సాక్షి, ములుగు: కాకతీయుల అద్భుత శిల్పకళా సంపదకు నిలువుటద్దం రామప్ప దేవాలయం. ప్రపం చ వ్యాప్తంగా కీర్తిని పొందాయి ఇక్కడి శిల్పాలు. విభిన్న ఆకృతుల్లో తీర్చిదిద్దిన కళాఖండాలను తనివితీరా చూడాలంటే రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. 806 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయానికి విభిన్నమైన ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడి ఇటుకలు నీటిలో వేస్తే తేలియాడుతూ ఉంటాయి. ఇది ఇప్పటికీ అం తుపట్టని అద్భుతమని చెప్పుకోవచ్చు. ఆలయం ఎదుట ఉండే నందీశ్వరుడు ఏకశిలతో ఏర్పాటు చేయడంతో పాటు శివలింగానికి ఎదురుగా ఉండడం మరో ప్రత్యేకత.
సూర్యకాంతి నేరుగా గర్భగుడిలో పడి ప్రకాశవంతమైన వెలుతురును ప్రసరింపజేయడం శిల్పి గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఆలయం ముచ్చటగా మూడోసారి 2019 సంవత్సరానికి గాను వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున యునెస్కోకు నామినేట్ అయింది. ఇప్పటికే రెండుసార్లు (2017, 2018) రాష్ట్రం నుంచి అందించిన ప్రతిపాదనలో వివరాలు సరిగా లేవని తిరస్కరించబడింది. దేశం నుంచి ఒక చారిత్రక ప్రదేశానికి మాత్రమే అవకాశం ఉండడంతో ఈ రెండు సార్లు రాజస్థాన్ రాష్ట్రం యునెస్కో గుర్తింపు పొందింది.
పకడ్బందీగా ప్రతిపాదనలు..
రామప్ప ఆలయాన్ని ఇప్పటికే రెండు సార్లు యు నెస్కో తిరస్కరించడంతో పర్యాటక శాఖ అన్ని రకాల జాగ్రత్తలతో పకడ్బందీగా ప్రతిపాదనలు చేసింది. వచ్చే రెండు నెలల్లో ప్రభుత్వ ప్రతిపాదన యునెస్కో బెంచ్ ముందుకు వెళ్లనుంది. కాగా, ఈ దఫా రామప్ప ఆలయం మాత్రమే నా మినేట్ కావడంతో కచ్చితంగా గుర్తింపు లభిస్తుందని, వారసత్వ సంపదకు తగిన గౌరవం దక్కుతుందని భక్తులు, స్థానికులు ఆశిస్తున్నారు.
ప్రతిపాదనలు..
జిలాల్లోని వెంకటాపురం(ఎం) మండలంలోని రామప్ప ఆలయాన్ని క్రీస్తు శకం 1213లో కాకతీయ రాజు గణపతిదేవుడి కాలంలో సామంత రాజు రేచర్లరుద్రడు నిర్మించారు. ఆలయ నిర్మాణంలో భాగంగా బేస్‌మెంట్‌గా అరుదైన సాండ్ బాక్స్ టెక్నాలజీని వినియోగించారు. దీంతో పాటు ఆలయ పైభాగం నీటిలో తేలియాడే ఇటుకలతో నిర్మించారు.
అలాగే సరిగమపలు పలికే మ్యూజికల్ పిల్లర్, చిపురుపుల్ల దూరే విధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రంధ్రాలు, ఆ కాలంలో మహిళ హై హిల్స్ చెప్పులు, పేరిణీ నత్య భంగిమలు, రకరకాల రాళ్లను వినియోగించి, నృత్య భంగిమలతో కూడిన శిల్పాలను ఏర్పాటు చేయడం వంటి అంశాలను ప్రతిపాదనలో పొందుపర్చారు. సమీప రాజ్యాలతో వ్యాపార సంబంధాలు భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా ఆలయ గోడలపై శిల్పాలను చెక్కించడం, బెల్లం, కరక్కాయలతో కూడిన మిశ్రమంతో ఆలయాన్ని నిర్మించినట్లు ప్రభుత్వం తరఫున ప్రతిపాదనలు చేశారు.
పరిశీలన..
రామప్పకు యునెస్కో జాబితాలో చోటుదక్కడంలో భాగంగా ప్రతిపాదనల కోసం ఇటీవల ఆర్కాలజీ డైరెక్టర్ విశాలాక్షి, ఇంటాక్ట్ కన్వీనర్ పాండురంగారావుతో కూడిన బృందం ఆలయాన్ని సందర్శించి పర్యవేక్షించారు. ప్రతిపాదన యునెస్కో పరిశీలనలోకి వెళ్లిన అనంతరం మరోసారి ఆర్కాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) కేంద్ర బృంద సభ్యులు ఆలయాన్ని సందర్శించనున్నారు.
మెరుగపడనున్న సౌకర్యాలు..
ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో ఆలయానికి చోటు దక్కితే టూరిజం పరంగా ప్రపంచ దేశాల చూపు రామప్పవైపు మరలుతుంది. నిధుల కేటాయింపు నేరుగా జరుగుతుంది. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే అన్ని రకాల వసతులు, సౌకర్యాలు మెరుగుపడుతాయి.
షాపులను తొలగిస్తేనే..
రామప్ప ఆలయం యునెస్కో గుర్తింపు పొందాలంటే ఆలయ చుట్టు పక్కల 100మీటర్ల లోపు ఎలాంటి నిర్మాణాలు ఉండకూడదు. దీంతో పాటు మరో 200 మీటర్ల పరిధిలో అనుమతులు లేకుండా భవనాలు, ఇతర గృహాల నిర్మాణం చేపట్టకూడదు. అయితే ఆలయానికి వెళ్లే మార్గంలో ఇరువైపులా దుకాణాలు వెలిశాయి. గత రెండు సంవత్సరాలుగా షాపులను తొలగించే విషయంలో రెవెన్యూ, సంభందిత అధికారులు విఫలం అవుతున్నట్లు తెలుస్తోంది. యునెస్కో బృందం పరిశీలనకు వచ్చే సమయంలో దుకాణాలు ఇలాగే కొనసాగినట్లయితే ప్రతిపాదనలు తిరస్కరించబడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment