UNESCO World Heritage
-
కజిరంగా నేషనల్ పార్కులో మోదీ విహారం
జోర్హాట్: అస్సాంలోని ప్రఖ్యాత కజిరంగా నేషనల్ పార్కు, టైగర్ రిజర్వ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. శుక్రవారం సాయంత్రం అస్సాం చేరుకున్న మోదీ శనివారం ఉదయం ఈ పార్కులో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్యాంట్, షర్టు, జాకెట్, హ్యాట్ ధరించారు. ‘ప్రద్యుమ్న’ అనే ఏనుగుపై స్వయంగా విహరించారు. ఇక్కడి ప్రకృతి అందాలను, వన్యప్రాణులను ప్రత్యక్షంగా తిలకించి పరవశించిపోయారు. వాటిని తన కెమెరాలో బంధించారు. దాదాపు రెండు గంటలపాటు పార్కులో గడిపారు. ఎలిఫెంట్ సఫారీ, జీపు సఫారీని ఆనందించారు. ‘యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్’ అయిన కజిరంగా జాతీయ ఉద్యానవనాన్ని మోదీ సందర్శించడం ఇదే మొదటిసారి. ఏమాత్రం అలసట లేకుండా వనంలో ఉత్సాహంగా కలియదిరిగారు. జీపుపై విహారిస్తూ అధికారులను ఇక్కడి విశేషాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చాలా జంతువులు ఆయన కంటబడ్డాయి. మూడు ఏనుగులకు మోదీ తన చేతులతో చెరుకు గడలు తినిపించారు. ఫారెస్టు గార్డులు ‘వనదుర్గల’తో, ఏనుగు మావటీలతో, అటవీ శాఖ అధికారులతో మాట్లాడారు. ఖడ్గ మృగాలకు ప్రసిద్ధి చెందిన కజిరంగా నేషనల్ పార్కులో పెద్దసంఖ్యలో గజరాజులు, ఇతర అరుదైన వన్య ప్రాణులు ఉన్నాయని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. సంబంధిత చిత్రాలను కూడా పంచుకున్నారు. వనదుర్గలు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. -
షార్ట్‌కట్ అని 'గ్రేట్ వాల్ ఆఫ్ చైనా'నే కూల్చేశారు
బీజింగ్: ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన 'గ్రేట్ వాల్ ఆఫ్ చైనా' ఆ దేశానికి ప్రహారి గోడ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా వారికి తొట్టతొలి గుర్తింపు సాధించిన చారిత్రాత్మక కట్టడం కూడా. అలాంటిది రాకపోకలకు అడ్డంగా ఉందని ఈ గోడకు ఏర్పడ్డ చిన్న సందుని పెద్దది చేసే ప్రయత్నంలో భారీగా తవ్వేశారు ఇద్దరు ఆగంతకులు. గ్రేట్ వాల్ అయితే ఏంటి? చైనాలోని ఉత్తర షాక్సి ప్రావిన్స్‌లో, యూయు కౌంటీ సమీపంలోని యాంగ్‌క్యాన్హె టౌన్షిప్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ 38 ఏళ్ల వ్యక్తి, 55 ఏళ్ల మహిళ ఇక్కడికి సమీపంలో ఒక నిర్మాణ కాంట్రాక్టును తీసుకున్నారు. అయితే వారి రాకపోకలకు అడ్డంకిగా నిలవడంతో పాటు యంత్ర సామాగ్రిని నిర్మాణ స్థలానికి తరలించడానికి గ్రేట్ వాల్ అడ్డుగా ఉంది. దీనివలన వారు పని చేసుకునే చోటికి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేది. దీంతో వారిద్దరు కలిసి యంత్రాల సాయంతో గ్రేట్‌వాల్‌ను కొంతవరకు కూల్చేశారు. షార్ట్‌కట్ అని.. ఆగస్టు 24న స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కూల్చేసిన గోడను చూసి విభ్రాంతికి గురయ్యారు. కేవలం షార్ట్‌కట్‌గా ఉపయోగపడుతుందన్న ఒకేఒక్క కారణంతో నిందితులు చైనా ప్రతిష్టకు ప్రతీకగా నిలిచిన భారీ గోడ సమగ్రతకు సుస్థిరతకు తీవ్రనష్టం కలిగించారన్నారు. ఇరువురిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. చారిత్రాత్మకం.. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మాణం క్రీస్తుపూర్వం 200లోనే ప్రారంభమైనప్పటికీ ఇప్పుడున్న కట్టడాన్ని నిర్మించింది మాత్రం మింగ్ వంశీయులే. క్రీస్తుశకం 1368-1644 సమయంలో దీని నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక కట్టడమైన ఈ గోడను యునెస్కో వారు వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించారు. ఈ చారిత్రక కట్టడాన్ని చూసేందుకు నేటికీ ప్రపంచ దేశాల నుంచి టూరిస్టులు ఇక్కడికి తరలివస్తుంటారు. 🚜 In the Chinese province of Shanxi, locals destroyed a section of the Great Wall of China with an excavator, — Sohu During interrogation, the man and woman admitted that they worked at a construction site nearby, and thus wanted to shorten the way to work. The ruined section… pic.twitter.com/2enLL69y7H — UNEWS (@UNEWSworld) September 4, 2023 ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్షుని భార్యకు కరోనా.. బైడెన్ జీ20 పర్యటనపై సందిగ్ధత.. -
దేశంలో అత్యంత నెమ్మెదిగా నడిచే రైలు ఇదే.. అయినా ‘యూనెస్కో’ గుర్తింపు
చెన్నై: ఒక రైలు తన ప్రయాణం మొదలు పెట్టిందంటే.. అది గమ్యం చేరేందుకు గరిష్ఠ వేగంతో దూసుకెళ్తుంది. వందే భారత్, రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయని తెలుసు. కానీ, దేశంలో అత్యంత నెమ్మదిగా నడిచే రైలు ఏదో తెలుసా? అసలు అలాంటి ఓ ట్రైన్ ఉంటుందని ఊహించారా? అవునండీ నిజమే ఉంది. అది కేవలం గంటకు 10 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణిస్తుంది. కానీ, అది యునెస్కో వారసత్వ సంపద జాబితాలో చోటు సంపాదించింది. అదే తమిళనాడులోని ‘మెట్టుపాలయం ఊటీ నీలగిరి ప్యాసెంజర్ ట్రైన్’. ఈ ట్రైన్ ప్రత్యేకతలు ఓసారి తెలుసుకుందాం. భారత్‌లో అత్యంత నెమ్మెదిగా నడిచే ట్రైన్‌గా ఈ రైలు ప్రసిద్ధిగాంచింది. అత్యంత వేగంగా నడిచే రైలుతో పోలిస్తే.. ఇది 16 రెట్లు నెమ్మదిగా వెళ్తుందంటే నమ్మశక్యం కాదు. ఐదు గంటల్లో కేవలం 46 కిలోమీటర్లు ప్రయాణించి గమ్యం చేరుకుంటుంది. అయితే, అందుకు ప్రధాన కారణం అది కొండ ప్రాంతంలో నడవటమే. ఐక్యరాజ్య సమితి విభాగం యునెస్కో ఈ రైలును ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. యునెస్కో ప్రకారం.. నీలగిరి మౌంటెయిన్ రైల్వే లైన్ నిర్మాణం కోసం 1854లో తొలుత ప్రతిపాదన చేశారు. కానీ, కొండల్లో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులతో వాయిదా పడుతూ వచ్చింది. చివరకు 1891లో పనులు ప్రారంభం కాగా.. 1908లో పూర్తయ్యాయి. The slowest train goes uphill at the speed of 10 kilometers per hour You can jump off the train, light up a smoke, take few drags and climb on the train again. It’s the Mettupalayam Ooty Nilgiri Passenger train. pic.twitter.com/DHyFKe3cbp — Gouthama Venkata Ramana Raju Chekuri (@gouthamaraju) May 2, 2020 ఆహ్లాదానిచ్చే రైడ్.. ఐఆర్టీసీ ప్రకారం.. ఈ రైలు చాలా సొరంగాల గుండా ప్రయాణిస్తుంది. 46 కిలోమీటర్ల ప్రయాణంలో 100కుపైగా వంతెనలను దాటుతుంది. పెద్ద పెద్ద రాళ్లు, లోయలు, తేయాకు తోటలు, పచ్చని కొండల అందాలు ఆహ్లాదానిస్తాయి. మెట్టుపాలయం నుంచి కూనూర్ మధ్య సుందరమైన దృశ్యాలు కనిపిస్తాయి. ప్రధాన స్టేషన్లు.. నీలగిరి మౌంటెయిన్ రైల్వే ప్రతిరోజు మెట్టుపాలయం నుంచి ఊటీ వరకు సేవలందిస్తుంది. రోజు ఉదయం 7.10 గంటలకు ఈ రైలు మెట్టుపాలయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు ఊటీకి చేరుకుంటుంది. తిరిగి ఊటీలో 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.35 గంటలకు మెట్టుపాలయంకు చేరుకుంటుంది. ఈ రూట్లో ప్రధానంగా కూనూర్, వెల్లింగ్టన్, అరవన్‌కుడు, కెట్టి, లవ్‌డేల్ వంటి స్టేషన్లు వస్తాయి. ఈ రైలులో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అని రెండు రకాల కంపార్ట్మెంట్లు ఉంటాయి. ఫస్ట్ క్లాస్‌లో తక్కువ సంఖ్యలో సీట్లు ఉంటాయి. డిమాండ్ పెరిగిన క్రమంలో 2016లో నాలుగో బోగీని జత చేసింది రైల్వే శాఖ. టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి? నీలగిరి మౌంటెయిన్ రైల్వేలో ప్రయాణించేందుకు ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. హాలీడేస్, వీకెండ్లో పర్యటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇదీ చదవండి: ఏనుగుతో ఫోటోకు కొత్త జంట పోజు.. చిర్రెత్తి కుమ్మిపడేసిందిగా! -
150 ఏళ్లు పట్టేదట! కానీ.. కేవలం 18 ఏళ్లలోనే.. !!
భారతీయ సంప్రదాయం ఉట్టిపడే ఎన్నో దేవాలయాల గురించి తెలుసుకుని ఉంటారు. సైన్స్‌కు అంతుచిక్కని గుళ్లు కూడా చాలానే ఉన్నాయి. ఐతే ఇప్పుడు మీరు తెలుసుకోబోయే దేవాలయానికి మాత్రం తాజ్‌మహల్‌కు ఉన్నంత చరిత్ర ఉంది. చదవండి: ఎడమచేతివాటం వారు ఈ విషయాల్లో నిష్ణాతులట.. మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు..! మహారాష్ట్రకు చెందిన ఔరంగాబాద్‌లోని ఎల్లోరా గుహల్లో కైలాష్ దేవాలయం ఉంది. మీరు తెలుసుకోబోయేది ఈ దేవాలయం గురించే!! దాదాపు 4 లక్షల టన్నుల కొండను తొలిచి నిర్మించిన ఏకశిలా దేవాలయమట ఇది. ఈ దేవాలయం పూర్తి నిర్మాణానికి 18 యేళ్లు పట్టిందని ఆర్కియాలజిస్టుల నివేదికలు తెల్పుతున్నాయి. నిజానికి అప్పట్లో చాలా త్వరగానే ఈ దేవాలయం నిర్మాణం పూర్తి చేశారట. ఎందుకంటే అంత పెద్ద కొండను తొలచడం అంత మామూలు విషయం కాదు. 7 వేల కూలీలు 150 సంవత్సరాలు రాత్రింబగళ్లు కష్టపడితే తప్ప అది సాధ్యంకాదని ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఎంటంటే.. ఇక్కడ ఒక్క పూజారి కూడా కనిపించడు. అసలింతవరకు ఇక్కడ పూజలే జరగలేదట కూడా. ఈ దేవాలయాన్ని నిర్మించిన రాజు హిమాలయాల్లో ఉన్న శివున్ని దర్శించుకోలేని వారు ఇక్కడి కేశవుడ్ని దర్శించుకున్నట్లేననే నమ్మకంతో నిర్మించినట్లు నానుడి. కాగా 1983లో ఈ దేవాలయాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది. చదవండి: డ్రీమ్ హౌస్ షిఫ్టింగ్.. సముద్రంపై పడవలతో గమ్యానికి చేర్చి..! -
AP: యునెస్కో ప్రమాణాలకు తీసిపోని కళా వైభవం
మూడు వేల ఏళ్లనాటి కూచిపూడి నృత్య కళ.. తొమ్మిది శతాబ్దాల క్రితం ఎర్రమల కొండల్లో నిర్మించిన గండికోట.. 16వ శతాబ్దం నాటి లేపాక్షి ఆలయం.. గాలిలో తేలియాడే రాతి స్తంభం.. కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయం.. 550 ఏళ్లనాటి తిమ్మమ్మ మర్రిమాను.. కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని రాక్ గార్డెన్.. విభిన్న వృక్ష, జంతు జాతులకు ఆలవాలమైన శేషాచల అడవులు వంటి సహజసిద్ధ ప్రదేశాలు.. తరగని వారసత్వ సంపదలతో ఏపీ చారిత్రక, సాంస్కృతిక, భౌగోళిక, జీవ వైవిధ్యాలను చాటుతోంది. వీటిని యునెస్కో ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్ది ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగేశ్వరస్వామి ఆలయం శతాబ్దాల నాటి కట్టడాలు.. అపూర్వ శిల్ప సోయగాలు.. సహజసిద్ధ ప్రదేశాలు.. సంప్రదాయ కళలు.. సాంస్కృతిక వైభవాలు.. అరుదైన స్మారక చిహ్నాలతో మన రాష్ట్రం భౌగోళిక, జీవ వైవిధ్యాలను చాటుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దశాబ్దాలుగా ఆక్రమణలకు, నిరాదరణకు గురైన వాటిని పరిరక్షించి కొత్త శోభ అద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టబోతోంది. ఈ క్రమంలోనే ప్రాధాన్యతా జాబితాలో అగ్రస్థానంలో కడప జిల్లాలోని గండికోట (గ్రాండ్ కేనియాన్ ఆఫ్ ఇండియా), అనంతపురంలోని లేపాక్షి (వీరభద్ర స్వామి) ఆలయం ప్రపంచ వారసత్వ హోదా దక్కించుకునేందుకు సమాయత్తమవుతున్నాయి. వారసత్వ నిపుణులు, పురావస్తు శాస్త్రవేత్తలు యునెస్కో ప్రమాణాలకు అనుగుణంగా వాటిని తీర్చిదిద్ది వాటికి ప్రపంచ వారసత్వ హోదా సాధించే దిశగా అడుగులు వేస్తున్నాయి. అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఆలయం బౌద్ధ స్థూపాలు.. బెలూం, బొర్రా గుహలు కూడా.. రాష్ట్రంలోని మూడు స్థూపాలు, కట్టడాలను ఆదర్శ సంరక్ష పథకం కింద కేంద్ర ప్రభుత్వం పరిరక్షించనుంది. గుంటూరు జిల్లానాగార్జున కొండలోని బౌద్ధ స్థూపాలు, శ్రీకాకుళంలోని శాలిహుండంలో బౌద్ధ అవశేషాలు, అనంతపురంలోని లేపాక్షి ఉన్నాయి. వీటిలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా వైఫై, ఫలహార శాల, వ్యాఖ్యాన కేంద్రం, బ్రెయిలీ సంకేతాలు తదితర సౌకర్యాలను సమకూర్చనున్నారు. ఇటీవల కట్టడాలను అభివృద్ధి చేయడంలో భాగంగా గండికోటను కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ దత్తత తీసుకున్న విషయం విదితమే. ఇక కర్నూలులోని బెలూం గుహలు, విశాఖ జిల్లాలోని బొర్రా గుహలు, శ్రీకాకుళం జిల్లాలోని 8–10వ శతాబ్దంలో నిర్మించిన శ్రీముఖలింగేశ్వరాలయం అద్భుత శిల్పకళకు సజీవ సాక్ష్యంగా నిలుస్తూ వారసత్వ హోదాకు పోటీపడుతున్నాయి. కర్నూలు జిల్లా ఓర్వకల్లు రాక్ గార్డెన్ యునెస్కో ప్రమాణాలు ఇలా.. ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేరాలంటే యునెస్కో సూచించిన 10 ప్రమాణాల్లో ఏదో ఒక దానికి సరిపోల్చాలి. 2, 3, 4 ప్రమాణాల ప్రకారం వాస్తు, శిల్పకళ, సాంకేతికత, స్మారక కట్టడాలు, కళలు, పట్టణం–ప్రణాళిక, ప్రకృతి దృశ్యం, సంస్కృతి–సంప్రదాయం, నాగరికత, మానవ చరిత్రలో గొప్ప నిర్మాణాలు ఉండాలి. 7, 8, 9 ప్రమాణాల ప్రకారం అద్భుతమైన, అసాధారణమైన సహజ సౌందర్యం, ప్రాంతాలు, స్థల చరిత్ర భౌగోళిక సాక్ష్యాలు, సముద్ర పర్యావరణ వ్యవస్థలు, జీవ వైవిధ్యం వారసత్వ హోదాకు ప్రాథమిక అర్హతను నిర్ణయిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 1,154 ప్రదేశాలు, కట్టడాలు యునెస్కో జాబితాలో ఉన్నాయి. వీటిలో భారతదేశంలోని 32 సాంస్కృతిక, చారిత్రక కట్టడాలు, ఏడు సహజసిద్ధ ప్రదేశాలు, ఒకటి మిశ్రమ జాబితాలో వారసత్వ హోదాను పొందాయి. కడప జిల్లాలోని గండికోట గ్రాండ్ కేనియన్ గార్జ్ వ్యూ ప్రణాళికతోనే యునెస్కో గుర్తింపు ఏపీలోని లేపాక్షి, గండికోట, ఒంటిమిట్ట, శాలిహుండం, శ్రీముఖ లింగేశ్వరాలయం, బెలూం గుహలు, తిమ్మమ్మ మర్రిమాను వంటి వాటికి యునెస్కో జాబితాలో చేరడానికి అన్ని అర్హతలున్నాయి. ప్రపంచ వారసత్వ కేంద్ర నియమాల ప్రకారం తొలుత ఈ ప్రతిపాదిత కట్టడాలు తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకోవాలి. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం వివరణాత్మక నివేదికను తయారు చేసి కేంద్ర పురావస్తు శాఖ ద్వారా దేశంలోని ప్రపంచ వారసత్వ కేంద్రానికి పంపాలి. వారు పరిశీలించి ప్రతిపాదిత ప్రదేశాల్లో సంరక్షణ మరమ్మతులు, ఆక్రమణల తొలగింపు వంటివి చేపడితే యునెస్కో గుర్తింపు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. – ఈమని శివనాగిరెడ్డి, పురావస్తు పరిశోధకుడు,సీఈవో ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ అనంతపురం జిల్లాలో తిమ్మమ్మమర్రిమాను యునెస్కో ప్రమాణాలకు సరితూగేవి ఇవే.. క్రీ.శ 1,123లో నిర్మించిన గండికోట ఎర్రమల కొండల్లో అద్భుతమైన ఒంపుతో పెన్నా నది హొయల మధ్య సహజసిద్ధ ప్రకృతి సౌందర్యంతో యునెస్కో ప్రమాణాన్ని నెరవేరుస్తోంది. 16వ శతాబ్దంలో నిర్మించిన లేపాక్షి ఆలయం అద్భుత శిల్పకళతో.. గాలిలో తేలియాడే రాతి స్తంభం నిర్మాణంతో గొప్ప కట్టడంగా వారసత్వ ప్రమాణాలకు సరితూగుతోంది. కడప జిల్లా ఒంటిమిట్ట ఆలయం మూడు గోపురాలు.. 160 అడుగుల ఎత్తైన ముఖద్వారంతో అద్భుత నిర్మాణంగా అలరారుతోంది. ఆలయ మధ్య మండపంలో 32 స్తంభాలున్న మండపం చోళ, విజయనగర శిల్ప శైలిని పోలి ఉంటుంది. ఇది కూడా యునెస్కో ప్రమాణాలతో సరితూగుతోంది. కూచిపూడి నృత్య కళ, కూచిపూడి కళాకారుల జీవనం యునెస్కో 6వ ప్రమాణం ప్రకారం కళాత్మక జీవన విధానం, సరికొత్త ఆలోచనలు, సంప్రదాయ కళ, ప్రపంచ ప్రాముఖ్యతకు సరిపోలుతోంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద మర్రి చెట్టు అనంతపురం జిల్లా కదిరి సమీపంలోని తిమ్మమ్మ మర్రిమాను యునెస్కో సహజసిద్ధ, జీవ వైవిధ్యం, భౌగోళిక పరిమాణం, పర్యావరణ ప్రమాణాలకు తగ్గట్టుగా 4.721 ఎకరాల్లో విస్తరించింది. దాదాపు 550 ఏళ్లనాటి ఈ వృక్షం 1,110 ఊడలను కలిగి ఉంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని రాక్ గార్డెన్, విభిన్న వృక్ష, జంతు జాతులకు ఆలవాలమైన శేషాచల అడవులు సహజసిద్ధ, జీవ వైవిధ్య ప్రమాణానికి దగ్గరగా ఉంది. -
Ramappa Temple: అలా జరిగితే యునెస్కో గుర్తింపునకు దెబ్బ!
ఎక్కడపడితే అక్కడ పసుపు–కుంకుమలు చల్లినా.. దీపం వెలిగించిన నూనె మరకలు కనిపించినా.. అగరుబత్తి పొగతో మసిబారినా.. రామప్ప ప్రపంచ వారసత్వ హోదా రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. యునెస్కో నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ఇకపై జాగ్రత్తలు అత్యవసరం. ‘రామప్ప’కు యునెస్కో గుర్తింపు వచ్చిన సందర్భంగా కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. ప్రపంచ హోదా వచ్చిన సంతోషాన్ని కాదనలేం. కానీ వచ్చిన గుర్తింపును చేతులారా పోగొట్టుకునే పనులే సరికాదు. ఇలాంటివి యునెస్కో ప్రతినిధుల కంటపడితే గుర్తింపు రద్దు చేసే ప్రమాదం ఉంటుంది మరి. సాక్షి, హైదరాబాద్: రామప్ప రుద్రేశ్వరాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద హోదా తెలుగువారిని మురిపి స్తోంది. దశాబ్దాలపాటు సాగిన ఎదురు చూపులు ఇప్పుడే ఫలిస్తున్నాయి. ఇలాంటి సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ‘గుర్తింపు’ కోల్పోయే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇంతకాలం ఓ పద్ధతంటూ లేకుండా సాగిన వ్యవహా రంలో ఇప్పుడు మార్పులు రాకుంటే చేతులారా హోదా కోల్పోయినట్టు అవుతుంది. ఎంతో కసరత్తుతో..: రామప్ప ఆలయానికి గుర్తింపు ఇచ్చే ముందు యునెస్కో చేసిన కసరత్తు అంతా ఇంతా కాదు. యునెస్కో అనుబంధ సంస్థ ఐకొమాస్ ప్రతినిధి 3 రోజుల పాటు రామప్పలోనే మకాం వేసి మొత్తం గుడి, పరిసరాలను జల్లెడ పట్టారు. ప్రతి అంశాన్ని నోట్ చేసు కుని నివేదిక రూపొందించారు. ఆ తర్వాత రామప్ప ఆలయం ఇతర కట్టడాల కంటే ఎందుకు, ఎంత ప్రత్యేకమైనదో గుచ్చిగుచ్చి వివరాలు సేకరించారు. ఆ తర్వాతే గుర్తింపుపై ముందడుగు పడింది. యునెస్కో నిబంధనల ప్రకారం.. పురాతన కట్టడం ప్రత్యేకతలకు భంగం కలిగే ఏ చిన్న మార్పు చేసినా, కట్టడం దెబ్బతిన్నా ‘వారసత్వ గుర్తింపు’ను వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. అందు కోసం యునెస్కో ప్రతినిధులు ఆకస్మికంగా సంబంధిత ప్రదేశాలను తనిఖీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు రామప్ప ఆలయంలోనూ అలా తనిఖీలు చేయనున్నారు. అందువల్ల యునెస్కో గుర్తింపును కాపాడుకోవడానికి అత్యంత శ్రద్ధ పెట్టాల్సి ఉండనుంది. ఏటా కొనసాగుతున్న నిర్లక్ష్యం.. రామప్ప శివాలయం కావటంతో కార్తీక మాసంలో భక్తులు తండోపతండాలుగా వస్తారు. ఆలయం ప్రాంగణాన్ని దీపాలతో నింపేస్తారు. కొంతకాలంగా స్థానిక ఏఎస్ఐ అధికారుల చర్యలతో ఇది కాస్త తగ్గినా.. దీపాల జాతర, ఆలయంలో ఎక్కడపడితే అక్కడ కొబ్బరికాయలు కొట్టడం, విగ్రహాలపై పసుపు, కుంకుమలు, విభూతి చల్లడం వంటివి జరుగుతున్నాయి. ఇక ముందు ఇవన్నీ యునెస్కో గుర్తింపునకు సమస్యతగా మారే అవకాశం ఉంది. అయితే భక్తుల మనోభావాలకు ఇబ్బంది కలగకుండా యునెస్కో కొన్ని విధివిధానాలు రూపొందించింది. వాటిని ఆచరించేలా చూసుకుంటే చాలు. పూజలు అందుకునే విగ్రహాల వద్ద, అర్చకులు పసుపుకుంకుమలు, పూలతో పూజ చేయవచ్చు. అక్కడే దీపాలు వెలిగించాలి. ఇతరచోట్ల అలా చేయకూడదు. ►పండుగల సమయంలో ఆలయంపై ఇష్టం వచ్చినట్టుగా విద్యుద్దీపాలు అమర్చకూడదు. ►కట్టడానికి వంద మీటర్ల పరిధిని నిషేధిత ప్రాంతంగా యునెస్కో నిబంధన ఉంది. ఆ పరిధిలో తాత్కాలిక నిర్మాణాలు కూడా జరగటానికి వీల్లేదు. కానీ రామప్ప గుడి పక్కనే తరచూ సభలు, సమావేశాలు, రాజకీయ ఉపన్యాస కార్యక్రమాలు, నృత్య కార్యక్రమాలు చేపడుతుంటారు. అవి కుదరదు ►నిషేధిత ప్రాంతానికి అవతల మరో వంద మీటర్ల ప్రాంతాన్ని నియంత్రిత పరిధిగా భావిస్తారు. ఆ పరిధిలో నిబంధనల ప్రకారం అనుమతి పొంది కొన్ని కార్యకలాపాలు నిర్వహించవచ్చు. అవి ఆలయానికి ఏమాత్రం ఇబ్బంది కలిగించేవిగా ఉండకూడదు. సమన్వయం అత్యవసరం.. రామప్ప ఆలయం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ‘ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)’ పరిధిలో ఉంది. ఆలయం విస్తరించి ఉన్న 20 ఎకరాల ప్రాంతంలో అన్నింటినీ ఏఎస్ఐ పర్యవేక్షిస్తుంది. దాని వెలుపల అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర విభాగాల మధ్య పూర్తి సమన్వయం అవసరం. ►ఆలయంలో పూజాదికాలు రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలో ఉంటాయి. ఇవి కూడా ఏఎస్ఐ విధివిధానాలకు లోబడే ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం రామప్ప వద్ద మ్యూజియం, ధ్యానకేంద్రం, శిల్పారామం సహా పలు కట్టడాలు నిర్మించే యోచనలో ఉంది. అవి ఏఎస్ఐ నిబంధనల ప్రకారమే జరగాలి. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర విభాగాల మధ్య సమన్వయం లోపిస్తే.. యునెస్కో గుర్తింపు రద్దుకు దారితీసే అవకాశం ఉంటుంది. ►రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే యునెస్కో సూచన మేరకు పాలంపేట డెవలప్మెంట్ అథారిటీ, రాష్ట్రస్థాయిలో ముఖ్య విభాగాలతో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసింది. ఇవన్నీ కూడా సమన్వయంలో పనిచేయాలి. ►ఆలయం పరిధిలో గతంలో విప్పదీసి పెట్టిన కాటేశ్వరాలయాన్ని 2024 నాటికి పునర్నిర్మిస్తామని ఏఎస్ఐ లిఖితపూర్వకంగా యునెస్కో దృష్టికి తెచ్చింది. దాన్ని పూర్తి చేయాలి. ►భక్తులకు వసతులు, రోడ్ల నిర్మాణం, జీవ వైవిధ్యానికి ఇబ్బంది లేని పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సి ఉంది. వీటిని వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలి. యునెస్కో సూచించిన ఈ పనుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం జరిగినా గుర్తింపుపై దెబ్బపడుతుంది. చిన్న వంతెన కడితే.. ‘గుర్తింపు’ పోయింది డ్రెస్డన్ ఎల్బ్ వ్యాలీ.. జర్మనీలోని ఓ చారిత్రక నగరం. యునెస్కో 2004లో దానికి కల్చరల్ ల్యాండ్‌స్కేప్‌గా ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చింది. 16–20 శతాబ్దాల మధ్య జరిగిన అద్భుత చారిత్రక నిర్మాణాలు ఆ నగరానికి ప్రత్యేక ఆకర్షణ. కానీ అక్కడి ప్రభుత్వం, అధికారుల మధ్య సమన్వయం లోపించింది. ట్రాఫిక్ సమస్యకు విరుగుడు అంటూ అక్కడ కొత్తగా ఓ వంతెన కట్టారు. దీంతో ఆ ప్రాంత విశిష్టతకు భంగం కలిగిందంటూ యునెస్కో గుర్తింపును ఉపసంహరించుకుంది. -
Ramappa Temple: రూ. 100 కోట్లతో అభివృద్ధి..
ఆడిటోరియం, కాటేజీలు, కట్టకు రెండువైపులా గ్రీనరీ ఏర్పాటు.. ఇలా రామప్ప ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా కేంద్రానికి రాష్ట్ర సర్కార్ పంపిన రామప్ప ఆలయ అభివృద్ధి నమూనా చిత్రం ఇది. చరిత్రాత్మక రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా ప్రకటనకు ముందు ఆలయంతోపాటు సరస్సు కట్ట, రామప్ప సరస్సు ఐలాండ్‌ను రూ.100 కోట్లతో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నమూనా చిత్రాలను కేంద్రానికి ప్రతిపాదించినట్లు తెలిసింది. ములుగు జిల్లా వెంకటాపురం (ఎం) మండలంలోని రామప్ప ఆలయం దగ్గర ఆడిటోరియం, కాటేజీలు, సరస్సు కట్టపై శివాలయం టెంపుల్, కట్టకు రెండువైపులా గ్రీనరీ ఏర్పాటు చేయడం, ఐలాండ్‌లో భారీ శివుడి విగ్రహం, పిల్లల పార్క్, కాటేజీలను ఏర్పాటు చేయనున్నట్లు నమూనా చిత్రాలను తయారు చేసి పంపినట్లు సమాచారం. అయితే ఈ విషయం అధికారికంగా ఎవరూ వెల్లడించడం లేదు. –వెంకటాపురం (ఎం) -
‘రామప్ప సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు’
సాక్షి, హైదరాబాద్: రామప్పకు యునెస్కో వారసత్వ గుర్తింపు సాధనలో సీఎం కేసీఆర్ కృషి ఎంతో ఉందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ గుర్తింపుతో రామప్ప ఆలయం ప్రపంచ పర్యాటక ప్రాంతం అవు తుందన్నారు. బుధవారం ప్రగతిభవన్‌లో పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కేటీఆర్‌ను కలిశారు. రామప్ప ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు ఎర్రబెల్లి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి రామప్ప ఆలయం చిత్రపటాన్ని బహూకరించారు. కేటీఆర్‌ను కలసిన వారిలో పార్టీ రాష్ట్ర సోషల్‌మీడియా కన్వీనర్ వై.సతీశ్‌రెడ్డి, లింగాలఘణపురం జెడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి ఉన్నారు. -
అందరి చూపు... రామప్ప వైపు..!
దాదాపు 200 సంవత్సరాల పాటు సుస్థిర పాలనను అందించి, వర్తక, వాణిజ్య, వ్యవసాయాభివృద్ధితో పాటు, సాహిత్యం, సంగీతం, శిల్పం, చిత్రలేఖనాలను పోషించిన కాకతీయులు తెలుగునాట, ప్రత్యే కించి తెలంగాణలో వేయికి పైగా దేవాలయాలను నిర్మించారు. హన్మ కొండలోని వేయి స్తంభాలగుడి, వరంగల్ కోటలోని శంభుని గుడి, ఘనపూర్‌లోని కోటగుళ్లు, పాలంపేటలోని రామప్ప దేవాలయం కాకతీయ శిల్పకళా కౌశలానికి అద్దంపడుతున్నాయి. కాకతీయ చక్రవర్తి గణ పతిదేవుని సైనాధ్యక్షుడైన రేచర్ల రుద్రారెడ్డి పాలంపేటలో తన పేరిట రుద్రేశ్వర ఆలయాన్ని, సముద్రాన్ని తలపించే చెరువును క్రీ.శ.1213లో నిర్మించాడు. పరచుకొన్న పచ్చటి తివాచీలాంటి ప్రకృతి ఒడిలో, అందాన్ని మరింత ఇనుమడింపజేసే కొండపానుపుల దిగువనున్న పాలంపేటలో తాను కూడా తన ప్రభువు మాదిరే శివునికి ఒక వినూత్నమైన ఆలయాన్ని నిర్మించా లనుకొని, అనువైన స్థలాన్ని ఎంపిక చేసుకొన్నాడు. తానొక అద్భుత ఆలయాన్ని నిర్మించాలనుకుంటున్నానని, కాకతీయ సామ్రాజ్యానికే మణిమకుటంగా ఆ ఆలయం భాసిల్లాలనీ తన తలంపును ప్రకటించాడు. ఇక అంతే! అద్భుత ఆలయాల నిర్మాణంలో సిద్ధహస్తులైన కాకతీయ శిల్పులు, అప్ప టివరకూ అందుబాటులో ఉన్న ఆలయాలకు భిన్నంగా, ఒక అపురూప దేవాలయాన్ని బట్టపై చిత్రించి, కొయ్యలో నమూనా దేవాలయాన్ని చెక్కి చూపించారు. మునుపటి కళ్యాణీ చాళుక్య దేవాలయాల వాస్తునే ఎంచుకొన్నా, నిర్మాణం వరకే ఆ శైలికి పరిమితమై, ఎల్తైన ఉపపీఠంలో మరిన్ని వరుసలు చేర్చి, తమ ప్రయోగ పరం పరలో సాటిలేని మేటి భూమిజ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఏమంత లోతు లేని పునాదుల్ని రచించి, ఆధారశిలతో ప్రారంభించి, నక్షత్రాకారపు ఉపపీఠాన్ని ప్రద క్షిణాపథంగా తీర్చిదిద్దారు. కట్టడభాగాలకు పాలంపేట, రామానుజపురం మధ్యలో గల ఎర్ర ఇసుకరాతిని, ద్వారాలు, రంగమంటప స్థంభాలు, దూలాలు, మధ్య కప్పులు, రుద్రేశ్వర శివలింగపానపట్టాలు, నంది వాహనం, రంగ మండపం ముందుభాగంలో చుట్టూ మదనికలు, అలసకన్యలు, నాగినులు, సురసుందరీమణులను బోలిన అందాలొలికే అప్సరసలాంటి యువతుల శిల్పాలను నల్ల శానపు రాతితోనూ, కప్పుపైన శిఖరా (విమానా)న్ని నీళ్లపై తేలియాడే ఇటుకలతో నిర్మించబోతున్నామని వివరించగా, రుద్రుడు, చిరునవ్వుతో ఆమోదాన్ని తెలిపాడు. అపురూప ఆలయ రూపురేఖల గురించి విన్న గణపతి దేవచక్రవర్తి, మహారాణి సోమలదేవి, ప్రధానులు, మహా ప్రధానులు ఎప్పుడు పూర్తవుతుందా అని ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. ఎర్ర ఇసుక రాయి స్థానికంగానే దొరికినా, ద్వారాలకు స్తంభాలకు కావలసిన నల్ల శానపు రాతిని ఖమ్మం చుట్టు పక్కల నుంచి తరలించాల్సి రావటంతో మండప నిర్మాణం కొంత ఆలస్యమైంది. విమానానికి కావలసిన సున్నాన్ని ఏటూరు నాగారం నుంచి, తేలికపాటి ఇటుకల కోసం చెరువు అడుగుభాగం మట్టిని తెచ్చి, రంపపు పొట్టు, ఊక, తుమ్మ చెక్క, కరక్కాయలు, బెల్లం కలిపి, బాగా కలియదొక్కి, ఇటుక పెళ్లలను పోతపోసి, ఆవంలలో కాల్చి సిద్ధం చేసుకొన్నారు. చిన్నదైనా మన్నికగల అధి ష్ఠానాన్ని రచించి, ఎల్తైన గోడలు, వాటిపై పొలాల్లో రైతులు వేసుకునే మంచె లాంటి కోష్టాలను, వాటిపైన శిఖరం, కలశాలతో అలంకరించారు. గోడలపైన కప్పు భాగంలో బాగా విస్తరించిన ప్రస్తరకపోతాన్ని తీర్చిదిద్ది, వర్షపు నీరు ఆలయ గోడలపై పడకుండా జాగ్రత్తలు తీసుకొని, నిర్మాణ పరంగా ఆధునిక ఇంజనీర్లకు ఏమాత్రం తీసిపోమని కాక తీయ శిల్పులు ఆనాడే నిరూపించారు. తెలంగాణ దేవాలయాల్లో మేటి, కాకతీయ కళా కౌశలానికి మచ్చుతునక రామప్ప దేవాలయం. సార్వత్రిక కళా నైపుణ్యంతో, అబ్బురపరచే సాంకేతిక పరిజ్ఞానానికి, మేధో మథనమందించిన సృజనాత్మకతకు నిదర్శనంగా ప్రపంచ దృష్టినాకర్షించి, తెలంగాణ తల్లి కీర్తి కిరీటంలో మణి మకుటంగా వెలుగొందుతూ ప్రపంచ వారసత్వ కట్టడాల జాబి తాలో చోటును దక్కించుకొంది. ప్రతి తెలుగువాడికీ గర్వ కారణమైంది. రామప్ప ఎవరో తెలియదుగానీ, అన్నీ తానై అపురూప ఆలయాన్ని సృష్టించిన రేచర్ల రుద్రసేనాని, 31–3–1213న ఆలయంలో తన పేరిట రుద్రేశ్వరుని ప్రతిష్టించి, చరిత్రలో మిగిలిపోయాడు. విశ్వకర్మ దిగొచ్చి రామప్ప అవతారమెత్తి, రేచర్ల రుద్రునితో భూలోక పుష్పకాన్ని మనకందించి, తర తరాల తెలుగువారి కీర్తికి స్ఫూర్తిగా నిలిచాడు. - ఈమని శివనాగిరెడ్డి వ్యాసకర్త స్థపతి, సీఈవో, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్. -
రామప్పకు వారసత్వ హోదా: చిరు వ్యాపారుల్లో టెన్షన్ టెన్షన్
సాక్షి, వెంకటాపురం(వరంగల్): చారిత్రాత్మక రామప్ప దేవాలయానికి వారసత్వ హోదా వచ్చిందని సంతోషించాలో.. బాధపడాలో తెలియని పరిస్థితుల్లో స్థానిక చిరు వ్యాపారులు ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా ఆలయం ముందు చిరు వ్యాపారాలు పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్న వారికి యునెస్కో ప్రతిపాదన జీవనోపాధి దూరం చేసింది. ఆలయానికి సుమారు 100 మీటర్ల దూరంలో ఎలాంటి దుకాణాలు, కట్టడాలు ఉండకూడదనేది యునెస్కో ప్రధాన నిర్ణయం. ఈ ఆంశం ఆధారంగానే వేయిస్తంభాలగుడి, వరంగల్ కోట కట్టడాలు తిరస్కరణకు గురయ్యాయి. రామప్ప ఆలయాన్ని యునెస్కో గుర్తింపు కోసం కేంద్రం డోషియార్ (రామప్ప సమగ్ర వివరాలతో కూడిన పుస్తకం)ను తయారు చేసి ప్రతిపాదించింది. ఈ క్రమంలో డోషియార్‌లో పొందుపరిచిన విషయాలను క్షేత్రస్థాయిలో పరీశీలించేందుకు 2019 సెప్టెంబర్‌లో యునెస్కో ప్రతినిధి వాసు పోశ్యానందన పర్యటన ఖరారైంది. దీంతో రామప్ప ఆలయం ముందు ఉన్న చిరు వ్యాపారుల కట్టడాలను కూల్చివేసి దుకాణాలను తొలగించారు. యునెస్కో ప్రతినిధి పర్యటన పూర్తయ్యాక ఆలయానికి దగ్గరలో ఉన్న పార్కింగ్ స్థలంలో తాత్కాలికంగా దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు అధికారులు అనుమతించారు. ఆలయానికి వచ్చిన పర్యాటకులు పార్కింగ్ స్థలంలో ఉన్న దుకాణాల వద్దకు వెళ్లి కోనుగోలు చేయకపోవడంతో వ్యాపారం సరిగా జరగలేదు. దీంతో ఆలయం ముందు దుకాణాలు ఏర్పాటు చేసుకునేలా అనుమతి ఇవ్వాలని, లేదా తూర్పు ముఖద్వార రోడ్డు వద్ద పర్మనెంటుగా స్థలాలను కేటాయించాలని జిల్లా కలెక్టర్‌తోపాటు మంత్రులకు మొరపెట్టుకున్నప్పటికి ఫలితం లేకుండాపోయింది. ప్రస్తుతానికి కొంతమంది ఆలయం ముందు తాత్కాలికంగా దుకాణాలు ఏర్పాటు చేసుకొని కాలం వెళ్లదీస్తుండగా, మరికొంతమంది కూలీ పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నారు. స్థలం కేటాయించాలి రామప్పకు యునెస్కో ప్రతిపాదన పంపడంతో అధికారులు దుకాణాలను తీసివేయించారు. రెండేళ్లుగా వ్యాపారం చేయకుండా తీవ్రంగా నష్టపోయాం. దుకాణాలను తొలగించే సమయంలో పర్మినెంట్‌గా దుకాణాదారులకు స్థలాలు కేటాయిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఇప్పటికైనా అధికార యత్రాంగం స్పందించి రామప్పలోని చిరువ్యాపారులకు రామప్ప తూర్పు ముఖద్వారం వైపు స్థలాలు కేటాయించాలి. – పిల్లలమర్రి శివ, రామప్ప చిరువ్యాపారుల సంఘం అధ్యక్షుడు కూలీ పనులకు వెళుతున్నా.. రామప్పకు వచ్చే పర్యాటకులకు బొమ్మలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవాడిని. ఆలయం ముందు ఉన్న దుకాణాన్ని తొలగించడంతో కూలీ పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. పర్యాటకులను నమ్ముకొని 28 మంది చిరు కుటుంబాలకు జీవనోపాధి దొరికేది. ప్రస్తుతం వీరంతా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ అధికారులు మాకు ఒక శాశ్వత పరిష్కారం చూపాలి. – పోశాల రాజమౌళి, బొమ్మల దుకాణదారుడు, రామప్ప -
ఇలాంటివి కుతూహలం కలిగిస్తాయి: విజయ్ దేవరకొండ
తక్కువ టైంలో దక్కిన క్రేజ్‌ను నిలబెట్టుకుంటూ ప్యాన్ ఇండియన్ లెవల్‌కు వెళ్లిపోయాడు ‘రౌడీ హీరో’ విజయ్ దేవరకొండ. ప్రస్తుతం పూరీ డైరెక్షన్లో లైగర్‌తో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో.. తాజాగా ఓరుగల్లు ఘనత మీద ట్విటర్లో ఒక పోస్ట్ చేశాడు. ‘చరిత్ర గురించి ఎప్పుడూ ఒక కుతూహలం ఉంటుంది. 800 సంవత్సరాల చరిత్ర, కాకతీయ సామ్రాజ్యపు వైభవపు గుర్తు రామప్ప గుడి ప్రపంచ వారసత్వ హోదా రేసులో నిలబడింది’ అంటూ ఓ ట్వీట్ చేశాడు. అలా సొంత నేల చారిత్రక ఘనతపై తన ఆసక్తిని ప్రదర్శించాడు. Have always been very intrigued by the historic past.. The 800 year old Ramappa Temple built by the Kakatiya dynasty is now in the race for world heritage status! https://t.co/ItwPIoDdXe — Vijay Deverakonda (@TheDeverakonda) July 10, 2021 కాగా, అద్భుత శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయం అంతర్జాతీయ ఖ్యాతికి ఆమడ దూరంలో నిలిచింది. కొత్తగా వరల్డ్ హెరిటేజ్ ప్రాంతాలను గుర్తించేందుకు యూనెస్కో బృందం జులై 16న సమావేశమవుతోంది. రామప్ప గుడి గనుక ఈ ఘనత సాధిస్తే తెలంగాణలోనే మొట్టమొదటి ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేరుతుంది. జులై 24-26 మధ్య డబ్ల్యూహెచ్‌సీ కమిటీ వోటింగ్ మీదే మిగతాదంతా ఆధారపడి ఉంటుంది. చదవండి: రామప్ప గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసా? -
ఒక్క మెట్టు ఎక్కితే ‘వారసత్వ’ హోదా!
వెబ్‌డెస్క్: అద్భుత శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయం అంతర్జాతీయ ఖ్యాతికి ఆమడ దూరంలో నిలిచింది. కొత్తగా వరల్డ్ హెరిటేజ్ ప్రాంతాలను గుర్తించేందుకు యూనెస్కో బృందం జులై 16న సమావేశమవుతోంది. కాకతీయ వైభవం వరంగల్ కేంద్రంగా తెలుగు ప్రాంతాలను పాలించిన కాకతీయులు ఎన్నో అద్భుతమైన కట్టడాలను నిర్మించారు. వరంగల్ ఖిల్లా, వేయిస్థంభాలగుడి, పానగల్ దేవాలయం, గొలుసుకట్టు చెరువులు ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే వీటన్నింటీలో ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని రామప్ప దేవాలయం ప్రత్యేకంగా నిలిచింది. అందుకే ఈ కట్టడానికి వారసత్వ హోదా తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. జులై 16న ప్రపంచంలోని చారిత్రక కట్టడాలు, ప్రదేశాలకు హెరిటేజ్ హోదా ఇచ్చే యునెస్కో హెరిటేజ్ కమిటీ 2021 జులై 16న చైనా కేంద్రంగా వర్చువల్ సమావేశం నిర్వహించనుంది. సమావేశంలో 21 సభ్య దేశాల ప్రతినిధులు పాల్గొని వారసత్వ హోదా ప్రదానంపై ఆన్లైన్లోనే తమ ఓట్లు వేయనున్నారు. 16న జరిగే రామప్ప ఆలయానికి హోదా రావాలంటే మెజారిటీ ఓట్లు రావాల్సి ఉంటుంది బరిలో 255 కట్టడాలు ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 167 దేశాలకు చెందిన 1,121 కట్టడాలు, ప్రదేశాలు యునెస్కో జాబితాలో ఉండగా భారతదేశం నుంచి 38 కట్టడాలకు, ప్రదేశాలకు చోటుదక్కింది. ప్రస్తుతం ప్రపంచం నలుమూలల నుంచి 255 కట్టడాలు, ప్రదేశాలు యునెస్కో గుర్తింపు కోసం పోటీ పడుతున్నాయి. భారతదేశం నుంచి 2020 సంవత్సరానికి గాను రామప్ప దేవాలయాన్ని ప్రతిపాదించగా, 2021 సంవత్సరానికి గాను గుజరాత్ రాష్ట్రంలోని హరప్పా నాగరికతలో భాగమైన ధోలవీర ఆలయాన్ని ప్రతిపాదించారు. శిల్పి పేరుతోనే కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి సేనాధిపతి అయిన రేచర్ల రుద్రుడు శివుని మీద ఉన్న ఆపారమైన భక్తితో 1213లో రామప్ప ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయాన్ని నిర్మించేందుకు 40 ఏళ్ల సమయం పట్టింది. ఈ ఆలయ నిర్మాణ బాధ్యతలు రామప్ప అనే శిల్పి చేపట్టాడు. ఇప్పుడు ఈ ఆలయం ఆయన పేరునే ప్రాచుర్యంలోకి వచ్చింది. శాండ్బాక్స్ టెక్నాలజీ రామప్ప ఆలయాన్ని నిర్మించి 808 ఏళ్లు కావస్తున్నప్పటికీ చెక్కు చెదరకుండా చూపరులను ఆకర్షిస్తోంది. ఈ ఆలయ నిర్మాణంలో శాండ్ బాక్స్ టెక్నాలజీని ఉపయోగించారు. అంటే ఇసుకపై ఆలయాన్ని నిర్మించారన్నమాట. మూడు మీటర్ల లోతు పునాది తవ్వి అందులో పూర్తిగా ఇసుకను నింపి దానిపై రాళ్లను, శిలలను పేర్చుకుంటూ పోయి ఆలయాన్ని నిర్మించారు. నీటిపై తేలియాడే ఇటుకలు ఆలయ గోపురం బరువు తగ్గించేందుకు తేలికైన ఇటుకలు ఉపయోగించారు. వీటిని ప్రత్యేక పద్దతిలో తయారు చేశారు. ఈ ఇటుకలు నీటిలో తేలియాడుతాయి. సాధారణంగా నిర్మాణంలో వినియోగించే ఇటుకలు 2.2 సాంద్రతను కలిగి ఉంటాయి. రామప్ప ఆలయ గోపురానికి వాడిన ఇటుకల సాంద్రత కేవలం 0.8 . దీంతో ఇవి నీటిలో తేలియాడుతాయి. ఇలాంటి ఇటుకలతో దేశంలో మరెక్కడా నిర్మాణాలు లేవని చరిత్రకారులు చెబుతున్నారు. ఇంజనీరింగ్ విశేషాలు ఆలయానికి లేత ఎరుపువర్ణం కలిగిన అరుదైన రాయిని వినియోగించడంతో నిర్మాణం చెక్కుచెదరకుండా ఉండటానికి కారణంగా పేర్కొంటున్నారు. కట్టడం బరువు ఎక్కువగా ఉన్న చోట తేలికగా ఉండే గ్రానైట్, డోలమైట్, బ్లాక్ గ్రానైట్లను వినియోగించి ఆలయాన్ని నిర్మించడం రామప్ప శిల్పికే సాధ్యమైంది. శిల్పకళ ఆలయం నలువైపులా ఉన్న మదనికల శిల్పాలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. బ్లాక్ గ్రానైట్ రాయిపై చెక్కిన మదనికల సొగసు వర్ణణాతీతం. ఇక ఆలయం నలువైపులా ఆనాటి కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా ఈజిఫ్టు, మంగోలియన యాత్రికుల శిల్పాలు అబ్బరు పరుస్తాయి. ఇక ఆలయం లోపల నాట్యమంటపం ఆనాటి శిల్ప కళా వైభవానికి తార్కాణంలా నిలిచిపోతుంది. సూది బెజ్జం సందుతో అతి సూక్ష్మమైన శిల్పాలు ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. ఐదేళ్ల శ్రమ రామప్ప ఆలయాన్ని యునెస్కో జాబితాలో చోటు కల్పించేందుకు కాతీయ హెరిటేజ్ ట్రస్ట్, ఇన్టాక్ వరంగల్ చాప్టర్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐదేళ్లుగా కృషి చేస్తున్నాయి. దీంతో 2017లో యూనెస్కో హెరిటేజ్ సైట్ టెంటిటీవ్ లిస్టులో చోటు సాధించింది. ఆ తర్వాత ఐకోమాస్ (ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్) సభ్యుడు, యునెస్కో ప్రతినిధి వాసు పోశ్యానందన (థాయ్‌లాండ్) 2019 సెప్టెంబర్‌లో ఆలయాన్ని సందర్శించారు. ప్రతి ఆంశాన్ని క్షుణ్ణంగా పరీశీలించి రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపునకు కావాల్సిన అర్హతలు ఉన్నాయంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రామప్ప ఆలయానికి సంబంధించిన సమగ్ర వివరాలతో కూడిన పుస్తకం (డోషియర్) రూపొందించి యూనెస్కోకు సమర్పించారు. ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి యునెస్కో గుర్తింపుకోసం రామప్ప ఆలయాన్ని ప్రతిపాదించడంతో, దీనిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్‌లతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఉన్నత స్థాయి బృందం జూన్ 24న ఢిల్లీకి వెళ్లింది. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చేలా కృషి చేయాలని కోరుతూ కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌కు వినతిపత్రం అందించింది. అలాగే ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆలయంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పలు అభివృద్ధి పనులు చేపట్టారు. చరిత్రకు సత్కారం ఈ హోదా లభిస్తే ఘనమైన కాకతీయుల చరిత్రకు ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కుతుంది. ఆలయం పూర్తిగా యునెస్కో అధీనంలోకి వెళుతుంది. ప్రత్యేకంగా నిధులు అందే అవకాశంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు, ఆలయంతో పాటు ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అవకాశం కలుగుతుంది. యునెస్కో గుర్తింపు నేపథ్యంలో విదేశీ పర్యాటకులు పెరుగుతారు. స్థానికులకు అన్ని విధాలా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. -
జైపూర్‌కు ‘వారసత్వ’ గుర్తింపు
న్యూఢిల్లీ: పింక్ సిటీగా పేరు పొందిన రాజస్తాన్ రాజధాని జైపూర్‌కు ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్ర, సాంస్కృతిక మండలి (యునెస్కో) ప్రపంచ వారసత్వ నగరం గుర్తింపు లభించింది. మధ్యయుగపు రాజరిక సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన జైపూర్ ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతంగా ప్రపంచ గుర్తింపు పొందింది. జైపూర్‌ను ప్రపంచ వారసత్వ నగరాల్లో చేరుస్తున్నట్లు యునెస్కో శనివారం ట్వీట్టర్లో ప్రకటించింది. అజర్బైజాన్ రాజధాని బాకులో జరుగుతున్న యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 43వ వార్షిక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. యునెస్కో ఇప్పటి వరకు 167 దేశాలకు చెందిన 1,092 ప్రాంతాలను వారసత్వ స్థలాలుగా గుర్తించింది. యునెస్కో వారసత్వ ప్రాంతాలు, కట్టడాలు, సహజ నిర్మాణాల్లో అత్యధికంగా ఇటలీలో 54, చైనాలో 53, భారత్‌లో 37 ఉన్నాయి. నిర్మాత రెండో జయసింగ్ యునెస్కో జైపూర్‌ను వారసత్వ నగరంగా గుర్తించడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. క్రీస్తు శకం 1727లో అంబర్ మహారాజు రెండో జయ సింగ్ ఈ నగరాన్ని నిర్మించాడు. తన రాజధానిని అంబర్ నుంచి జైపూర్‌కు మార్చాడు. 16వ శతాబ్దం నాటి అంబర్ కోట, గులాబీ రంగు ఇసుక రాతి కట్టడమైన హవామహల్, ఖగోళ విజ్ఞాన కేంద్రం జంతర్‌మంతర్ వంటిని పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. తన రాజధాని ఆతిథ్యానికి చిహ్నంగా నిలవాలన్న తలంపుతో జైపూర్ మహారాజు రాంసింగ్ నగరంలోని కట్టడాలన్నింటికీ గులాబీ రంగు వేయించాడని చెబుతారు. అందుకే దీనిని గులాబీ (పింక్)నగరంగా పిలుస్తారు. గుర్తిస్తే ఏమవుతుంది? ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్‌కు చెందిన 21 దేశాల అధికారుల బృందం 2018లో జైపూర్‌ను పరిశీలించింది. ఆ బృందం వారసత్వ స్థలాల జాబితాలో చేర్చవచ్చని సూచించింది. బాకులో జరుగుతున్న సమావేశం ఆ ప్రతిపాదనను పరిశీలించి, జైపూర్‌కు వారసత్వ హోదా ఇవ్వాలని నిర్ణయించింది. దీనిద్వారా మానవ సంస్కృతీ వికాసానికి నిదర్శనంగా నిలిచిన ఈ ప్రాంతం పరిరక్షణ బాధ్యతలను యునెస్కో చేపడుతుంది. మనుషులు, జంతువులు ఈ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించకుండా, స్థానిక పరిపాలనా యంత్రాంగం నిర్లక్ష్యానికి గురి కాకుండా కాపాడుతుంది. ఇందుకు అవసరమైన నిధులను ప్రపంచ వారసత్వ నిధి సమకూరుస్తుంది. -
యునెస్కో వారసత్వ జాబితాలో మానస సరోవరం
న్యూఢిల్లీ: భారత భూభాగంలోని మానస సరోవర్‌ను ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చేందుకు ఐక్యరాజ్య సమితికి చెందిన అనుబంధ సంస్థ ‘యునెస్కో’ అంగీకారం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ అధికారికంగా వెల్లడించింది. ఏప్రిల్‌లో భారత పురావస్తు విభాగం పంపిన ప్రతిపాదనలపై ఈ మేరకు ఆమోదముద్ర లభించినట్లు వివరించింది. కైలాస సరోవర్ ప్రాంతంలో ఎక్కువ భాగం భారత్‌లో విస్తరించి ఉండగా... మిగతా భాగం తూర్పున నేపాల్, ఉత్తరాన చైనా ఉంది. ఈ మూడు దేశాల్లో కలిపి 31 చ.కిలో మీటర్ల ప్రాంతంలో ఈ పవిత్రస్థలం ఉంది. తమ దేశాల్లోని ప్రాంతాలను కూడా వారసత్వ స్థలంగా గుర్తించాలని యునెస్కోకు చైనా, నేపాల్ ఇప్పటికే ప్రతిపాదనలు పంపాయి. -
విక్టోరియన్ గోథిక్‌కు గౌరవం
ముంబై/న్యూఢిల్లీ: ముంబైకి మరో చారిత్రక గుర్తింపు దక్కింది. నగరంలోని విక్టోరియన్ గోథిక్ (19వ శతాబ్దం), ఆర్ట్ డెకో (20వ శతాబ్దం) నిర్మాణ శైలుల్లో నిర్మించిన కట్టడాలకు యునెస్కో ప్రపంచ చారిత్రక కట్టడాల జాబితాలో స్థానం దక్కింది. ఇప్పటికే ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్ (2004), ఎలిఫెంటా గుహలు (1987) ఈ జాబితాలో ఉన్నాయి. బెహరైన్లోని మనామాలో జరుగుతున్న యునెస్కో ప్రపంచ చారిత్రక కమిటీ (డబ్ల్యూహెచ్‌సీ) 42వ సమావేశంలో భాగంగా శనివారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘డబ్ల్యూహెచ్‌సీ సైట్ల జాబితాలో ముంబైలోని విక్టోరియన్ గోథిక్, ఆర్ట్ డెకో నిర్మాణ శైలిలకు చోటుదక్కింది. భారత్‌కు అభినందనలు’ అని యునెస్కో ట్వీట్ చేసింది. 21 దేశాలు ఏకగ్రీవంగా.. ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ అభా నారాయణ్ లాంబా.. విక్టోరియన్ గోథిక్, ఆర్ట్ డెకో కట్టడాలకు సంబంధించిన చారిత్రక వివరాలను, గొప్పదనాన్ని రూపొందించి యునెస్కోకు నామినేషన్‌గా పంపారు. జాబితాలో ఈ2కట్టడాలకు చోటు దక్కడం భారత్‌కు, ముంబైకి దక్కిన గౌరవంగా ఆమె పేర్కొన్నారు. జాబితా రూపకల్పన సమయంలో డబ్ల్యూహెచ్సీలోని 21 సభ్యదేశాలు ఏకగ్రీవంగా ఈ రెండు కట్టడాలకు ఓటు వేశాయి. యునెస్కో నిర్ణయాన్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ మహేశ్ శర్మ, చరిత్రకారుడు రఫీక్ బగ్దాదీ, ఆర్కియాలజిస్టు కురుశ్ దలాల్ సహా చారిత్రక ప్రముఖులు స్వాగతించారు. తాజా నిర్ణయంతో భారత్‌లో ఉన్న డబ్ల్యూహెచ్‌సీ కట్టడాల సంఖ్య 37కు చేరింది. 1200 పేజీల నామినేషన్ ముంబైలోని ఓవల్ మైదాన్ దగ్గర్లోని చాలా భవనాలు విక్టోరియన్ గోథిక్ శైలిలో కట్టినవే. పాత సచివాలయం (1857–74), యూనివర్సిటీ లైబ్రరీ, కన్వెన్షన్ హాల్ (1874–78), బాంబే హైకోర్టు (1878), ప్రజాపనుల శాఖ కార్యాలయం (1872), వాట్సన్ హోటల్ (1869), డేవిడ్ ససూన్ లైబ్రరీ (1870), ఎల్ఫిన్‌స్టోన్ కాలేజ్ (1888) గోతిక్ శైలిలోని భవనాలే. నామినేషన్లను 1200 పేజీలతో మొత్తం మూడు అధ్యాయాలుగా పంపించారు. ఇందులో ఫొటోగ్రాఫ్‌లు, డ్రాయింగ్లు, వీటి ప్రత్యేకతలు ఉన్నాయి. చారిత్రక కట్టడాల జాబితాలో జపాన్, కొరియాలకు చెందిన కట్టడాలకూ చోటు దక్కింది. దేనికదే వైవిధ్యం విక్టోరియన్ గోథిక్ శైలిలో ప్రభుత్వ భవనాలు ఎక్కువగా ఉన్నాయి. ముంబై యూనివర్సిటీ, పాతసెక్రటేరియట్, పశ్చిమ రైల్వే ప్రధాన కార్యాలయం, బాంబే హైకోర్టు, ఛత్రపతి శివాజీ మహారాజ్ యూనివర్సిటీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియం, మహారాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం తదితర భవనాలు ఈ స్టైల్లో ఉన్నాయి. దాదాపు దక్షిణ ముంబైలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన భవనాలు ఈ శైలివే. ఇలాంటి భవనాల నిర్మాణంలో తెలుగు కాంట్రాక్టర్లు కీలక పాత్ర పోషించారు. ఆర్ట్ డెకో శైలిలో భవంతులు, నివాస స్థలాలున్నాయి. మెరీన్ డ్రైవ్ పరిసరాల్లోని భవనాల్లో ఈ శైలి ఎక్కువగా కనబడుతుంది. బాడ్గే బాజార్ లోని క్రికెట్ క్లబ్ ఇండియా (సీసీఐ) కూడా ఈ శైలిలో నిర్మించిందే. ద రీగల్, ఎరోస్ సినిమా భవనాలు, మెరీన్ డ్రైవ్‌లోని మొదటి వరసలోని భవనాలకూ గుర్తింపు దక్కింది. -
విహారం...వినోదం...బావిలోనే!
ఇక్కడ కనిపించేది ఏడంతస్తుల మేడ కాదు. ఏడు నిలువుల లోతున్న బావి. పేరు రాణీ కీ వావ్. అంటే రాణి గారి బావి అని అర్థం. ఇది గుజరాత్‌లోని పఠాన్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో సరస్వతి నదీ తీరాన ఉంది. ఆ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్‌కు 130 కి.మీ.ల దూరం. ఈ బావిలోకి దిగడం ఓ విచిత్రం. అయితే, ఏ మెట్టు నుంచి నుంచి దిగామో తిరిగి అదే మెట్టుకు చేరడం అసాధ్యమే. నిజమే! ఒక చోట మొదలై తిరిగి అదే చోటుకు రావడం అంటే ఓ పజిల్ని పూరించినట్లే. ఏడు అంతస్తులలో ఏడు విశాలమైన వరండాలు, ఆ వరండాలకు ఆధారమైన స్తంభాల మీద అందమైన శిల్పాలు, చల్లటి గాలి... అన్నీ కలసి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కానీ 64 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, 27 మీటర్ల లోతున్న ఈ బావిలోకి దిగడం ఓ సాహసం. ఓసారి దిగిన తర్వాత ప్రపంచాన్ని జయించినంత గొప్ప అనుభూతి కలుగుతుంది. ఎవరిదీ ఆలోచన?! ఈ ప్రదేశాన్ని క్రీ.శ 11వ శతాబ్దంలో సోలంకి రాజవంశం పాలించింది. ఆ రోజుల్లో మొదటి భీమదేవుని జ్ఞాపకార్థం ఆయన భార్య రాణి ఉదయమతి దీనిని నిర్మించింది. అయితే ఇంత పెద్ద నిర్మాణం సరస్వతి నదికి వచ్చిన వరదల్లో మునిగి 1980 వరకు ఇసుక మేటలోనే ఉండిపోయింది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తవ్వకాల్లో బయట పడిన ఈ బావి గత ఏడాది జూన్‌లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో చేరింది. వందల ఏళ్లపాటు మట్టిలో ఉన్నప్పటికీ స్తంభాల మీదున్న శిల్పాలు చెక్కు చెదరలేదు. బుద్ధుడు, విష్ణువు, దశావతారాలు, కల్కి, రాముడు, మహిషాసురమర్దని, నరసింహుడు, వామన, వరాహ అవతారాలతోపాటు నాట్య భంగిమలో ఉన్న నాగకన్యలు... మొత్తం ఐదు వందల శిల్పాలున్నాయి. ఏడంతస్తుల నిర్మాణంలో సుమారు ఎనిమిది వందల శిల్పాలు చెక్కి ఉండవచ్చని అంచనా. ఇప్పుడు ఐదు అంతస్తులు మాత్రమే సరిగ్గా ఉన్నాయి. సాధారణంగా బావిలో దిగిన వాళ్లు ఆక్సిజన్ తగినంత అందక, ఎక్కువసేపు ఉండలేకపోతారు. కానీ ఈ నిర్మాణంలో మెట్లు దిగి కిందికి వెళ్లే కొద్దీ ఎటువంటి అసౌకర్యమూ ఉండదు. విశాలమైన వరండాలు, స్తంభాల మధ్య నుంచి గాలి సులువుగా ప్రసరించేటట్లు ఉంటుంది నిర్మాణశైలి. నాలుగో అంతస్తు నుంచి మరొక బావి అనుసంధానమై ఉంటుంది. పైన దీర్ఘచతురస్రాకారంలో, లోతుకు వెళ్లే కొద్దీ వలయాకారంగా ఉంటుంది. ఈ బావి ఎందుకంటే... గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇలాంటి బావులు ఎక్కువగా కనిపిస్తాయి. క్రీస్తు పూర్వం మూడు వేల ఏళ్ల నుంచి అనుసరిస్తున్న విధానం ఇది. భూగర్భ జలాలను రక్షించుకోవడానికి లోతైన బావులను తవ్వుతారు. వర్షపు నీరు చేరడానికి కాలువలు, చిన్న చిన్న తటాకాలను తవ్వుతారు. పనిలో పనిగా కొన్నింటిని విహారకేంద్రాలుగా మలచుకుంటారు. ఎండాకాలంలో ఇవి చక్కటి వేసవి విడుదులు. ఈ బావుల పరిసరాల నుంచి ఓ పది అడుగుల దూరంలో భానుడి తీవ్రత భరించలేనంత తీక్షణంగా ఉన్నప్పుడు కూడా దిగుడు బావి దగ్గర శీతల పవనాలు వీస్తుంటాయి. అప్పటి ఆర్కిటెక్టులకు నేచురల్ ఎయిర్ కండిషనింగ్ టెక్నాలజీ ఏదో తెలిసే ఉంటుంది. ఇన్ని తెలిసిన తర్వాత ఇలాంటి దిగుడుబావిలోకి తొంగి చూడని యువత ఉండదు. అలాగే పఠాన్‌లో తయారయ్యే పటోలా చీరల మీద మనసు పారేసుకోని మహిళ ఉండదు. ఇదే ట్రిప్‌లో మధేరాలోని సన్ టెంపుల్‌ను, దాని పక్కనే ఉన్న సూర్యకుండ్ను కూడా చూడవచ్చు. రాన్ ఆఫ్ కచ్‌లో ఫ్లెమింగోలను, ఎండకు కాంతులీనుతూ కళ్లను మిరుమిట్లు గొలిపే ఉప్పు కయ్యలను కూడా చూడచ్చు. అయితే ఇక్కడ ఒక కిలో ఉప్పు కొనడం కష్టమే. కనీసం నాలుగు కిలోలైనా కొనాలి. ఎందుకంటే కిలో ఉప్పు పావలా. ఇప్పుడు పావలాలే లేవు మరి!