మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లాలోని కోటప్పకొండపై ఉన్న త్రిముఖ లింగం నుంచి విద్యుత్ ్రప్రభల కాంతులు
వేములవాడ: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎములాడ రాజన్న సన్నిధిలో ‘ఓం నమో.. శివాయహః.. హరహర మహాదేవ.. శంభోశంకర..’ నామస్మరణలు మార్మోగాయి.. ‘కొడుకు నియ్యి మా రాజన్నా.. నీకు కోడెను గడుతం మా రాజన్న’ లాంటి జానపద గీతాలు ధ్వనించాయి.. లయకారుడైన శివుడు లింగాకారుడై ఉద్భవించిన పర్వదినాన భక్త జనసంద్రంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధి మంగళవారం పులకించింది. స్వామివారిని సుమారు 3 లక్షల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారు.
వైభవంగా మహా లింగార్చన..: మంగళవారం ఉదయం స్వామివారికి మహాలింగార్చన వైభవంగా జరిపించారు. స్థానాచార్యులు గోపన్నగారి శంకరయ్య శర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఈ తంతు పూర్తి చేశారు. శివదీక్షాపరుల రాకతో ఆలయ ప్రాంగణం మంచిగంధ వర్ణమైంది. ఉదయం నుంచీ అర్ధరాత్రి వరకూ నిరంతరం లఘు దర్శనాలు సాగాయి. అర్ధరాత్రి తర్వాత లయకారుడి లింగోద్భవం జరిగింది. ఆ సమయంలో స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ప్రభుత్వం తరఫున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు, జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు ఉదయం 7.30 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన టీటీడీ జేఈవో శ్రీనివాస్‌రాజు ఆధ్వర్యంలో అర్చకులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఎస్పీ విశ్వజిత్ నేతృత్వంలో 1,600 మంది పోలీసు బలగాలతో భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించారు.
శివోహం..
భక్తులతో కిటకిటలాడిన కీసరగుట్ట
కీసర: మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కీసరగుట్ట మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి రామలింగేశ్వరుడిని దర్శించుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆ ప్రాంతం హోరెత్తింది. శివలింగాలకు పసుపు, కుంకుమ, పాలు, నూనె, నెయ్యిలతో అభిషేకాలు నిర్వహించారు. సుమారు రెండు లక్షల మంది స్వామివారిని దర్శిం,చుకున్నట్టు అధికారులు తెలిపారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో (లింగోద్భవకాలములో) శ్రీరామలింగేశ్వర స్వామికి సంతతధారాభిషేకం పూజను నిర్వహించారు. కలెక్టర్ ఎంవీ రెడ్డి, జే«సీ ధర్మారెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించారు.
మది నిండుగా..శివుని పండుగ
ఏపీవ్యాప్తంగా శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
శ్రీశైలం/శ్రీకాళహస్తి/నరసరావుపేట రూరల్/శ్రీకాకుళం: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంగళవారం ఏపీలోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. వేకువజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలాచరించి శివాలయాలకు తరలివచ్చారు. ఆదిదేవునికి అర్చనలు, అభిషేకాలు, రుద్రాభిషేకాలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో పూజలు జరిపారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, కోటప్పకొండలతో పాటు పంచారామా లైన అమరావతి, ద్రాక్షారామం, సామర్లకోట, భీమవరం, పాలకొల్లు క్షేత్రాలు కూడా భక్తులతో పోటెత్తాయి.
బీరంగూడలో మోదీ సోదరుడు
శివరాత్రి ఉత్సవాల సందర్భంగా పూజలు
పటాన్‌చెరు: ప్రధాని మోదీ సోదరుడు సోమాభాయ్ మోదీ మంగళవారం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని బీరంగూడ గోశాలను సందర్శించారు. గోశాల ఆవరణలోని సాయిబాబా దేవాలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.
శివరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. గోశాల మొత్తం కలియదిరిగారు. సోమాభాయ్ మోదీ మాట్లాడుతూ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాల్సిన అవసరముందన్నారు. గోశాల నిర్వాహకులు, జైగురు సాయి ఫౌండేషన్ కార్యక్రమాలను ఆయన అభినందించారు. సాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆలయ నిర్మాణానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment