
ముస్తాబైన రామప్ప
మహాశివరాత్రి ఉత్సవాలకు రామప్ప ఆలయం ముస్తాబైంది. మంగళవారం నుంచి గురువారం వరకు జరిగే ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు.
వెంకటాపురం : మహాశివరాత్రి ఉత్సవాలకు రామప్ప ఆలయం ముస్తాబైంది. మంగళవారం నుంచి గురువారం వరకు జరిగే ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. క్యూ లైన్లతోపాటు నంది విగ్రహం వద్ద ఆదనంగా మెట్లు నిర్మించారు. ట్రాన్స్‌కో అధికారులు అదనంగా రెండు ట్రాన్స్‌ఫార్మర్లను బిగించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా రామప్పలో మూడు చోట్ల చెక్‌పోస్టులను ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ బస్సులకు, ప్రేవేటు వాహనాలకు వేరువేరుగా పార్కింగ్ స్థలాలను కేటారుుంచారు. భక్తుల సౌకర్యార్థం మంగళవారం నుంచి రామప్పలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వెంకటాపురం పీహెచ్‌సీ వైద్యాధికారిణి వెంకటలక్ష్మి వెల్లడించారు.
కాగా, రామప్ప ఆలయ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే వివిధ దుకాణాలు వెలిశాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి చిందం శ్రీనివాస్, ఆలయ ఇన్‌స్పెక్టర్ పోరిక బేల్‌సింగ్, స్థానిక సర్పంచ్ కారుపోతుల పూలమ్మ సత్యం తెలిపారు. ములుగు, పరకాల, హన్మకొండ ప్రాంతాల నుండి రామప్ప దేవాలయం వరకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపిస్తున్నారు. మంగళవారం రాత్రి శ్యాం కళాబృందంచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారితెలిపారు. శివస్తుతి, శివలీలలు, కృష్ణాంజనేయయుద్దం, భగవద్గీత బోధన, మిమిక్రీ, మ్యాజిక్, డ్యాన్స్ కార్యక్రమాలు ఉంటాయన్నారు. రాత్రి 9 నుంచి తెల్లవారుజామున ఉదయం 3గంటల వరకు కార్యక్రమాలు కొనసాగుతాయని వివరించారు.
నేటి కార్యక్రమాలు
మంగళవారం ఉదయం 4.30 గంటలకు సుప్రభాతం, 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గణపతి పూజ, అఖండదీపారాధన, పుణ్యహవచనము, అంకురార్పణ, రక్షబంధనం, రుత్విక్కరణం, సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ పూజారులు కోమల్లపల్లి హరీష్‌శర్మ, ఉమాశంకర్ తెలిపారు. రాత్రి 10గంటలకు ఆలయంలో అంగరంగవైభవంగా శివపార్వతుల కల్యాణం జరిపించనున్నట్లు పేర్కొన్నారు.
200 మంది బందోబస్తు : డీఎస్పీ
మహాశివరాత్రి సందర్భంగా రామప్పలో 200 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నట్లు ములుగు డీఎస్పీ రాజమహేంద్రనాయక్ పేర్కొన్నారు. ఏదైనా సమస్య తలెత్తితే 9440795229, 9440904637 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. డీఎస్పీ వెంట ములుగు సీఐ శ్రీనివాస్‌రావు, ఎస్సై రవికుమార్ తదితరులు ఉన్నారు.