ్రీనివాస్ తనకు కుటుంబ సభ్యుడిలాంటివాడని, 25 ఏళ్లుగా తనతోనే ఉన్నాడని చెప్పారు.
'వీరేశం అనే వాడు బడా నయీం. ఆ నయీంను ఎన్‌కౌంటర్ చేసినప్పుడు ఈ వీరేశంను ఎందుకు ఎన్ కౌంటర్ చేయరు. అవసరం అయితే నా ఫోన్ కాల్ డేటా తీసుకోవాలి. వీరేశం కాల్ డేటా, వీరేశం కిరాయి హంతకుల కాల్ డేటా తీసుకుంటే హంతకులు ఎవరో? ఎవరు హత్య చేయించారో అనే విషయం తేలిపోతుంది. వేముల విరేశం వల్లే శ్రీనివాస్ హత్య జరిగింది. సీఎం, మంత్రి జగదీష్ రెడ్డి అండ చూసుకొని వీరేశం బెదిరింపు కాల్స్ చేయిస్తున్నారు. నాకు, లింగయ్యకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. టీఆర్ఎస్ నాయకులకు సిగ్గుండాలి. కాంగ్రెస్‌పై విమర్శలు చేయడానికి. న్యాయం జరగకపోతే కోర్టుకు వెళతాం. చంపుకుంటూ పోతే కత్తులే మిగులుతాయి. సీఎం మా సహనాన్ని పరక్షించవద్దు' అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
'వీరేశం గురించి తెలుసుకొని రేపు మీరే షాకవుతారు'
Published Sat, Jan 27 2018 5:55 PM | Last Updated on Sat, Jan 27 2018 5:55 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment