విక్టోరియా గోథిక్ శైలిలోని బాంబే హైకోర్టు, ఆర్ట్ డెకో శైలిలో నిర్మించిన భవంతి
ముంబై/న్యూఢిల్లీ: ముంబైకి మరో చారిత్రక గుర్తింపు దక్కింది. నగరంలోని విక్టోరియన్ గోథిక్ (19వ శతాబ్దం), ఆర్ట్ డెకో (20వ శతాబ్దం) నిర్మాణ శైలుల్లో నిర్మించిన కట్టడాలకు యునెస్కో ప్రపంచ చారిత్రక కట్టడాల జాబితాలో స్థానం దక్కింది. ఇప్పటికే ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్ (2004), ఎలిఫెంటా గుహలు (1987) ఈ జాబితాలో ఉన్నాయి. బెహరైన్‌లోని మనామాలో జరుగుతున్న యునెస్కో ప్రపంచ చారిత్రక కమిటీ (డబ్ల్యూహెచ్‌సీ) 42వ సమావేశంలో భాగంగా శనివారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘డబ్ల్యూహెచ్‌సీ సైట్ల జాబితాలో ముంబైలోని విక్టోరియన్ గోథిక్, ఆర్ట్ డెకో నిర్మాణ శైలిలకు చోటుదక్కింది. భారత్‌కు అభినందనలు’ అని యునెస్కో ట్వీట్ చేసింది.
21 దేశాలు ఏకగ్రీవంగా..
ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ అభా నారాయణ్ లాంబా.. విక్టోరియన్ గోథిక్, ఆర్ట్ డెకో కట్టడాలకు సంబంధించిన చారిత్రక వివరాలను, గొప్పదనాన్ని రూపొందించి యునెస్కోకు నామినేషన్‌గా పంపారు. జాబితాలో ఈ2కట్టడాలకు చోటు దక్కడం భారత్‌కు, ముంబైకి దక్కిన గౌరవంగా ఆమె పేర్కొన్నారు. జాబితా రూపకల్పన సమయంలో డబ్ల్యూహెచ్‌సీలోని 21 సభ్యదేశాలు ఏకగ్రీవంగా ఈ రెండు కట్టడాలకు ఓటు వేశాయి. యునెస్కో నిర్ణయాన్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ మహేశ్ శర్మ, చరిత్రకారుడు రఫీక్ బగ్దాదీ, ఆర్కియాలజిస్టు కురుశ్ దలాల్ సహా చారిత్రక ప్రముఖులు స్వాగతించారు. తాజా నిర్ణయంతో భారత్‌లో ఉన్న డబ్ల్యూహెచ్‌సీ కట్టడాల సంఖ్య 37కు చేరింది.
1200 పేజీల నామినేషన్
ముంబైలోని ఓవల్ మైదాన్ దగ్గర్లోని చాలా భవనాలు విక్టోరియన్ గోథిక్ శైలిలో కట్టినవే. పాత సచివాలయం (1857–74), యూనివర్సిటీ లైబ్రరీ, కన్వెన్షన్ హాల్ (1874–78), బాంబే హైకోర్టు (1878), ప్రజాపనుల శాఖ కార్యాలయం (1872), వాట్సన్ హోటల్ (1869), డేవిడ్ ససూన్ లైబ్రరీ (1870), ఎల్ఫిన్‌స్టోన్ కాలేజ్ (1888) గోతిక్ శైలిలోని భవనాలే. నామినేషన్లను 1200 పేజీలతో మొత్తం మూడు అధ్యాయాలుగా పంపించారు. ఇందులో ఫొటోగ్రాఫ్‌లు, డ్రాయింగ్‌లు, వీటి ప్రత్యేకతలు ఉన్నాయి. చారిత్రక కట్టడాల జాబితాలో జపాన్, కొరియాలకు చెందిన కట్టడాలకూ చోటు దక్కింది.
దేనికదే వైవిధ్యం
విక్టోరియన్ గోథిక్ శైలిలో ప్రభుత్వ భవనాలు ఎక్కువగా ఉన్నాయి. ముంబై యూనివర్సిటీ, పాతసెక్రటేరియట్, పశ్చిమ రైల్వే ప్రధాన కార్యాలయం, బాంబే హైకోర్టు, ఛత్రపతి శివాజీ మహారాజ్ యూనివర్సిటీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియం, మహారాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం తదితర భవనాలు ఈ స్టైల్లో ఉన్నాయి. దాదాపు దక్షిణ ముంబైలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన భవనాలు ఈ శైలివే. ఇలాంటి భవనాల నిర్మాణంలో తెలుగు కాంట్రాక్టర్లు కీలక పాత్ర పోషించారు. ఆర్ట్ డెకో శైలిలో భవంతులు, నివాస స్థలాలున్నాయి. మెరీన్ డ్రైవ్ పరిసరాల్లోని భవనాల్లో ఈ శైలి ఎక్కువగా కనబడుతుంది. బాడ్గే బాజార్ లోని క్రికెట్ క్లబ్ ఇండియా (సీసీఐ) కూడా ఈ శైలిలో నిర్మించిందే. ద రీగల్, ఎరోస్ సినిమా భవనాలు, మెరీన్ డ్రైవ్‌లోని మొదటి వరసలోని భవనాలకూ గుర్తింపు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment