ఆదిలాబాద్ జిల్లాలోని బేలమండలం సదల్‌పూర్ గ్రామంలో ఉన్న భైరందేవ్, మహాదేవ్ ఆలయాలకు ఎంతో విశిష్ఠత ఉంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి సదల్‌పూర్ 42 కిలోమీటర్లు. ఇక్కడికి ఆదిలాబాద్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. సదల్‌పూర్ నుంచి కిలోమీటర్ దూరంలో ఈ రెండు ఆలయాలు ఉంటాయి. భైరందేవ్ ఆలయంలో ఆదివాసీల దేవతామూర్తులు, మహదేవ్ ఆలయంలో శివలింగం ఉంటుంది. ఈ రెండు ఆలయాలను శాతవాహనులు నిర్మించారు. ఇవి పూర్తిగా నల్లరాతితో నిర్మించి శాతవాహనుల కళావైభవాన్ని గుర్తుకు తెస్తాయి. ఇప్పటికి అందమైన శిల్పాలు చెక్కుచెదరకుండా మనకు దర్శనమిస్తాయి. మనసులో ఏదైనా కోరుకుని ౖభైరందేవ్ ఆలయంలోని లింగాన్ని పైకి ఎత్తాలి. ఆ కోరిక తీరేదైతే లింగం సులువుగా పైకి లేస్తుందని, లేదంటే కదలదని నమ్మకం. ఈ ఆలయాల్లోని దేవతామూర్తులు ఆదివాసీల ఆరాధ్య దైవం అయినప్పటికి ఆదివాసీలే కాకుండా ఇతరులు కూడా వస్తుంటారు. మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తారు.
జంగిజాతర
అటవీ ప్రాంతంలో ప్రకృతి ఒడిలో ఆహ్లాదమైన వాతావరణంలో ఉండే ఈ ఆలయాలు ఎంతో ప్రాచీనం కలిగినవి. ఏటా పుష్యమాసంలో బైరందేవ్ పక్కనే ఉన్న మహదేవ్ ఆలయాల్లో జాతర నిర్వహిస్తారు. అటవీ ప్రాంతంలో ఉండడంతో ఇక్కడ నిర్వహించే జాతరను జంగి జాతరగా పిలుచుకుంటారు. మండలంలోనే అతిపురాతన ఆలయాలుగా ఇవి నిలిచిపోయాయి. ప్రతి ఏటా పుష్యమాసం నవమి రోజున ప్రత్యేక అభిషేకాల ద్వారా జాతర ప్రారంభమవుతుంది. ఈ ఆలయాల్లో కొరంగే వంశీయులతోనే పూజలు ప్రారంభిస్తారు. వారం రోజుల పాటు జరిగే ఈ జాతరకు ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలివస్తారు. వారంరోజుల పాటు కొనసాగి అమావాస్య రోజున ‘కాలదహి హండి’ కార్యక్రమం నిర్వహించి జాతర ముగిస్తారు. కాలదహి హండికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కుండలో పెరుగు వేసి, ఆలయం పైభాగంలో జెండా ఎగురవేస్తారు. అనంతరం ఆ కుండను పగలగొట్టి అందులోని పెరుగును కింద అప్పటికే ఉంచిన పాలు, కుడుకలు, అటుకులతో ఉన్న ప్రసాదంలో కలిసే విధంగా ఏర్పాటుచేస్తారు. ఇలా పెరుగుతో కలిసిన ఈ ప్రసాదాన్ని భక్తుల చేతులకు ఇవ్వకుండా ఆలయంపై నుంచి విసిరి వేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ ప్రసాదాన్ని భక్తులు ఎంతో ఆత్రుతగా అందుకుంటారు. ఈ జాతర 48 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నారు. గత 24 ఏళ్ల నుంచి జాతర ముగింపు రోజు దర్బార్ నిర్వహిస్తున్నారు.
– రొడ్డ దేవిదాస్, సాక్షి ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment