lord siva temple
-
శివుడి ఎదుట మోకరిల్లి మొక్కులు చెల్లించుకున్న మేక.. ఏం కోరుకుందో ఏమో?
జంతువులు దేవుళ్లను ప్రార్థించడం ఇప్పటికే కొన్ని సందర్భాల్లో చూసే ఉంటాము. కాగా, తాజాగా ఓ మేక అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. శివుడి గర్భగుడి ముందు ఓ మేక మొకాళ్ల మీద నిలబడి ప్రార్ధనలు చేసింది. దీంతో, మేకకు చూసిన భక్తులు ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే ఈ ఘటనను సెల్ఫోన్లలో వీడియోలు తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఉన్న ఆనందేశ్వర్ మందిరంలో ఉన్న శివుడు గర్భగుడి ముందు ఓ మేక తన మొకాళ్ళ మీద మోకరిల్లి దేవుడికి ప్రార్థనలు చేసింది. గుడిలో ఉన్న భక్తులతో కలిసి ప్రార్థనలు చేసింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఈ ఘటనను వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. कानपुर के आनंदेश्वर मंदिर में बकरे का अनोखा अंदाज, बाबा को झुक-झुककर किया प्रणाम, श्रद्धालुओं की तरह टेका माथा#kanpur #Kanpurnews #Anandeshwarmandir #Hinduism #kanpurtemple #Uniquevideo pic.twitter.com/AjPTuqfMxF — Journalist Prabhat Kashyap (@Prabhat_1090) October 9, 2022 -
శైవక్షేత్రాలకు 3,325 బస్సులు
నరసరావుపేట: మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శైవక్షేత్రాలకు వెళ్లే భక్తుల వద్ద నుంచి ఆర్టీసీ పాత టికెట్ ధరలే వసూలు చేస్తుందని, ధరల్లో ఎలాంటి మార్పులూ చేయడం లేదని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు చెప్పారు. రెండేళ్లుగా డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగినా.. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ వద్ద జరిగే తిరునాళ్లకు ఆర్టీసీ సంస్థ చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు బుధవారం ఆయన నరసరావుపేటకు వచ్చారు. ఈ సందర్భంగా గ్యారేజ్ ఆవరణలో సిబ్బందికి గేట్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మార్చి ఒకటో తేదీన మహాశివరాత్రికి సంస్థ సంసిద్ధమైందన్నారు. కోటప్పకొండ, కర్నూలు జిల్లాలోని శ్రీశైలంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 96 చిన్నా, పెద్ద శైవక్షేత్రాల్లో మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా శివరాత్రి ముందురోజు, శివరాత్రి రోజున 21 లక్షల మంది కోసం 3,325 బస్సులను సిద్ధం చేసినట్టు తెలిపారు. వాటిలో 410 బస్సులు కోటప్పకొండకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. నరసరావుపేట నుంచి 285, మిగతా ప్రాంతాల నుంచి 55, ఘాట్‌రోడ్డులో 70 బస్సులు నడుస్తాయని చెప్పారు. -
హరహర మహాదేవ.. శంభోశంకర...!
వేములవాడ: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎములాడ రాజన్న సన్నిధిలో ‘ఓం నమో.. శివాయహః.. హరహర మహాదేవ.. శంభోశంకర..’ నామస్మరణలు మార్మోగాయి.. ‘కొడుకు నియ్యి మా రాజన్నా.. నీకు కోడెను గడుతం మా రాజన్న’ లాంటి జానపద గీతాలు ధ్వనించాయి.. లయకారుడైన శివుడు లింగాకారుడై ఉద్భవించిన పర్వదినాన భక్త జనసంద్రంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధి మంగళవారం పులకించింది. స్వామివారిని సుమారు 3 లక్షల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారు. వైభవంగా మహా లింగార్చన..: మంగళవారం ఉదయం స్వామివారికి మహాలింగార్చన వైభవంగా జరిపించారు. స్థానాచార్యులు గోపన్నగారి శంకరయ్య శర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఈ తంతు పూర్తి చేశారు. శివదీక్షాపరుల రాకతో ఆలయ ప్రాంగణం మంచిగంధ వర్ణమైంది. ఉదయం నుంచీ అర్ధరాత్రి వరకూ నిరంతరం లఘు దర్శనాలు సాగాయి. అర్ధరాత్రి తర్వాత లయకారుడి లింగోద్భవం జరిగింది. ఆ సమయంలో స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ప్రభుత్వం తరఫున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు, జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు ఉదయం 7.30 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన టీటీడీ జేఈవో శ్రీనివాస్‌రాజు ఆధ్వర్యంలో అర్చకులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఎస్పీ విశ్వజిత్ నేతృత్వంలో 1,600 మంది పోలీసు బలగాలతో భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించారు. శివోహం.. భక్తులతో కిటకిటలాడిన కీసరగుట్ట కీసర: మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కీసరగుట్ట మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి రామలింగేశ్వరుడిని దర్శించుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆ ప్రాంతం హోరెత్తింది. శివలింగాలకు పసుపు, కుంకుమ, పాలు, నూనె, నెయ్యిలతో అభిషేకాలు నిర్వహించారు. సుమారు రెండు లక్షల మంది స్వామివారిని దర్శిం,చుకున్నట్టు అధికారులు తెలిపారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో (లింగోద్భవకాలములో) శ్రీరామలింగేశ్వర స్వామికి సంతతధారాభిషేకం పూజను నిర్వహించారు. కలెక్టర్ ఎంవీ రెడ్డి, జే«సీ ధర్మారెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించారు. మది నిండుగా..శివుని పండుగ ఏపీవ్యాప్తంగా శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు శ్రీశైలం/శ్రీకాళహస్తి/నరసరావుపేట రూరల్/శ్రీకాకుళం: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంగళవారం ఏపీలోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. వేకువజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలాచరించి శివాలయాలకు తరలివచ్చారు. ఆదిదేవునికి అర్చనలు, అభిషేకాలు, రుద్రాభిషేకాలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో పూజలు జరిపారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, కోటప్పకొండలతో పాటు పంచారామా లైన అమరావతి, ద్రాక్షారామం, సామర్లకోట, భీమవరం, పాలకొల్లు క్షేత్రాలు కూడా భక్తులతో పోటెత్తాయి. బీరంగూడలో మోదీ సోదరుడు శివరాత్రి ఉత్సవాల సందర్భంగా పూజలు పటాన్చెరు: ప్రధాని మోదీ సోదరుడు సోమాభాయ్ మోదీ మంగళవారం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని బీరంగూడ గోశాలను సందర్శించారు. గోశాల ఆవరణలోని సాయిబాబా దేవాలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. శివరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. గోశాల మొత్తం కలియదిరిగారు. సోమాభాయ్ మోదీ మాట్లాడుతూ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాల్సిన అవసరముందన్నారు. గోశాల నిర్వాహకులు, జైగురు సాయి ఫౌండేషన్ కార్యక్రమాలను ఆయన అభినందించారు. సాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆలయ నిర్మాణానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. -
భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు
-
కరుణాసముద్రుడు కడలి కపోతేశ్వరుడు
జగతిలోని ప్రతి అణువులోనూ శివతత్వం ఇమిడి ఉన్నదన్న పరమతత్వాన్ని ప్రబోధించే దివ్యక్షేత్రం కడలి కపోతేశ్వర క్షేత్రం. తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధికెక్కిన శైవ క్షేత్రాల్లో ఒకటిగా, కుజ, రాహుకేతు దోషాలను రూపుమాపే మహిమాన్విత క్షేత్రంగా గుర్తింపు పొందింది ఈ క్షేత్రం. భక్తుల పాలిట కరుణాసముద్రుడిగా పూజలందుకుంటున్న కపోతేశ్వర స్వామివారికి ఎంతో గొప్ప పౌరాణిక నేపథ్యం ఉంది. పూర్వం అటవీ ప్రాంతంగా ఉన్న కడలి అనే ప్రాంతంలో ఒక పావురాల జంట నివాసం ఉండేది. తన వృద్ధ తల్లిదండ్రుల ఆకలి బాధను తీర్చేందుకు ఒక వేటగాడు అడవికి వేట కోసం బయలుదేరుతాడు. ఆ సమయంలో అధికంగా వర్షం కురవడంతో వేటగాడికి ఎటువంటి ఆహారం లభ్యం కాదు. వర్షానికి తడిసి ముద్దయిన వేటగాడు పావురాలు కాపురం ఉంటున్న చెట్టుకింద తలదాచుకుంటాడు. చలికి వణుకుతూ తన తల్లిదండ్రులకు ఆహారం సంపాదించి పెట్టలేని జీవితం ఎందుకని బాధతో తల్లడిల్లిపోతాడు. చెట్టుపైన ఉన్న పావురాలు వేటగాడి బాధను గ్రహించి తమ గూటిలోని ఎండుపుల్లలను చెట్టు కింద ఉంచి పక్కనే ఉన్న శ్మశానంలోని రగులుతున్న నిప్పుపుల్లను తెచ్చి మంట రాజేసి వేటగాడిని చలిబాధ నుంచి విముక్తి చేస్తాయి. చలి నుంచి తేరుకున్న వేటగాడిని తమ అతిథిగా భావించి పావురాల జంట ఆ మంటలో దూకి ప్రాణత్యాగం చేసి వేటగాడికి ఆహారమవుతాయి. పావురాల త్యాగానికి చలించిపోయిన వేటగాడు, వాటి ఔదార్యం ముందు తానెంత అనే భావనతో విరక్తి చెంది అదే మంటలో దూకి ఆత్మత్యాగం చేసుకుంటాడు. పావురాల అతిథి ధర్మానికి, కారుణ్యానికి పరమశివుడు సంతోషించి ప్రత్యక్షమై పావురాల జంటను తనలో ఐక్యం చేసుకుంటాడు. పావురాలు మహాశివుడిని ప్రార్థించి వేటగాడిని బతికించాలని వేడుకుంటాయి. అలాగే తాము ప్రాణత్యాగం చేసుకున్న ప్రాంతంలో భక్తులను అనుగ్రహించేందుకు ఆ ప్రాంతంలో ఆవిర్భవించవలసిందిగా కోరడంతో పరమశివుడు శ్రీ కపోతేశ్వర స్వామిగా కొలువుదీరారు. కపోత జంటను తనలో లీనం చేసుకున్న గుర్తుగా శివలింగంపై రెండు వైపులా పావురాల తల, రెక్కలు, తోక గుర్తులు ఉంటాయి. వీటిని స్వామి వారికి అభిషేకాలు చేసే సమయంలో నిజరూప దర్శనంలో భక్తులు వీక్షించవచ్చు. గర్భాలయంలో ఉత్తరాభిముఖంగా ఆవిర్భవించిన స్వామికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి తన పడగలతో నీడపట్టాడు. అందుకే ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి నాగేంద్రుని రూపంలో ఇలవేల్పుగా వెలియడంతో శివలింగంతో పాటు నాగేంద్రుడు కూడా ఒకే పీఠంపై నిత్య పూజలు అందుకుంటున్నారు. నిత్యం శ్రీ కపోతేశ్వరస్వామి వారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, ప్రతి మాస శివరాత్రికి లక్షబిల్వార్చన పూజలు జరుగుతాయి. మార్గశిర మాసంలో జరిగే సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలకు సుబ్రహ్మణ్యేశ్వరునికి అంగరంగ వైభవంగా కల్యాణోత్సవాలు జరిపిస్తారు. గంగాజలం అంతర్వాహినిగా... ఆలయానికి అనుకుని ఉన్న కొలను కపోతగుండం (చెరువు)గా ప్రసిద్ధి చెందింది. కాశీలోని గంగాజలం ఈ గుండంలోకి అంతర్వాహినిగా ప్రవహిస్తోందని భక్తుల విశ్వాసం. ప్రతి మాఘమాసం ఆదివారం నాడు కాశీ నుంచి గంగాజలం అంతర్వాహినిగా వచ్చి కపోతగండంలో కలవటంతో ఆ రోజు మారేడు పత్రాలు ఆ గుండంలో వేస్తే మునిగిపోతాయని, ఆ రోజున కపోత గుండంలో స్నానమాచరించి కపోతేశ్వరుని దర్శిస్తే మోక్షం కలుగుతుందని అర్చకులు వివరిస్తున్నారు. శ్రీ చక్ర సహిత త్రిపుర సుందరీ దేవి జగద్గురువులు ఆది శంకరాచార్యులు భారత దేశ పాదయాత్ర చేస్తూ అష్టోత్తర శ్రీ చక్ర సహిత అమ్మవార్ల ఆలయాలను 108 చోట్ల ప్రతిష్ట చేశారు. దీనిలో భాగంగా ఈ క్షేత్రంలో శ్రీ కపోతేశ్వరస్వామి వారి ఆలయానికి ఎడమవైపు శ్రీ చక్ర సహిత బాలా త్రిపుర సుందరీదేవి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అమ్మవారికి నిత్య కుంకుమపూజలు నిర్వహిస్తారు. క్షేత్ర పాలకుడు జనార్దనుడు కపోతేశ్వరస్వామి ఆలయానికి క్షేత్ర పాలకుడుగా జనార్దన స్వామి ఉన్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో వినాయకుడు, భద్రకాళీసమేత వీరభద్రస్వామి, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, కుమార స్వామి, కనకదుర్గాదేవి, నవగ్రహాలు, కాలభైరవస్వామి, శ్రీ చక్ర సహిత బాలాత్రిపుర సుందరీదేవి, చండీశ్వరుడు, లింగాకారంలో సూర్యనారాయణమూర్తి, పార్వతీదేవి, శ్రీదేవి భూదేవి సమేత సత్యనారాయణస్వామి, సువర్చల సహిత ఆంజనేయస్వామి వారి ఉపాలయాల్లో కొలువుతీరారు. సంతాన ం లేని దంపతులు స్వామిని దర్శించుకుని పూజ చేస్తే సంతానం కలుగుతుందని నమ్మకం. చారిత్రక నేపథ్యం క్రీ.శ. 15, 16 శకాలలో పల్లవ రాజులు కపోతేశ్వరస్వామికి ఆలయాన్ని నిర్మించినట్టుగా ఆలయ ఆవరణలో దేవనాగర లిపిలో శాసనం ఉంది. రెండు కపోతాలు, ఒక వేటగాడు చేసిన ప్రాణత్యాగానికి ప్రతీకగా శివుడు ఈ ప్రాంతంలో వెలసినట్టు పురాణగాథతోపాటు బోయవాడు స్వామికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టుగా శిలారూపం ఉంది. ఈ క్షేత్రాన్ని ఇలా చేరుకోవచ్చు... కడలి శ్రీ కపోతేశ్వరస్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులు క్షేత్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న తాటిపాక సెంటరు చేరుకోవాలి. అక్కడ నుంచి ఆటోలు లేదా ట్యాక్సీల ద్వారా క్షేత్రానికి వెళ్లవచ్చు. రాజమండ్రి నుంచి 71 కి.మీ., రాజోలు నుంచి 8 కి.మీ., అమలాపురం నుంచి 22 కి.మీ., దూరం. సమీపంలోని దర్శనీయ క్షేత్రాలు శ్రీ కడలి కపోతేశ్వరస్వామి వారి ఆలయానికి సమీపంలో పలు దర్శనీయ క్షేత్రాలు ఉన్నాయి. ఈ క్షేత్రానికి 10 కి.మీ., దూరంలో ఆదుర్రు గ్రామంలో బౌద్ధస్తూపం, 15 కి.మీ., దూరంలో అప్పనపల్లి గ్రామంలో శ్రీ బాలబాలాజీ ఆలయం, 30 కి.మీ., దూరంలో రాజోలు మీదుగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం, 35 కి.మీ. దూరంలో అమలాపురం మీదుగా అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి ఆలయాలు ఉన్నాయి. కుజదోష నివారణ క్షేత్రం స్వయంభువుగా కొలువుతీరిన స్వామి వారి ఆలయంలో శైవాగమ సంప్రదాయం ప్రకారం నిత్య పూజలు, అభిషేకాలు జరుగుతాయి. భక్తులు 11 మంగళవారాలు క్రమం తప్పకుండా స్వామి వారిని దర్శించుకుంటారు. వివాహం కాని వారు, సంతానం లేని దంపతులు, కుజ దోష నివారణ కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి విచ్చేస్తారు. కాకాని వెంకట సత్య కృష్ణకుమార్, ప్రధాన అర్చకులు - వి. వీర నాగేశ్వరరావు సాక్షి, రాజోలు -
కదిలిస్తే... కదిలే శివుడు
ఆదిలాబాద్ జిల్లాలోని బేలమండలం సదల్పూర్ గ్రామంలో ఉన్న భైరందేవ్, మహాదేవ్ ఆలయాలకు ఎంతో విశిష్ఠత ఉంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి సదల్పూర్ 42 కిలోమీటర్లు. ఇక్కడికి ఆదిలాబాద్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. సదల్పూర్ నుంచి కిలోమీటర్ దూరంలో ఈ రెండు ఆలయాలు ఉంటాయి. భైరందేవ్ ఆలయంలో ఆదివాసీల దేవతామూర్తులు, మహదేవ్ ఆలయంలో శివలింగం ఉంటుంది. ఈ రెండు ఆలయాలను శాతవాహనులు నిర్మించారు. ఇవి పూర్తిగా నల్లరాతితో నిర్మించి శాతవాహనుల కళావైభవాన్ని గుర్తుకు తెస్తాయి. ఇప్పటికి అందమైన శిల్పాలు చెక్కుచెదరకుండా మనకు దర్శనమిస్తాయి. మనసులో ఏదైనా కోరుకుని ౖభైరందేవ్ ఆలయంలోని లింగాన్ని పైకి ఎత్తాలి. ఆ కోరిక తీరేదైతే లింగం సులువుగా పైకి లేస్తుందని, లేదంటే కదలదని నమ్మకం. ఈ ఆలయాల్లోని దేవతామూర్తులు ఆదివాసీల ఆరాధ్య దైవం అయినప్పటికి ఆదివాసీలే కాకుండా ఇతరులు కూడా వస్తుంటారు. మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తారు. జంగిజాతర అటవీ ప్రాంతంలో ప్రకృతి ఒడిలో ఆహ్లాదమైన వాతావరణంలో ఉండే ఈ ఆలయాలు ఎంతో ప్రాచీనం కలిగినవి. ఏటా పుష్యమాసంలో బైరందేవ్ పక్కనే ఉన్న మహదేవ్ ఆలయాల్లో జాతర నిర్వహిస్తారు. అటవీ ప్రాంతంలో ఉండడంతో ఇక్కడ నిర్వహించే జాతరను జంగి జాతరగా పిలుచుకుంటారు. మండలంలోనే అతిపురాతన ఆలయాలుగా ఇవి నిలిచిపోయాయి. ప్రతి ఏటా పుష్యమాసం నవమి రోజున ప్రత్యేక అభిషేకాల ద్వారా జాతర ప్రారంభమవుతుంది. ఈ ఆలయాల్లో కొరంగే వంశీయులతోనే పూజలు ప్రారంభిస్తారు. వారం రోజుల పాటు జరిగే ఈ జాతరకు ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలివస్తారు. వారంరోజుల పాటు కొనసాగి అమావాస్య రోజున ‘కాలదహి హండి’ కార్యక్రమం నిర్వహించి జాతర ముగిస్తారు. కాలదహి హండికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కుండలో పెరుగు వేసి, ఆలయం పైభాగంలో జెండా ఎగురవేస్తారు. అనంతరం ఆ కుండను పగలగొట్టి అందులోని పెరుగును కింద అప్పటికే ఉంచిన పాలు, కుడుకలు, అటుకులతో ఉన్న ప్రసాదంలో కలిసే విధంగా ఏర్పాటుచేస్తారు. ఇలా పెరుగుతో కలిసిన ఈ ప్రసాదాన్ని భక్తుల చేతులకు ఇవ్వకుండా ఆలయంపై నుంచి విసిరి వేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ ప్రసాదాన్ని భక్తులు ఎంతో ఆత్రుతగా అందుకుంటారు. ఈ జాతర 48 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నారు. గత 24 ఏళ్ల నుంచి జాతర ముగింపు రోజు దర్బార్ నిర్వహిస్తున్నారు. – రొడ్డ దేవిదాస్, సాక్షి ఆదిలాబాద్ -
ఒక నిమిషం - ఒక విషయం
ఈశాన్యాన దేవుణ్ణి పెట్టే వీలులేకపోతే? మారిన జీవన పరిణామాల దృష్ట్యా, ఉద్యోగ నిర్వహణల వల్ల ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తుంది. అప్పుడు దేవుణ్ణి ఈశాన్యాన పెట్టుకునే అవకాశం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు దేవుడు పశ్చిమాన్ని చూసేలా ఏర్పాటు చేసుకోవాలి. దేవుడి మందిరం మన కనుదృష్టికి సరిగ్గా ఎదురుగా ఉండాలి. పిల్లలు లేని వారు సుబ్రమణ్యస్వామిని ఎందుకు పూజిస్తారు? పార్వతి, పరమేశ్వరులను దర్శించడానికి అనేకమంది తాపసులు కైలాసానికి వస్తారు. అందులో దిగంబర ఋషులు ఉండటంతో సుబ్రమణ్యస్వామి హేళనగా నవ్వాడు. దానికి పార్వతీదేవి పుత్రుని మందలించి, మర్మాంగాలు సృష్టి వృద్ధికోసం సృష్టించినవి. జాతికి జన్మస్థానాలు అని తెలియచెప్పింది. తల్లి జ్ఞానబోధతో సుబ్రమణ్యస్వామి సర్పరూపం దాల్చాడు కొంతకాలం. జీవకణాలు పాముల్లా ఉంటాయని మనకు తెల్సిందే. ఆ తర్వాత వాటికి అధిపతి అయ్యాడు. అందువల్లే జీవకణాల అధిపతి అయిన సుబ్రమణ్యస్వామిని పూజిస్తే పిల్లలు పుట్టని దంపతులకు సంతానం కలుగుతుందని పండితోక్తి. మహాభారత రచన ఎక్కడ జరిగింది? వ్యాసుడు చెపుతుంటే వినాయకుడు ఘంటం ఎత్తకుండా వ్రాసింది మన భారతదేశ చివర గ్రామమైన ‘మాన’లో. హిమాలయాల్లో ఉంది ఈ గ్రామం. బద్రినాథ్ వెళ్ళినవారు తప్పనిసరిగా ఈ గ్రామాన్ని దర్శిస్తారు. ‘జయ’ కావ్యమనే మహాభారతాన్ని వినాయకుడు వ్యాసుని పలుకు ప్రకారం రాస్తుంటే పక్కన ప్రవహిస్తున్న సరస్వతి నది తన పరుగుల, ఉరుకుల శబ్దాలకి అంతరాయం కలగకూడదని మౌనంగా ప్రవహించిందట. హనుమంతుడికి, సువర్చలకు వివాహం జరిగిందా? కొన్ని ఆలయాల్లో ఏకంగా వివాహం కూడా జరిపిస్తున్నారు. హనుమంతుడు బ్రహ్మచారి. సూర్యుని కుమార్తె పేరు సువర్చల. హనుమ సూర్యుని వద్ద విద్యాభ్యాసం చేశాడు. ఆ సమయంలో సువర్చల హనుమని ఇష్టపడింది. విషయం తెలిసిన సూర్యుడు విద్యాభ్యాసం అనంతరం హనుమని గురుదక్షిణగా సువర్చలను వివాహమాడమన్నాడు. హనుమ కలియుగాంతం వరకు ఆగమన్నాడు. ఆ తర్వాత వివాహం చేసుకుంటానని చెప్పాడు. కాబట్టి సువర్చలను హనుమ కలియుగం అంతమైన తర్వాతే వివాహం చేసుకుంటాడు. ఇచ్చిన మాట ప్రకారం, సూర్యునికిచ్చిన గురుదక్షిణ ప్రకారం. -
కృష్ణాజిల్లా శివాలయంలో చోరీ
కృష్ణాజిల్లా: కృష్ణాజిల్లాలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. కైకలూరు మండలం భుజదలపేట గ్రామంలోని పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు రూ. 70 వేలు విలువ చేసే ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం ఆలయ తాళాలు పగులగొట్టి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు... క్లూస్‌టీం సాయంతో దర్యాప్తు చేస్తున్నారు.