![BRS Leader KTR On Chalo Kamareddy for BC Reservation](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/KTR-4.jpg.webp?itok=H0mWLPCO)
కాంగ్రెస్ ‘కామారెడ్డి డిక్లరేషన్’ను గుర్తుచేసేందుకు సభ
నేటి నుంచి క్షేత్రస్థాయిలో బీసీ చైతన్య సభలు
సాక్షి, హైదరాబాద్: కులగణన పేరుతో బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని బీఆర్‌ఎస్ ఆరోపించింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ‘కామారెడ్డి డిక్లరేషన్’లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అక్కడే ‘చలో కామారెడ్డి’ పేరిట భారీ సభ నిర్వహించాలని నిర్ణయించింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అధ్యక్షతన ఆదివారం తెలంగాణ భవన్‌లో పార్టీ బీసీ నేతల సమావేశం జరిగింది. సుమారు 500 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని ప్రభుత్వం నెరవేర్చేలా ఒత్తిడి తెచ్చేందుకు త్వరలో చలో కామారెడ్డి సభను నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయించారు.
ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు వారం రోజులపాటు మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో సమావేశాలు, ప్రెస్‌మీట్లు నిర్వహించాలని తీర్మానించారు. ఈ నెలాఖరులో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. ఆ సభకు అంతరాయం కలగకుండా చలో కామారెడ్డి సభ నిర్వహించాలని నిర్ణయించారు. కాగా, కేటీఆర్ సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని కోస్గిలో రైతుల సభలో పాల్గొననున్నారు.
కులగణన నివేదిక ఒక చిత్తు కాగితం
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన తప్పుల తడక అని కేటీఆర్ విమర్శించారు. పార్టీ బీసీ నేతల సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రీసర్వే చేసి కులాలవారీగా కచ్చితమైన లెక్కలు తీయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీల జనాభాను 5.5 శాతం తక్కువగా చూపించి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని మోసం చేసిందని విమర్శించారు. కులగణన నివేదిక చిత్తుకాగితంతో సమానమని అన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు, ఇండ్ల కేటాయింపులు, ఆరు గ్యారంటీల్లో తమ వాటా తగ్గుతుందేమోనని ఎంబీసీలు, బీసీలు భయపడుతున్నారని కేటీఆర్ అన్నారు. ‘కాంగ్రెస్ ఎమ్మెల్సీయే కులగణన సర్వేను చిత్తు కాగితంతో సమానమని తగులబెట్టారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు తీసుకొస్తారని భావించాం. బిల్లు తేలేదు కానీ.. సొల్లు మాత్రం చెప్పారు’ అని కేటీఆర్ మండిపడ్డారు.
బీసీలకు న్యాయం చేసింది బీఆర్‌ఎస్ మాత్రమే
రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేసింది బీఆర్‌ఎస్ మాత్రమేనని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు 50 శాతానికి పైగా టికెట్లు ఇచ్చామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో 34 సీట్లు బీసీలకు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, 19 సీట్లు మాత్రమే ఇచ్చిందని తెలిపారు.
బీసీలకు జరుగుతున్న అన్యాయంపై సోమవారం నుంచి నియోజకవర్గాలు, మండలాలు, జిల్లా కేంద్రాల వారీగా ప్రజలను చైతన్యం చేస్తామని ప్రకటించారు. బీసీలకు న్యాయం చేయడానికి రాజ్యాంగ సవరణ ఎందుకు చేయటం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment