ఆలయాన్ని శుభ్రం చేస్తున్న సిబ్బంది
సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం సందర్శించనున్నారు. ఆమెతోపాటు గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, మీనాక్షి లేఖి, రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతిరాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ మాలోత్ కవిత హాజరుకానున్నారు.
రాష్ట్రపతి కుటుంబసభ్యులు ఎనిమిది మంది ప్రత్యేక హెలికాప్టర్‌లో వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ములుగు జిల్లా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం కావడం, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పహారా కోసం కేంద్ర బలగాలు రెండు రోజుల ముందే రంగంలోకి దిగగా.. జిల్లా పోలీసు యంత్రాంగం ఆలయం పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. భక్తులు, పర్యాటకుల సందర్శనలను నిలిపివేశారు.
ఉదయం భద్రాద్రి.. మధ్యాహ్నం రామప్పలో పర్యటన:
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన రామప్పలో గంటన్నరపాటు కొనసాగనుంది. ఉదయం 9:50 గంటలకు ఆమె భద్రాచలం వెళ్లి.. రామయ్య దర్శనం అనంతరం ప్రసాద్ పథకం ద్వారా చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే, కురవి, ఆసిఫాబాద్ లోని ఏకలవ్య గురుకులాలను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఆ తర్వాత భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని 145 మంది ఆదివాసీలతో రాష్టపతి భేటీ కానున్నారు.
రాష్ట్రపతి మధ్యాహ్నం 2:20 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో రామప్పకు చేరుకుంటారు. హెలిపాడ్ నుంచి బ్యాటరీ కారులో 2:40 గంటలకు ఆలయానికి చేరుకొని గౌరవ వందనం స్వీకరిస్తారు. 3 గంటలకు రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రూ.60కోట్లతో చేపడుతున్న ప్రసాద్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. అదేవిధంగా కామేశ్వరాలయ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం రామప్ప గార్డెన్‌లో పరంపర బృందం చేసే గిరిజన నృత్యాలను తిలకిస్తారు. 3:40 గంటలకు ఆలయం నుంచి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 3:50 గంటలకు హెలికాప్టర్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి బయలుదేరుతుంది.
రేపు సమతామూర్తి కేంద్రానికి... :
శంషాబాద్ రూరల్: మండలంలోని ముచ్చింతల్ సమీపంలో ఉన్న సమతామూర్తి కేంద్రా(శ్రీరామానుజ జీయర్‌స్వామి)న్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం దర్శించుకోనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆమె ఇక్కడకు సాయంత్రం చేరుకుంటారు. రాష్ట్రపతి రాక సందర్భంగా ఇక్కడకు వచ్చే భక్తులు భద్రతా సిబ్బందికి సహకరించాలని నిర్వాహకులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment