సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తన నియోజకవర్గానికి చెందిన మహిళకు జరుగుతున్న అన్యాయంపై ఓ ప్రజాప్రతినిధిగా మాట్లాడానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం నల్లగొండలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డీసీసీబీలో నిధుల దుర్వినియోగం విషయమై 21 మంది ఉద్యోగులపై చర్య తీసుకోవాలని సదరు బ్యాంకు ఆదేశించిందన్నారు. అయితే.. నంబర్ 9 గా ఉన్న ఉద్యోగి లక్ష్మిని ఆరు నెలలు సస్పెండ్ చేశారని తెలిపారు. సస్పెన్షన్ కాలంలో విచారణ చేసి తొలగించినా తమకు అభ్యంతరం ఉండేది కాదన్నారు. సస్పెండ్ పీరియడ్ ముగిసిన తర్వాత ఏడాది నుంచి తాను 50 సార్లు బ్యాంకు సీఈవోను సంప్రదించానని, ఆమె కూడా చాలా మందికి తన బాధను మొర పెట్టుకుందన్నారు.
ఆమె వికలాంగురాలని, భర్త ఆరోగ్యం కూడా సరిగా లేదని, రూ.50 లక్షలు అతని వైద్యం కోసం ఖర్చు చేసిందని ఎమ్మెల్యే వివరించారు. కుటుంబమంతా ఇబ్బందుల్లో ఉండటంతో ఆమె ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో తన వద్దకు వచ్చిందని పేర్కొన్నారు. దీనిపైనే తాను ఫోన్‌లో అడిగితే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనుచరుడు సంపత్‌రెడ్డి, సీఈవో కలసి రికార్డు చేశారని, మాట్లాడుతున్న సందర్భంలో దొర్లిన పదాన్ని పట్టుకొని ఉద్దేశపూర్వకంగా రచ్చ చేస్తున్నారని మండిపడ్డారు. బాధితురాలు తన బంధువు కాదని.. సామాన్య వ్యక్తని, అందుకే ఆమెకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడానని వీరేశం వివరణ ఇచ్చారు. ఆమెకు న్యాయం జరిగే వరకు తోడ్పాటును అందిస్తానన్నారు. విలేకరుల సమావేశంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
అన్యాయంపై ప్రజాప్రతినిధిగా మాట్లాడా!
Published Tue, Dec 12 2017 2:25 AM | Last Updated on Tue, Dec 12 2017 2:25 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment