
నరసరావుపేట: మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శైవక్షేత్రాలకు వెళ్లే భక్తుల వద్ద నుంచి ఆర్టీసీ పాత టికెట్ ధరలే వసూలు చేస్తుందని, ధరల్లో ఎలాంటి మార్పులూ చేయడం లేదని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు చెప్పారు. రెండేళ్లుగా డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగినా.. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ వద్ద జరిగే తిరునాళ్లకు ఆర్టీసీ సంస్థ చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు బుధవారం ఆయన నరసరావుపేటకు వచ్చారు.
ఈ సందర్భంగా గ్యారేజ్ ఆవరణలో సిబ్బందికి గేట్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మార్చి ఒకటో తేదీన మహాశివరాత్రికి సంస్థ సంసిద్ధమైందన్నారు. కోటప్పకొండ, కర్నూలు జిల్లాలోని శ్రీశైలంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 96 చిన్నా, పెద్ద శైవక్షేత్రాల్లో మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా శివరాత్రి ముందురోజు, శివరాత్రి రోజున 21 లక్షల మంది కోసం 3,325 బస్సులను సిద్ధం చేసినట్టు తెలిపారు. వాటిలో 410 బస్సులు కోటప్పకొండకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. నరసరావుపేట నుంచి 285, మిగతా ప్రాంతాల నుంచి 55, ఘాట్‌రోడ్డులో 70 బస్సులు నడుస్తాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment