సాక్షి, హైదరాబాద్: నీటిలో తేలియాడే ఇటుకలను ప్రపంచానికి పరిచయం చేసిన ‘రామప్ప’కు యునెస్కో పట్టాభిషేకం చేసే తరుణం ఆసన్నమైంది. చార్మినార్, కుతుబ్‌షాహీ సమాధులకు ప్రపంచ వారసత్వ హోదా తిరస్కరించిన ఐక్యరాజ్యసమితి విద్య, విజ్ఞాన, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ఈసారి రామప్ప దేవాలయాన్ని పరిగణనలోకి తీసుకోనుంది. వచ్చే నెల 25న యునెస్కో బృందం రాష్ట్రానికి రానుంది. ఆ అద్భుత దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా కలి్పంచాల్సిందిగా 2017లో భారత ప్రభుత్వం యునెస్కోకు దరఖాస్తు చేసింది. దాని ప్రత్యేకతలు, అది అద్భుత నిర్మాణంగా మారటానికి అందులో నిగూఢమైన అంశాలను వివరిస్తూ డోషియర్ (దరఖాస్తు ప్రతిపాదన) దాఖలు చేసిన ఇంతకాలానికి దాన్ని పరిశీలించేందుకు ఆ సంస్థ రానుంది.
ఈ సారి వస్తుందనే ధీమా..
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ప్రపంచ వారసత్వ హోదా దక్కించుకున్న కట్టడాలు/ప్రాంతాలు ఏవీ లేవు. దీంతో రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో చారి్మనార్, గోల్కొండ, కుతుబ్‌షాహీ సమాధులను యూనిట్‌గా చేసి యునెస్కోకు దరఖాస్తు చేశారు. కానీ నగరానికి వచ్చిన ఆ సంస్థ ప్రతినిధులు అక్కడి కబ్జాలు చూసి అవాక్కయ్యారు. కట్టాడాల్లోకి చొచ్చుకొచ్చినట్లు ప్రైవేటు నిర్మాణాలుండటం, కట్టడాలకు అతి చేరువగా వాహనాలు వెళ్తుండటం, ఓ పద్ధతి లేకుండా దుకాణాలు వెలియటంతో గుర్తింపు ఇవ్వలేమని యునెస్కో తిరస్కరించింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం రామప్ప దేవాలయాన్ని యునెస్కో దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించి కేంద్రాన్ని కోరింది. దీంతో 2017లో కేంద్రం యునెస్కోకు దరఖాస్తు చేసింది. అయితే, ఆలయ ప్రత్యేకతలకు సంబంధించిన వివరాలు సరిగా లేవంటూ యునెస్కో తిప్పి పంపింది. యునెస్కో కన్సల్టెంట్ ప్రొఫెసర్, నర్తకి, ఆర్కిటెక్ట్ అయిన చూడామణి నందగోపాల్‌ను అధికారులు పిలిపించి ఆలయ ప్రత్యేకతలపై అధ్యయనం చేయించి ఆ వివరాలను యునెస్కోకు పంపారు. దాన్ని స్వీకరించిన యునెస్కో.. ఆ వివరాలు కచి్చతంగా ఉన్నాయో లేదో పరిశీలించేందుకు బృందాన్ని పంపుతోంది.
రామప్ప విశేషాలు..
ఇది రామలింగేశ్వరస్వామి దేవాలయం. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి హయాంలో సైన్యాధిపతి రేచర్ల రుద్రదేవుడు దీన్ని నిర్మించారు. ఆ ఆల యానికి శిల్పిగా వ్యవహరించి అద్భుత పనితనాన్ని ప్రదర్శించిన రామప్ప పేరుతోనే దేవాలయానికి నామకరణం చేశారు. ఇలా శిల్పి పేరుతో ఆలయం మన దేశంలో మరెక్కడా లేదు. క్రీ.శ.1213లో ఆలయ ప్రాణ ప్రతిష్ట జరిగిందని అక్కడి శాసనం చెబుతోంది. పూర్వపు వరంగల్ జిల్లా, ప్రస్తుత ములుగు జిల్లాలోని పాలంపేట గ్రామశివారులో ఈ ఆలయం ఉంది. ఆలయానికి చేరువలో రామప్ప పేరుతో పెద్ద చెరువు కూడా ఉంది. దానికి అనుబంధంగా కొన్ని ఉప ఆలయాలున్నా.. అవన్నీ పర్యవేక్షణ లేక శిథిలమయ్యాయి. కాగా, మన దేశంలో యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ కట్టడాలు 38 ఉన్నాయి.
అద్భుత నిర్మాణం..
- నర్తకి కళ్లముందే నృత్యం చేస్తున్నట్లు అనిపించేంత సహజంగా ఆలయంలో శిల్పాలు ఉంటాయి. ఆలయ స్తంభాలు, పైకప్పు, ఫ్లోర్‌పై చూడ చక్కని, అబ్బురపరిచే చెక్కడాలున్నాయి.
- దక్షిణ భారత్‌లో యునెస్కో గుర్తింపు పొందిన హంపి, హాలెబీడు, తంజావూరు ఆలయాలతో పోలుస్తూ చూడామణి నందగోపాల్ రామప్ప ప్రత్యేకతలను గుర్తించి నివేదించారు.
- హంపి, హాలెబీడు, తంజావూరులలో శిల్పాలను సిస్ట్ రాతిపై చెక్కారు. కానీ రామప్పలో కఠినంగా ఉండే డోలరైట్ రాతిపై చెక్కారు.
- శిల్పాలు అద్దం మాదిరిగా నునుపు తేలుతూ మెరుస్తూ ఉండటం నాటి శిల్పుల నిర్మాణ పనితనానికి నిదర్శనం.
- వెంట్రుక దూరేంతటి సన్నటి సందులతో కూడిన డిజైన్లు శిల్పాలపై ఉండటం దీని విశిష్టత.
- గర్భాలయ ప్రవేశ మార్గం పక్కన ఉండే వేణుగోపాలస్వామి శిల్పంపై మీటినప్పుడు సప్తస్వరా లు పలకటం నాటి పరిజ్ఞానాన్ని స్పష్టం చేస్తుంది.
- ఈ ఆలయానికి వాడిన ఇటుకలు నీటిలో తేలుతాయి. నిర్మాణ బరువును తగ్గించేందుకు ఈ ఇటుకలు రూపొందించారు.
- పూర్తి నల్లరాతితో ఆలయాన్ని నిర్మించారు. కానీ సమీపంలో ఎక్కడా అలాంటి రాళ్ల జాడ కనిపించదు. వేరే ప్రాంతం నుంచి ప్రత్యేకంగా ఆ రాళ్లను తెప్పించారన్నమాట.
- పేరిణి నృత్యం స్పష్టించేందుకు ఈ ఆలయంలోని శిల్పాల నృత్య భంగిమలే ప్రేరణ.
- గణపతి దేవుడి బావమరిది జాయపసేనానీ 1250లో రచించిన నృత్య రత్నావళి గ్రంథంలోని వర్ణనకు ఈ ఆలయ శిల్పాలే ప్రేరణ.
Comments
Please login to add a commentAdd a comment