
కొత్త రాష్ట్రం.. సరికొత్త పంథా: కేసీఆర్
* పాతపార్టీలు వద్దు
* సక్రమ ఉద్యోగులను ఉండొద్దనలే..
* దళితుల సంక్షేమానికి 50వే ల కోట్లు
* తెలంగాణ పునరుద్ధరణ కోసమే టీఆర్‌ఎస్‌కు పగ్గాలు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ట్రంలో కొత్త పార్టీకే ఓటు వేయాలని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.‘ కొత్త రాష్ట్రం.. కొత్త పంథా.. కొత్త పార్టీ’ నినాదంతో ముందుకు పోదామన్నారు. కాంగ్రెస్ 41 ఏళ్లు, టీడీపీ 17 ఏళ్ల పాలన చూశామని, మళ్లీ జెండాలు పట్టుకుని ఆ పార్టీలు వస్తున్నాయని, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.
కష్టపడి తెలంగాణ సాధించుకుని మళ్లీ ఈ పార్టీలకు అధికా రం కట్టబెడితే ఒరిగేదేమీ ఉండదన్నారు. అందుకే కొత్త రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునేందుకు టీఆర్‌ఎస్‌కే అధికారం ఇవ్వాలని కోరారు. నకిరేకల్‌కు చెందిన వేముల వీరేశం ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్, టీడీపీ నేతలు సోమవారం టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మనరాష్ట్రాన్ని బాగు చేసుకునేందుకే టీఆర్‌ఎస్‌కు అధికారం కావాలంటున్నామని తెలిపారు. కొత్త రాష్ట్రంలో కూడా కాంగ్రెస్, టీడీపీలకే అధికారం ఇస్తే తెలంగాణ వచ్చింది గట్క తినడానికా? అని ఆయన ప్రశ్నించారు.
ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
* ఎంతో కష్టపడి, ప్రాణత్యాగాలు చేసి సాధించిన తెలంగాణను కాంగ్రెస్, టీడీపీల చేతిలో పెడితే ఈనగాచి నక్కలపాటు చేయడమే.
* నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతాన్ని పారదోలాలంటే మిగులుజలాలను పారించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నాలుగేళ్ల కింద నివేదిక ఇచ్చింది. అయినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు.
* ఫ్లోరిన్ కారణంగా నల్లగొండ ‘మనుషులు ఉండలేని ప్రాంతం’గా మారుతుందని డబ్ల్యుహెచ్‌వో హెచ్చరికలనూ వలస పాలకులు బేఖాతరు చేసిన్రు.
* ఎస్‌ఎల్‌బీసీలో నీరు పారడం లేదు. అక్కడే కుర్చీ వేసుకుని కూర్చుంటా. నీళ్లు ఎట్లాపారవో చూస్తా
* ఉద్యోగులందరినీ వెళ్లగొట్టమని నేను అనలే. సక్రమంగా నియమితులైన వారు ఉండొద్దని నేను ఏనాడూ అనలేదు.
* ఒక్క గదిలో కుటుంబమంతా ఎట్లుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉంటారా? అదే గదిలో గొర్రెలు కూడా కట్టేస్తే... పోరగాడి మోహం మీద ఉచ్చపోస్తోంది.
* అందుకే పేదలకు 150 గజాల్లో రెండు పడకగదుల ఇళ్లు నిర్మిస్తా. ఇందుకయ్యే 3 లక్షలను సబ్సిడీగా ప్రభుత్వమే ఇస్తుంది.
* దళితుల సంక్షేమ కోసం వచ్చే ఐదేళ్లలో 50 వేల కోట్లు ఖర్చు చేస్తాం. నిర్బంధ ఉచిత విద్యను అమలు చేస్తా.
* ఒక ఓటు టీఆర్‌ఎస్‌కు... రెండో ఓటు మోడీకి అని పోరగాల్లు అనుకుంటున్నరు. మనకు మోడీ...గీడీ వద్దు. 17 ఎంపీ సీట్లు వస్తేనే ఢిల్లీ మెడలు వంచి మనకు కావాల్సింది సాధించుకోవచ్చు.
* నకిరేకల్‌లో వీరేశాన్ని గెలిపిస్తే... కేసీఆర్‌ను గెలిపించినట్టే. నకిరేకల్ అభివృద్ధికి నాదే బాధ్యత.